గుడుంబా తయారీని ఉక్కుపాదంతో అణిచివేస్తాం!
posted on May 3, 2020 @ 6:13PM
తెలంగాణ రాష్ట్రంలో గుడుంబా తయారీని ఉక్కుపాదంతో అణిచి వేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎక్సైజ్ కార్యాలయ పరిధిలో సి ఐ, మరో ముగ్గురు కానిస్టేబుళ్లపై కిష్టరం తాండ లో గుడుంబా తయారీదారులు దాడి చేయగా దాడిలో గాయపడిన ఎక్సైజ్ సి ఐ ని, సిబ్బందిని మంత్రి జడ్చర్ల ఎక్సైజ్ కార్యాలయం వద్ద పరామర్శించి మీడియాతో మాట్లాడారు.
గుడుంబా తయారు చేస్తున్న వారిని ఉక్కుపాదంతో అణిచి వేస్తామని అన్నారు. అంతేకాక పిడి యాక్ట్ తో పాటు ఇతర చట్టాలను కూడా ఉపయోగిస్తామన్నారు. ప్రణాళికాబద్ధంగా ఎక్సైజ్, పోలీస్ శాఖల సంయుక్త సహకారంతో గుడుంబాను అణిచివేస్తామన్నారు. గుడుంబా నిర్మూలన ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. ప్రజలు ప్రాణాలు తమకు ముఖ్యమని, దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు రావు గారు గుడుంబా రహిత తెలంగాణగా తీర్చిదిదామన్నారు. అయితే కొందరు లాక్ డౌన్ ను అదనుగా తీసుకొని ఇతర రాష్ట్రాల నుండి బెల్లం ఇతర పదార్థాలు తీసుకువచ్చి ఆక్రమంగా గుడుంబా తయారు చేయడం బాధాకరమన్నారు. అయినప్పటికీ ఇలాంటి తయారీదారులను అరికడతామని మంత్రి పునరుద్ఘాటించారు. సిబ్బంది దాడులను ధైర్యంగా ఎదుర్కోవడమే కాక గుడుంబా స్థావరాలను ధ్వంసం చేసి రావడం పట్ల ఆయన అభినందనలు తెలిపారు.
తమ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలు ముఖ్యమని కరోనా లాక్ డౌన్ సందర్భంగా ఎక్సైజ్ శాఖ సిబ్బంది ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్తగా ఉద్యోగులకు లక్ష 70 వేల శాని టైజర్లను రాష్ట్రంలో పంపిణీ చేశామని మంత్రి తెలిపారు.
లాక్ డౌన్ కారణంగా మందు దొరకనందున కొంతమంది తాగుడుకు బానిసైన వారు దొంగతనంగా గుడుంబా తయారు చేయడం, షాప్ ల లో దొంగతనం గా అమ్మటం వంటివి చేస్తున్నారని అని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గుడుంబా రహిత తెలంగాణ గా తీర్చిదిద్దేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేసి పునరావాసం కల్పించడం జరిగిందని, దీనివల్ల తండాలలో గుడుంబా తయారు చేసే వారి ఆరోగ్య పరిస్థితి మెరుగు పడటమే కాకుండా, వారు వివిధ జీవనోపాధి పొందారని, ముఖ్యంగా చాలా మంది గుడుంబా తయారీదారులు ఆటోలు, మేకలు ఇతర వ్యాపారాలను చూసుకున్నారని తెలిపారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించడం , వ్యవసాయ పనులు పెరిగిపోవటం వల్ల గిరిజన ప్రాంతాలలో గుడుంబా తయారుచేసే సంస్కృతి తగ్గిపోయిందని ఆయన తెలిపారు. అయితే లాక్ డౌన్ కారణంగా గుడుంబా అక్రమంగా తయారు చేయడం బాధాకరమని మంత్రి తెలిపారు. అయినప్పటికీ తాము ఎలాంటి వారిని వదిలిపెట్టమని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిని అసలు సహించమని హెచ్చరించారు. కొంతమంది కెమికల్స్ ను ఉపయోగించి కూడా గుడుంబాను తయారు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ,అలాంటి వారిని కూడా వదలబోమని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం అన్ని రంగాలలో అభివృద్ధిలో ముందుందని, రాష్ట్రంలో పేద ప్రజలకు అవసరమైన ఆసరా పెన్షన్లు, పాఠశాలలు ఇతర అన్ని రకాల సేవలు అందిస్తున్నామని ,ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో ఎన్నో పథకాలను అమలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎక్కడైనా గిడుంబా తయారు చేస్తున్నట్లు అనుమానం వస్తే యువకులు తక్షణమే ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించాలని ,అంతకాక మీడియా కూడా గుడుంబా నిర్మూలనలో ముఖ్యమైన పాత్ర పోషించాలని మంత్రి కోరారు.