టీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వని నేతలకు అభయహస్తం అందిస్తున్న కాంగ్రెస్ , బీజేపీ
posted on Dec 27, 2019 @ 3:25PM
కాంగ్రెస్ పార్టీకి కంచు కోటలా ఉన్న సూర్యపేట జిల్లాలో ఇప్పుడు గులాబీ జెండాలే కనిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. వార్డుల వారీగా ఓటర్ల గణన అభ్యంతరాల స్వీకరణ పూర్తయ్యాక రిజర్వేషన్ల ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్, తిరుమలగిరి, నేరేడుచర్ల మున్సిపాల్టీల్లో సందడి పెరిగింది. ఆ మున్సిపాల్టీల్లో సమీప గ్రామాల విలీనం వల్ల వార్డుల సంఖ్య పెరిగింది. సూర్యాపేట జిల్లా పరిధిలో గతంలో 100 వార్డులుండగా కొత్త మున్సిపాలిటీ చట్టం మేరకు ఆ సంఖ్య 141 కి పెరిగింది. ప్రస్తుతం సూర్యాపేటలో 48 వార్డులు, కోదాడలో 35, హుజూర్ నగర్ లో 28 తిరుమల గిరిలో 15, నేరెడుచర్లలో 15 వార్డులున్నాయి.
అన్ని చోట్ల వలస నేతలు కారణంగా అధికార టీఆర్ఎస్ లో తీవ్రమైన పోటీ నెలకొంటుంది.సూర్యాపేట మున్సిపాలిటీలో గతంలో 34 వార్డులు ఉండేవి 7 సమీప గ్రామాల విలీనంతో ఆ వార్డుల సంఖ్య 48 కి చేరింది. 2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ కేవలం నాలుగు స్థానాలకే పరిమితమైంది. కానీ ఇతర పార్టీల నేతలు గులాబీ దళంలో చేరి ఆ పార్టీకి మద్దతిచ్చారు. దీంతో చైర్మన్ పీఠం టీఆర్ఎస్ దక్కించుకుంది.2014 నుంచి 2018 లో అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల వరకు పెద్ద ఎత్తున ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్ లోకి వలసొచ్చారు. ఫలితంగా అధికార పార్టీలో ఆశావహుల సంఖ్య అంతకంతా పెరిగింది. సూర్యాపేట మున్సిపాలిటీలో ఒక్కో వార్డుకి సుమారు 5 గురు కంటే ఎక్కువ మంది కౌన్సిలర్ గా పోటీ చేసేందుకు ఆరాటపడుతున్నారు.
ప్రస్తుతం రాబోతున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి వార్డులో గులాబీ జెండా ఎగరాల్సిందే అన్న పట్టుదలతో ఆ పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నారు.జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్, తిరుమలగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీలో అధికార పార్టీలు చాలా మంది అభ్యర్ధులుంటే విపక్ష కాంగ్రెస్ లో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన వీరాభిమానులు సైతం గులాబీ గూటికి చేరడంతో హస్తం పార్టీకి కౌన్సిలర్ అభ్యర్థులే కొరవడ్డారు. జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో పూర్తిగా నిరుత్సాహం పేరుకుపోయింది. పొరపొరులో అయినా పరిస్థితి మారుతుందేమో అని ఆ పార్టీ పెద్దలు ఆశ పెట్టుకున్నారు.సూర్యపేట జిల్లాలో 2014 ఎన్నికల నాటికి తెలుగుదేశం బాగా డీలా పడింది.
2018 ఎన్నికల్లో టిడిపి పక్షాన కోదాడ అసెంబ్లీ టిక్కెట్ ఆశించి భంగపడిన బొల్లం మల్లయ్య యాదవ్ చివరి నిమిషంలో టీఆర్ఎస్ లో చేరి విజయం సాధించారు .ఇదే జిల్లాకు చెందిన పాల్వాయి రజనీకుమారి కూడా బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. మొన్న జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టిడిపి బరిలోకి దిగినప్పటికీ డిపాజిట్ గల్లంతయ్యింది. ఇక పొరుగూరి విషయానికొస్తే జిల్లా వ్యాప్తంగా టిడిపికి అభ్యర్ధులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది.సూర్యాపేట జిల్లా కేంద్రంలో బిజెపికి కొంత పట్టుంది. కానీ మిగతా మున్సిపాలిటీల్లో మాత్రం కమలదళానికి ఇబ్బందికర పరిస్థితి అని తెలిసిందే.ఈ తరుణంలో టీఆర్ఎస్ లో టికెట్లు ఆశించి భంగపడే నేతలను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ బిజెపిలు కాచుకోని ఉన్నాయి. ఇది పరీక్షా సమయం కనుక టికెట్లు ఆశించే వరకు ఉండి అవసరమైతే జంప్ అవ్వటానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం.