జానారెడ్డి రాజకీయ సన్యాసం.. సాగర్ ఓటమితో సంచలనం
posted on May 2, 2021 @ 6:54PM
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజకీయ కురువృద్ధుడు కుందూరు జానా రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ సన్యాసం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని ప్రకటించారు జానారెడ్డి. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఓటమి తర్వాత.. ఈ సంచలన నిర్ణయం ప్రకటించారు జానా రెడ్డి. సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి పోటీ చేయరని, ఆయన తనయుడు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే తమకు అత్యంత కీలకమైన ఎన్నిక కావడంతో కాంగ్రెస్ పెద్దలంతా జానారెడ్డిని పోటీ చేయాలని కోరారని తెలుస్తోంది. ఎన్నికల్లో గెలుపు కోసం జానారెడ్డి తీవ్రంగా శ్రమించారు. గతంలో ఎప్పుడు లేనంతగా ఆయన ప్రచారం చేశారని చెబుతున్నారు. అయినా ఫలితం వ్యతిరేకంగా రావడంతో రాజకీయాల నుంచి తప్పుకోవాలని జానారెడ్డి నిర్ణయించారని చెబుతున్నారు.
నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. ఎగ్టిట్ పోల్స్ అంచనాలు కంటే మిన్నగా మంచి మెజార్టీతో ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన నోముల భగత్.. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై 18 వేల 8 వందల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 25 రౌండ్లలో కౌంటింగ్ జరగగా.. రెండు రౌండ్ల మినహా అన్ని రౌండ్లలోనూ భగత్ కు లీడ్ వచ్చింది. తొలి రౌండ్ నుంచే ఆధిక్యంలోకి దూసుకుపోయారు భగత్. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ ఆయనకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. నియోజకవర్గం పరిధిలో ఏడు మండలాలు ఉండగా.. అనుమల తప్ప మిగితా అన్ని నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ లీడ్ సాధించింది.
నాగార్జున సాగర్ నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ కు , జానారెడ్డికి కంచుకోటగా ఉంది. గతంలో చలకుర్తి నియోజకవర్గంగా ఉండగా.. 2009లో జరిగిన పునర్విభజనలో నాగార్జున సాగర్ నియోజకవర్గంగా మారింది. ఇక్కడి నుంచి 11 సార్లు పోటీ చేసిన జానారెడ్డి.. ఏడు సార్లు గెలిచారు. తొలిసారి తొలిసారి పోటీ చేసిన ఓడిపోయిన జానారెడ్డి.. 1985 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 1999లో తొలిసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ చేతిలో ఓడిపోయారు. తర్వాత 2018లో దివంగల నోముల నర్సింహయ్య చేతిలో ఓడిపోయారు. నోముల మరణంతో జరిగిన ఉపఎన్నికలో ఆయన తనయుడు నోముల భగత్ చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు జానారెడ్డి. దీంతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.