ఏపీలో పరీక్షలు లేవు..
posted on May 2, 2021 @ 6:01PM
కరోనా ఆ పేరు వింటే.. గుండెల్లో విశాఖ రైల్ పరుగెడుతోంది. సెకండ్ వేవ్ సృష్టిస్తున్న విలయం అంతా ఇంత కాదు. ఇలాంటి టైం లో స్టూడెంట్స్ ప్రమాదం అవుతుందని ఆలోచించకుండా జగన్ ప్రభుత్వం ఇంటర్ పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధం అయింది. ప్రతి పక్షాలు ఎన్ని విమర్శలు చేసిన ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై ప్రతి పక్షాలు దుమ్మెత్తి పోశాయి. చివరికి ఈ విషయం పై ఏపీ న్యాయస్థానం కూడా జోక్యం చేసుకుంది. అయినా ఎవరు ఎన్ని చెప్పిన జగన్ ప్రభుత్వం మాట వినలేదు.
పగ్గాలు లేకుండా పరుగెడుతున్న జగన్ ప్రభుత్వానికి హైకోర్టు బ్రేకులు వేసింది. మెడలు వంచింది. ఏపీ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కరోనా క్రమంలో ఎట్టకేలకు ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇంటర్ మీడియట్ పరీక్షల నిర్వహణ మీద పునరాలోచన చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, న్యాయస్థానం అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షలను వాయిదా వేస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్నామని అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడ్డాక ఇంటర్ పరీక్షల తేదీలు ప్రకటిస్తామని వెల్లడించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.