క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన సీఎం రేవంత్

ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై అద్భుత ప్రదర్శన చేసి టీమ్ ఇండియాను విజయంలో కీలక పాత్ర పోషించి, మ్యాన్ ఆఫ్ ది ఫైనల్ గా నిలిచిన క్రికెటర్   తిలక్ వర్మ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంగళవారం (సెప్టెంబర్ 30) భేటీ అయ్యాడు. హైదరాబాద్ కు చెందిన తిలక్ వర్మ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా తిలక్ వర్మను అభినందించి సత్కరించారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా తిలక్ వర్మ తాను సంతకం చేసిన బ్యాట్ ను సీఎంకు బహూకరించాడు.   

ఆసియాకప్ ఫైనల్ లో పాకిస్థాన్ పై టీమ్ ఇండియా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన తెలుగుతేజం తిలక్ వర్మపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ లు తిలక్ వర్మను అభినందిస్తూ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే.  మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ.. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌‌తో పిచ్‌ను పూర్తిగా తన కంట్రోల్‌లోకి తీసుకున్నాడనీ, ఒత్తిడిలోనూ అతని ప్రశాంతత, ప్రతిభ స్ఫూర్తిదాయకమనీ చంద్రబాబు ట్వీట్ చేశారు.  

సొంత బిడ్డ, అల్లుడి ఫోన్లను ట్యాప్ చేసిన నీచ సంస్కృతి వారిది : బండి సంజయ్

  ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి కేటీఆర్‌లకు సిట్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. తనతో పాటు పలువురు అగ్ర నేతల ఫోన్లను ట్యాప్ చేయడమే కాకుండా, అనేక కుటుంబాల్లో చిచ్చు పెట్టారని ఆరోపించారు. ఆఖరికి కన్న బిడ్డ, అల్లుడి ఫోన్లను కూడా ట్యాప్ చేసిన నీచమైన చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా మంచి పేరు ఉన్న ఎస్ఐబీ వ్యవస్థను రాష్ట్రంలో భ్రష్టుపట్టించారని ఆరోపించిన బండి సంజయ్, ఎస్ఐబీని అడ్డుపెట్టుకుని కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. కేసీఆర్‌, కేటీఆర్‌లకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటారా? లేక పూర్తిస్థాయిలో విచారణ జరిపి దోషులను తేలుస్తారా? అన్నది అనుమానంగానే ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును టీవీ సీరియల్‌లా సాగదీస్తున్నారే తప్ప, గట్టి చర్యలు కనిపించడం లేదని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు మొదలైనప్పటి నుంచి ప్రారంభమైన టీవీ సీరియల్ ఎపిసోడ్‌లు కూడా పూర్తయ్యాయని, కానీ ఈ కేసు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.  విచారణాధికారులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని డిమాండ్ చేసిన బండి సంజయ్, బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలను ఫోన్ ట్యాపింగ్ పేరుతో బెదిరించి డబ్బులు దండుకున్న వ్యవహారంపై కూడా నిగ్గు తేల్చాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న సూత్రధారుల కుట్రలను బయటపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

  తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పుర‌స్క‌రించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జ‌రిగింది. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ, సాధారణంగా ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను పవిత్రమైన పరిమళ జలాన్ని ప్రోక్షణ చేసి, నీటితో శుభ్రంగా కడుగుతారని చెప్పారు. ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారని తెలిపారు. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం మేరకు వైకుంఠ ఏకాదశిపై ప్రత్యేక బోర్డు సమావేశం నిర్వహించి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి, 31న వైకుంఠ ద్వాదశి, జనవరి 1వ తేదీలకు సామాన్య భక్తులకు ఈ-డిప్ విధానం ద్వారా దర్శన టోకెన్లు కేటాయించామన్నారు. భక్తులందరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఐదు రోజుల పాటు ఈ-డిప్ రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించామన్నారు. దాదాపు 24 లక్షల మంది భక్తులు ఈ-డిప్ కు రిజిస్ట్రేషన్ చేసుకోగా మొదటి మూడు రోజులకు 1.89 లక్షల భక్తులను ఈ-డిన్ ద్వారా ఎంపిక చేసి టోకెన్లు కేటాయించామని తెలిపారు. టోకెన్ పొందిన భక్తులు నిర్దేశిత సమయంలోనే దర్శనానికి రావాలి ఈ మూడు రోజులకు టోకెన్లు పొందిన భక్తులకు నిర్దేశిత తేది, సమయాన్ని కేటాయించడం జరిగిందని, ఆ సమయం ప్రకారమే భక్తులు దర్శనానికి వస్తే ఎలాంటి ఇబ్బంది కలగకుండా రెండు గంటల్లోనే దర్శనభాగ్యం కలుగుతుందని అన్నారు.టోకెన్ పొందలేని భక్తులకు చివరి ఏడు రోజుల్లో సర్వ దర్శనం క్యూ లైన్ల ద్వారా దర్శనం చేసుకునే అవకాశం ఈ-డిప్ ద్వారా టోకెన్ పొందలేని భక్తులు జనవరి 2 నుండి 8వ తేది వరకు సర్వ దర్శనం క్యూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. మొదటి మూడు రోజులు మాత్రమే ఈ-డిప్ విధానంలో టోకెన్లు కేటాయించామని, చివరి ఏడు రోజులు భక్తులు నేరుగా తిరుమలకు వచ్చి సర్వ దర్శనం క్యూలైన్ల ద్వారా వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

ఢిల్లీ బంగ్లా హైకమిషన్ వద్ద వీహెచ్‌పీ నేతల నిరసన

  బంగ్లాదేశ్‌లో  హిందూవులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఢిల్లీలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. బంగ్లాదేశ్ హైకమిషన్ వెలుపల వీహెచ్‌పీతో పాటు పలు హిందూ సంఘాలు పాల్గొని నినాదాలు చేశాయి. ఈ క్రమంలో బంగ్లా హైకమిషన్‌ కార్యాలయంలోకి వెళ్లేందుకు వీహెచ్‌పీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో, పరిస్థితి ఆందోళనకరంగా మారింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దారుణాలు,  దీపూ చంద్ర దాస్‌ను హత్య చేయడాన్ని నిరసిస్తూ వీహెచ్‌పీ సభ్యులు ఆ దేశ హైకమిషన్ దగ్గర నిరసనకు దిగారు. చంద్ర దాస్‌ మర్డర్‌పై న్యాయం చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. భారీ సంఖ్యలో హిందూ సంఘాల నేతలు అక్కడికి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.  ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. కార్యకర్తలు ఎవరూ లోపలికి వెళ్లకుండా నిలువరిస్తున్నారు.

అమరావతిని భారత క్వాంటమ్‌ వ్యాలీగా మారుస్తాం : సీఎం చంద్రబాబు

  విద్యార్థుల్లో నైపుణ్యం కల్పనకు  కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. వేలాది టెక్‌ విద్యార్థులతో ఆన్‌లైన్‌లో ‘క్వాంటమ్‌ టాక్‌’ నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు ప్రపంచం మొత్తం క్వాంటం టెక్నాలజీ గురించి ఆలోచిస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. ఆధునిక పరిశోధనల కేంద్రంగా అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ ఉంటుందని చంద్రబాబు తెలిపారు. ఐటీని ప్రమోట్ చేయడంలో తాను విజయం సాధించానని సీఎం తెలిపారు.  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలను రప్పించాలని చెప్పారు. క్వాంటమ్ టాక్‌లో ఆయన మాట్లాడారు. 1998లో మైక్రోసాఫ్ట్‌ను హైదరాబాద్‌కు రప్పించామని తెలిపారు. అప్పటో గూగుల్ స్టార్టప్ కంపెనీ. ఇప్పుడు గూగుల్‌ను తీసుకోచ్చామని తెలిపారు. విశాఖలో  చాలా ఐటీ కంపెనీలు వస్తున్నాయి. భవిష్యత్తులో నాలెడ్జ్‌ ఎకానమీ, టెక్నాలజీకి ఆ నగరం చిరునామాగా మారబోతోందని తెలిపారు.   25 ఏళ్ల క్రితమే ఐటీ విజన్‌తో  విప్లవం తెచ్చామని ఇప్పుడు ప్రపంచ ఐటీ నిపుణుల్లో ప్రతి నలుగురిలో ఒకరు భారతీయులేనని కొనియాడారు. పురాతన విజ్ఞానం మన డీఎన్‌ఎలోనే ఉందని ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యంతో దేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్‌‌కు షాక్... నోటీసులు ఇవ్వనున్న సిట్?

  తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపుతున్న ఫోన్ టాపింగ్ కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కు నోటీసులు జారీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయమైన సమాచారం. కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుకు కూడా నోటీసులు ఇవ్వాలనే అంశంపై సిట్ తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఫోన్ టాపింగ్ వ్యవహారం ఎవరి కోసం, ఏ ఉద్దేశంతో చేపట్టారన్న దానిపై సిట్ దృష్టి కేంద్రీకరించింది.  ముఖ్యంగా రాజకీయ నాయకులు, కీలక వ్యక్తుల ఫోన్లను లక్ష్యంగా చేసుకున్నారా? అన్న కోణంలో లోతైన విచారణ కొనసాగుతోంది. అలాగే, ఈ అక్రమ ఫోన్ టాపింగ్ చర్యలు ఎవరి ఆదేశాల మేరకు జరిగాయన్న అంశంపై సిట్ స్పష్టతకు వచ్చినట్లు సమాచారం... ఇప్పటికే సుప్రీంకోర్టు అనుమతితో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ను సిట్ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే.  అయితే ఈ విచారణలో కీలక విషయాలు వెలుగు లోకి తెస్తున్నట్లు సిట్ వర్గాలు వెల్లడించాయి. విచారణ సమయంలో ప్రభాకర్ రావు పదే పదే మహేందర్ రెడ్డి, అనిల్ కుమార్ పేర్లను ప్రస్తావిస్తున్నారని తెలు స్తోంది. ఇప్పటికే సిట్ అధికారులు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని విచారణ చేసి అతని స్టేట్‌మెంట్‌ను  రికార్డ్ చేశారు. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో ఉన్నతాధి కారులు, రాజకీయ నేతల పాత్రపై సిట్ దర్యాప్తు విస్తరించినట్లు తెలుస్తోంది.  అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటు న్నాయి. రాజకీయంగా అత్యంత సున్నితమైన ఈ కేసులో రాజకీయ నాయకులకు నోటీసులు జారీ చేసేందుకు సిట్ సిద్ధమవుతూ ఉండడంతో రాబోయే రోజుల్లో ఫోన్ టాపింగ్ కేసు మరింత ఉత్కంఠభరితంగా మారనుందని రాజకీయ, న్యాయ వర్గాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. దీంతో కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు అసెంబ్లీ సెషన్స్ తర్వాత హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో సిట్ నోటీసులు ఇవ్వనుంది.

ఎడారి దేశంపై మంచు దుప్పటి.. సౌదీలో వింత వాతావరణం!

ఎడారిలో వర్షం పడటమే వింత అనుకుంటే..ఏకంగా మంచు వర్షమే కురిసింది. ఔను సౌదీ అరేబియాను మంచు దుప్పటి కప్పేసింది. మూడు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా సౌదీ ఎడారిని మంచు దుప్పటి కప్పేసింది. పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా వరదలు సంభవించే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. ఏడారిలో వర్షాలు, మంచు కురవడం వాతావరణ మార్పులకు నిదర్శనంగా పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. నిత్యం భగభుగలాడే వేడిమితో ఉండే ఎడారి దేశం సౌదీ ఇప్పుడు చలికి గజగజలాడుతోంది.  ఉత్తర, మధ్య ప్రాంతాల్లోకి చల్లని గాలులు ప్రవేశించడం వల్ల ఈ మార్పులు సంభవించాయని  వాతావరణ కేంద్రం   తెలిపింది. రానున్నరోజులలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని హెచ్చరించింది. 

టీటీడీ మాజీ చైర్మన్ డీకే ఆదికేశవులు నాయుడి కుమారుడు, కుమార్తె అరెస్టు

దివంగత మాజీ ఎంపీ, తిరుమల తిరుపతి దేవస్ధానం మాజీ చైర్మన్ డీకే ఆదికేశవులు నాయుడు కుమారుడు, కుమార్తెలు అరెస్టయ్యారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి రఘునాథ్‌ అనుమానాస్పద మృతి కేసులో మాజీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్‌ ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాస్‌, కుమార్తె కల్పజ, డీఎస్పీ మోహన్‌ను సీబీఐ అధికారులు సోమవారం (డిసెంబర్ 22) అరెస్టు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన రఘునాథ్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో   భూముల క్రయవిక్రయాలు చేసేవారు. ఆయన 2019 మే4న బెంగళూరు వైట్ ఫీల్డ్ లో అనుమానాస్పద స్థితిలో మరణించారు.  ఆయన  భార్య మంజుల  ఫిర్యాదు మేరకు .  పోలీసులు  విచారణ చేపట్టారు. తన భర్త మరణంపై శ్రీనివాస్‌తో పాటు పలువురు కారణమని మంజుల తన ఫిర్యాదులో పూర్కొన్నారు.  తన భర్తను కిడ్నాప్ చేసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే రఘునాథ్ అత్మహత్య అని పేర్కొంటూ అప్పట్లో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు కోర్టుకు నివేదిక సమర్పించారు. దీనిని సవాల్ చేస్తూ రఘునాథ్ భార్య మంజుల హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఈ కేసు దర్యాప్తు కోసం సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ కూడా రఘునాథ్ ది ఆత్మహత్యేనని నిర్ధారించింది. అయితే  మంజుల హైకోర్టు విస్తృత ధర్మాసనాన్ని ఆశ్రయించారు.  ఆమె పిటిషన్ విచారించిన హైకోర్టు ధర్మాసనం, రఘునాథ్‌ మృతిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ కేసు సీబీఐ విచారిస్తోంది. ఈ కేసుకు సంబంధించి చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. ఇందులో భాగంగానే  ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాస్, కుమార్తె కల్పజతో పాటు పలువురిని  అరెస్టు చేసింది. సాక్ష్యాలు నాశనం చేయడం, పత్రాల ఫోర్జరీ, ప్రభుత్వ స్టాంపులు, సీళ్లను సృష్టించడం వంటి ఆరోపణలపై ఈ అరెస్టులు చేసినట్లు తెలుస్తోంది. 

తెలంగాణకు పెట్టుబడులు రావడం కేసీఆర్‌కు ఇష్టం లేదు : శ్రీధర్‌బాబు

  తెలంగాణ రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు ఇక్కడి యువతకు ఉద్యోగాలు రావొద్దని ఇదే బీఆర్ఎస్ పాలసీ అని మంత్రి శ్రీధర్‌బాబు ఆరోపించారు. రాష్ట్రంలో పెట్టబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూలు చేసుకున్న దిగ్గజ కంపెనీలను కించపర్చడం మంచిది కాదని. ఒక సీనియర్ నాయకుడిగా మీకిది తగదని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు హితవు పలికారు.  తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో మేం  చేసుకున్న రూ.5.75 లక్షల కోట్ల ఎంవోయూలు అబద్ధమైతే .... జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, వ్యాపార దిగ్గజాలు కూడా గ్లోబల్ సమ్మిట్ కు రావడం అబద్ధమా అని  శ్రీధర్‌బాబు ప్రశ్నించారు.  మీలాగా మాకు ‘గాల్లో మేడలు’ కట్టడం రాదు. అరచేతిలో స్వర్గం చూపించడం అసలే రాదు. ‘అబద్ధాల గురించి మీరు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని మంత్రి విమర్శించారు. వరంగల్ టెక్స్ టైల్ పార్క్’ మీద పేటెంట్ మీదా...? మరి మీ హయాంలో ఎందుకు పూర్తి చేయలేదు...? ఒక ప్రణాళికా ప్రకారం మేం అసంపూర్తిగా మిగిలిపోయిన పార్క్ ను పూర్తి చేశామని తెలిపారు. అక్కడికి దిగ్గజ కంపెనీలను తీసుకొచ్చాం. దేశంలో ఇదే మొట్టమొదటి ఫంక్షనల్ పీఎం మిత్ర పార్క్. కేంద్రం నుంచి మా హయాంలోనే రూ.30 కోట్లు ఈ పార్కు అభివృద్ధికి తీసుకొచ్చామని పేర్కొన్నారు.  వాస్తవాలు మాట్లాడితే... ఐటీ, ఏరోస్పేస్, డిఫెన్స్, లైఫ్ సైన్సెస్ లో పేటెంట్ కాంగ్రెస్ పార్టీది. ఈ రంగాల్లో తెలంగాణ ఇప్పుడు టాప్ లో ఉందంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎకో సిస్టం అభివృద్ధికి వేసిన పునాదులే కారణం. అవునా... కాదా..?  మంత్రి ప్రశ్నించారు. మీరు తొమ్మిదేళ్లలో ఐటీ ఎగుమతులను రూ.54వేల కోట్ల నుంచి రూ.2.43 లక్షల కోట్లకు తీసుకెళ్లారు. మేం కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే రూ.2.43 లక్షల కోట్ల నుంచి రూ.3.23 లక్షల కోట్లకు తీసుకెళ్లామని శ్రీధర్ బాబు తెలిపారు. ప్రపంచంల్లో మూడొంతుల వ్యాక్సిన్లు తెలంగాణ నుంచే  ఉత్పత్తి అవుతున్నాయి మంత్రి వెల్లడించారు

ఇదేం స్నేహంరా బాబోయ్... ప్రేమ కోసం ఎంత పని చేస్తారా?

  మంచి స్నేహితులు సన్మార్గంలో నడిపించడమే కాకుండా కష్టసుఖాల్లో తోడుగా ఉంటారని... అదే చెడు సహవాసం చేస్తే అది ఎప్పటికైనా మనల్ని అంతం చేస్తుందని పెద్దవాళ్లు చెప్తూ ఉంటారు. ఇది అక్షర సత్యం... చాలాచోట్ల స్నేహితులే మరో స్నేహి తుడిని దారుణంగా హత్య చేస్తున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి... ఇలా వరుస హత్యలు జరుగుతూ ఉండడంతో పాతబస్తీ పరిధిలోని బాలాపూర్, పహాడీ షరీఫ్, చాంద్రాయణ గుట్ట తదితర ప్రాంతాల్లో పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిన విషయం తెలిసిందే.. అయినా కూడా ఈరోజు తెల్లవారుజామున బాలాపూర్ లో ఓ యువ కుడు స్నేహితుల చేతిలో దారుణంగా గాయపడ్డాడు... రిహాన్ (17), శానవాజ్, మోహిజ్ ఈ ముగ్గురు స్నేహితులు కలిసి వట్టేపల్లి నుండి ఫంక్షన్ కని ఎర్ర కుంటకు కలిసి బయలు దేరారు...  బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రకుంట లో అర్ధరాత్రి సమయంలో ఈ ముగ్గురి మధ్య వాగ్వివాదం చెలరేగింది... పెద్ద ఎత్తున ఘర్షణ చెలరేగడంతో  శానవాజ్, మోహిజ్ ఈ ఇద్దరు స్నేహితులు  ఆగ్రహంతో ఊగిపోతూ స్నేహితుడు రిహాన్ పై ఒక్కసారిగా కత్తులతో దాడి చేసి విచక్షణారహితంగా పొడిచి అక్కడి నుండి పారిపోయారు... రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్న రిహాన్ ను చూసిన స్థాని కులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని రిహాన్ను ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. రిహన్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడిం చారు.  అమ్మాయితో ప్రేమ వ్యవహారమే ఈ హత్య యత్నానికి కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన కారణంగా స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు... ఇప్పటికే వరుస నేరాలు, హత్యలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో రాచకొండ సిపి ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి బాలాపూర్, పాతబస్తీ, పహడి షరీఫ్, చాంద్రా యణగుట్ట పరిసర ప్రాంతా ల్లో అర్ధరాత్రి సమయాల్లో తనిఖీలు నిర్వహిస్తూ పోకిరిలపై  కొరడా ఝళిపిస్తున్న కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలు బయటికి రావాలంటేనే భయంతో వణికి పోతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఘటన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను ఆధారంగా చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు