తెలంగాణ బడ్జెట్ 25న
posted on Jul 23, 2024 @ 4:27PM
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మంగళవారం (జులై 23) ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలను 9 రోజుల పాటు జరుగుతాయి. అయితే.. మధ్యలో ఒకరోజు ఆదివారం వస్తుండటంతో.. 8 రోజులు సమావేశాలు జరగనున్నాయి. తొలిరోజు సభలో.. కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణానికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.
సభ అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించారు. స్పీకర్ అధ్యక్షతన నిర్వహించిన బీఏసీ సమావేశంలో.. సభ నిర్వహణ తేదీలు, ఎజెండాను ఖరారు చేశారు. ఇందులో భాగంగా.. గురువారం (జులై 25) సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశమై.. బడ్జెట్‌కు ఆమోదం తెలుపనున్నారు.అదే రోజు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫిబ్రవరిలో తాత్కాలిక బడ్జెట్‌ను అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే. ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అలాగే ఈ సమావేశాల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన 7 నెలల వ్యవధిలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రస్తావించటంతో పాటు, కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. 8 రోజులపాటు బడ్జెట్ పై చర్చ అనంతరం 31న ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది.
ఈ సమావేశంలో స్కిల్ యూనివర్సిటీ, విద్యా కమిషన్, రెవెన్యూతో పాటు పలు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా.. తెలంగాణ సమాజం మొత్తం ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్ ప్రకటన, రైతు భరోసా విధివిధానాలపై సభలో చర్చించనున్నారు. వీటితో పాటు.. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ, డీఎస్సీ, గ్రూప్-1 నోటికేషన్ల జారీ పై సభలో చర్చించనున్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర పథకాల అమలు తీరుపై చర్చ చేపట్టనున్నారు. మరోవైపు.. రూ.2 లక్షల రుణమాఫీ అమలును కూడా రేవంత్ సర్కార్ వివరించనుంది.
మరోవైపు.. రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన అంశాలను కూడా ప్రభుత్వం చర్చకు పెట్టనున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే.. మేడిగడ్డ బ్యారేజీపై కూడా ప్రభుత్వం తన వైఖరిని ప్రకటించనున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రస్తావించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక.. తెలంగాణ తల్లి విగ్రహం, ప్రభుత్వ చిహ్నం రూపకల్పనపై కూడా సభలో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ గైర్హాజర్ అవుతూ వస్తున్నారు. ఈసారి జరిగే బడ్జెట్ సమావేశాలకైనా ఆయన హాజరౌతారా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. బీఆర్ఎస్ వర్గాల సమాచారం మేరకు కేసీఆర్ ఈ సారి సమావేశాలకు హాజరౌతారు. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున ఆయన సభకు హాజరౌతారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.