చంద్రబాబు ప్రభావం.. ఆంధ్రకు కేంద్రం నిధుల ప్రవాహం!
posted on Jul 23, 2024 @ 2:45PM
బాహుబలి సినీమాలో మాహిష్మతీ ఊపిరి పీల్చుకో అని ఓ డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీని, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత జనం అదే డైలాగ్ ను కొంచం మార్చి ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకో.. ఇక అభివృద్ధి పరుగులు పెడుతుంది అంటున్నారు. ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం కొలువుదీరి నిండా రెండు నెలలు కాలేదు. అప్పుడే అమరావతి, పోలవరం నిర్మాణ పనులు జోరందుకున్నాయి. అయితే అందరిలోనూ ఓ చిన్న మీమాంస.. జగన్ ఐదేళ్ల పాలనలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి పరుగులు పెట్టాలంటే నిధులు కావాలి. అందుకు కేంద్రం సహకారం కావాలి. ఎంత పొత్తు ఉన్నా బీజేపీ ఏపీకి సహకారం అందిస్తుందా? 2014లో కేంద్రంలో మోడీ సర్కార్, ఏపీలో చంద్రబాబు సర్కార్ కొలువుదీరిన సమయంలో కూడా తెలుగుదేశం, బీజేపీలు పొత్తులోనే ఉన్నాయి. అయినా కేంద్రం సహాయం మాట అటుంచి సహాయ నిరాకరణ చేసింది. ఏపీకి ఎటువంటి సహాయం చేయకపోవడం అటుంచి, విభజన హామీల అమలు విషయంలోనూ మొండి చేయి చూపింది. ఆ కారణంగానే అప్పట్లో తెలుగుదేశం ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చేసింది.
సరే ఇప్పుడు అంటే 2024 ఎన్నికలలో మళ్లీ రెండు పార్టీలూ కలిసి పోటీ చేశాయి. ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. 2019 నుంచి ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని రాబందులా పీక్కు తిన్న జగన్ పాలన నుంచి ఏపీ విముక్తి చెందింది. ఏపీలో మళ్లీ విజన్ ఉన్న నేత చంద్రబాబు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఏపీని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంలో నిలబెట్టేందుకు నడుం బిగించారు. బాబు రాష్ట్రాన్ని ప్రగతి దారిలో నడిపిస్తారన్న విషయంలో ఎవరిలోనూ ఎటువంటి అనుమానం లేదు. అయితే ఆయన ప్రగతి బాటలు పరచుకోవడానికి కేంద్రం నుంచి సహకారం ఏ మేరకు అందుతుందన్న విషయంలో మాత్రం పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే కేంద్ర విత్తమంత్రి మంగళవారం (జులై 23) లోక్ సభలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిపిన కేటాయింపులు, ఇచ్చిన వరాలు చూసిన తరువాత ఆ అనుమానాలన్నీ పటాపంచలైపోయాయని పరిశీలకులు అంటున్నారు. నిజమే మోడీ 1.0, మోడీ 2.0 హయాంలో బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ పూర్తి నిర్లక్ష్యానికి గురైంది. దానికి తోడు గత ఐదేళ్ల జగన్ పాలన రాష్ట్రానికి శాపంగా మారింది. ఇదే విషయాన్ని లోక్ సభలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసి సభ వాయిదా పడిన తరువాత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రస్తావిస్తూ ఇక ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి పరుగులు పెడుతుందనడంలో సందేహం లేదు. తెలుగుదేశం కూటమి ఆంధ్రప్రదేశ్ లో కొలువుదీరడం, కేంద్ర ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం భాగస్వామి కావడంతో ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు.
కేంద్ర కేబినెట్ కూర్పు సమయంలో ప్రధాని మోడీ, అమిత్ షాలతో భేటీ అయిన చంద్రబాబు.. తనకు కేంద్రంలో మంత్రి పదవులు, ఇతర డిమాండ్ లు ఏవీ లేవని విస్పష్టంగా చెప్పడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, అమరావతి, పోలవరం పూర్తికి సంపూర్ణ సహకారం అందించాలని కోరిన విషయాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయకుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు విత్త మంత్రి నిర్మల లోక్ సభలో ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ చూస్తుంటే చంద్రబాబు కోరిన విధంగా కేంద్రం ఏపీకి సంపూర్ణ సహకారం అందించడానికి కట్టుబడి ఉన్నదన్న సంగతి తేటతెల్లమౌతోందని రామ్మోహననాయుడు అన్నారు.
మొత్తంగా రాష్ట్ర విభజన తరువాత తొలి సారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో సముచిత ప్రాధాన్యత లభించిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఆ ప్రాధాన్యత లభించిన క్రెడిట్ మొత్తం చంద్రబాబుకే దక్కుతుందని అంటున్నారు. ఆయన ఎంతో ముందు చూపుతో కేంద్రంలో మంత్రి పదవుల విషయంలో కానీ, లోక్ సభ స్పీకర్, కేబినెట్ లో పోర్టుపోలియోల విషయంలో కేంద్రంపై ఎటువంటి ఒత్తిడీ తేకుండా, రాష్ట్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ అజెండా అన్న స్పష్టత నివ్వడం వల్లనే ఈనాడు బడ్జెట్ లో ఏపీకి ప్రాధాన్యత లభించిందంటున్నారు.