తెలంగాణ అసెంబ్లీ.. రాంరెడ్డి మృతికి సంతాపం.. సభ రేపటికి వాయిదా..
posted on Mar 11, 2016 @ 10:58AM
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మృతి తీరని లోటని అన్నారు. ఇంకా రాంరెడ్డి మృతిపై పలువురు పలు రకాలుగా స్పందించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడుతూ రాంరెడ్డి నాకు చాలా సన్నిహితుడని.. ఆయన మృతి కాంగ్రెస్ పార్టీతో పాటు తనకు కూడా వ్యక్తిగతంగా చాలా లోటని అన్నారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ వెంకట్ రెడ్డి మరణం చాలా బాధాకరమైనదని.. ఆయన మన మధ్య లేకపోవడం చాలా చింతించాల్సిన విషయమని అన్నారు. మొదట మూడు సార్లు ఓటమిపాలైనా.. ఉపఎన్నికల్లో తొలిసారి గెలిచి వెనక్కి చూసుకోలేదని అన్నారు. కమ్యూనిస్టుల ప్రభంజనంలో కూడా ఆయన గెలిచారని గుర్తు చేశారు. నిండైన పంచకట్టుతో రైతు రూపంతో ఉండేవారని తెలిపారు.
పువ్వాడ అజయ్
రాంరెడ్డికి ఖమ్మం జిల్లా ప్రజలంటే ఎంతో ఇష్టమని తెలిపారు. వ్యవసాయం, పశుపోషణ అన్నా ఆయన ఎంతో ఇష్టమని తెలిపారు. ఊపిరిత్తుల క్యాన్సర్ ఉందని తెలిసినా ఆయన ధైర్యంగా ఎదుర్కొన్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రతిపాదన చేశారు. రాంరెడ్డి మరణించిన కారణంగా ఆయన నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో ఆయన కుటుంబంలోని ఎవరో ఒకరు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తారని చెప్పారు. రాంరెడ్డి సేవలకు గుర్తింపుగా అక్కడ టిఆర్ఎస్ పార్టీతోపాటు మరే పార్టీ కూడా పోటీ పెట్టకుండా ఏకగ్రీవానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా రాంరెడ్డి వెంకటరెడ్డి మృతికి సంతాపం తెలిపిన అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు మధుసూదనాచారి ప్రకటించారు.