మేం సిద్దం..మీరు సిద్దమా?
posted on Mar 26, 2011 @ 4:47PM
హైదరాబాద్: తెలంగాణపై కాంగ్రెసు పార్లమెంటు సభ్యుల నిర్ణయాలు బాగున్నాయని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. శనివారం ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ కోసం తమ పార్టీ తెలంగాణ ప్రాంత శానససభ్యులు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెబుతూ కాంగ్రెసు శాసనసభ్యులు సిద్ధంగా ఉన్నారా అని ఆయన అడిగారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వంటి నివేదికను తాను చూడలేదని ఆయన అన్నారు. తెలంగాణ రాజకీయ నాయకులు సంతలో సరుకులా అని ఆయన అడిగారు. శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణలోని ఆత్మబలిదానాలు కనిపించలేదా అని ఆయన అడిగారు. తెలంగాణ సాధన కోసం అందరూ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను చూసిన తర్వాత తాము ఎందుకు కమిటీ ముందు వాదనలు వినిపించామా అని సిగ్గుతో తల వంచుకుంటున్నానని ఆయన అన్నారు. గంటల తరబడి గ్రంథాలయంలో కూర్చుని చదివి నివేదిక తయారు చేసి శ్రీకృష్ణ కమిటీకి సమర్పించామని, అందులోని ఒక్క అంశాన్ని కూడా శ్రీకృష్ణ కమిటీ నివేదికలో ప్రస్తావించలేదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులను శ్రీకృష్ణ కమిటీ అవమానించిందని ఆయన విమర్శించారు. శ్రీకృష్ణ కమిటీపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రతిపాదిస్తామని ఆయన చెప్పారు.
కాగా, శ్రీకృష్ణ కమిటీ నివేదికను తిరస్కరించాలని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ పిలుపునిచ్చారు. నివేదిక తన పరిధి దాటి అణచివేతకు సూచనలు చేసిందని, ఫాసిస్టు చర్యలను సూచించిందని ఆయన అన్నారు. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని 8వ అధ్యాయం సిఫార్సులను అమలు చేస్తున్నట్లు అనిపిస్తోందని ఆయన అన్నారు.