తెలంగాణకు 200 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు
posted on May 16, 2021 @ 2:27PM
కొవిడ్ రోగులకు ప్రస్తుతం ఆక్సిజన్ అందించడమే పెద్ద సమస్యగా మారింది. ఆక్సిజన్ సకాలంలో అందక దేశంలో చాలా మంది బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆక్సిజన్ కోసం ప్రభుత్వాలు శ్రమిస్తున్న సమయంలో తెలంగాణకు కొంత ఊరత లభించింది. చైనా నుంచి కార్గో విమానంలో తెలంగాణ రాష్ట్రానికి 200 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు అందాయి.
చైనా నుంచి ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు దిగుమతి చేసిన గ్రీన్ కో సంస్థ ప్రతినిధులు.. వాటిని తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు అందించారు. దీంతో గ్రీన్ కో సంస్థకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కరోనా కట్టడి, చికిత్స విషయంలో తెలంగాణలో నిధుల కొరత లేదని కేటీఆర్ తెలిపారు. ఇతర రాష్ట్రాల కరోనా రోగులకు కూడా తెలంగాణలో చికిత్స అందుతోందని ఆయన చెప్పారు. ఔషధాలు, ఆక్సిజన్, ఇతర వైద్య పరికరాలు అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. కేంద్ర సర్కారు సానుకూలంగా స్పందించిందని కేటీఆర్ వివరించారు.