పోస్టల్ బ్యాలెట్ పై విచారణ ముగించిన హైకోర్టు
posted on Nov 30, 2023 @ 11:02AM
ఎన్నికల్లో విధుల్లో ఉన్న ఉద్యోగులు సుమారు 1.75 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారంటూ కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు నివేదించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె. అనిల్ కుమార్ లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎన్నికల సంఘం తరపు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ ఎన్నికల విధుల్లో భాగస్వాములుగా ఉన్న ఉపాధ్యాయులకు పోస్టల్ బ్యాలెట్లు అంద జేసినట్లు తెలిపారు. ఈ నెల 28 నాటికి 1.75 లక్షల మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. ఈ వాదనలను నమోదు చేసుకున్న ధర్మాసనం పిటిషన్ పై ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదంటూ గురువారం విచారణ ముగించింది.
ప్రస్తుతం ఈ ఎన్నికల్లో తొలిసారిగా 13 శాఖల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓటు సదుపాయాన్ని కల్పిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర సేవల్లో ఉండేవారికి, ఎన్నికల విధుల్లో ఉండే వివిధ విభాగాల వారికి కూడా ఈ సదుపాయాన్ని కల్పించింది. ఇందులో ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులతో పాటు ఎయిర్‌పోర్టు, రైల్వే, ఆల్ ఇండియా రేడియో, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, వైద్య ఆరోగ్య, రోడ్లు, భవనాలు, పౌరసరఫరాలు, అగ్నిమాపక శాఖ, మీడియా, విద్యుత్, బీఎస్‌ఎన్‌ఎల్, ఎఫ్‌సిఐ శాఖల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు కూడా ఇంటి నుంచే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించారు.అయితే చాలా మంది టీచర్లకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అందలేదు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఓటు అనేది ప్రాథమిక హక్కు అని.. అందరికీ ఓటు హక్కుపై అవగాహన కల్పించే తామే ఓటు వేయకపోవటం దారుణమన్నారు. ఫారం 12 సబ్మిట్ చేసినా పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించలేదని హైకోర్టును ఆశ్రయించారు.