ఏపీలో స్కూళ్ళు తెరిచారు... టీచర్లను, విద్యార్థులను వణికిస్తున్న కరోనా
posted on Nov 5, 2020 9:22AM
వింటర్ సీజన్ మొదలవడంతో దేశంలో త్వరలో కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉంది... జాగ్రత్తగా ఉండండి అంటూ ఇటు నిపుణులు, అటు కేంద్రం కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ నేపధ్యంలో ఏపీలో నవంబర్ 2 నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం స్కూళ్ళు తెరిచింది. అయితే పాఠశాలలు తెరిచిన రెండో రోజు నుంచే కరోనా తీవ్ర స్థాయిలో విజృభిస్తుండడంతో ఇప్పుడు జగన్ సర్కార్ కు పెద్ద తలనొప్పిగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టెస్టులు చేయగా.. బుధవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 239 మంది టీచర్లు, 44 మంది విద్యార్థులకు కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు. మరికొన్ని పరీక్షల ఫలితాలు ఇంకా అందాల్సి ఉంది. దీంతో అటు విద్యార్థుల తల్లితండ్రులతో పాటు ఉపాధ్యాయుల్లో కూడా ఆందోళన మొదలైంది. తమ పిల్లలను బడికి పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు.
గుంటూరు జిల్లాలో ఏకంగా 25 మంది ఉపాధ్యాయులకు కరోనా సోకినట్టు గుర్తించారు. వారిలో వైరస్ లక్షణాలు కనిపించనప్పటికీ స్ర్కీనింగ్ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది 500 మంది ఉపాధ్యాయులకు ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించగా 5 శాతం మంది కరోనా బారిన పడినట్లు తేలింది. ఇది ఇలా ఉండగా గుంటూరు జిల్లా వెల్లటూరు జెడ్ పి హెచ్ స్కూల్ లో పదో తరగతి విద్యార్థికి పాజిటివ్ వచ్చింది. అతడి కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేయగా విద్యార్థి తండ్రికీ వైరస్ సోకినట్టు తేలింది. ప్రకాశం జిల్లాలో మంగళవారం నలుగురు విద్యార్థులు, ఒక టీచర్‌కు కరోనా సోకగా.. బుధవారం ఏడుగురు విద్యార్థులు, ఒక ప్రధానోపాధ్యాయుడికి పాజిటివ్ వచ్చింది. కర్నూలు జిల్లాలో పాఠశాలలు తెరుచుకున్న మూడు రోజులకే ముగ్గురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయురాలికి వైరస్ సోకినట్టు అధికారులు గుర్తించారు. అక్టోబరు నుంచి ఇప్పటివరకు జిల్లాలో 38 మంది టీచర్లు, 125 మంది విద్యార్థులకు కరోనా సోకింది. విశాఖపట్నం జిల్లాలో గడచిన రెండు రోజుల్లో 50 మంది టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్‌కు కరోనా సోకగా.. ఇద్దరు విద్యార్థులు కూడా కరోనా బారినపడ్డారు. మరి కొంతమంది టెస్టుల ఫలితాలు రావాల్సి ఉంది. చిత్తూరు జిల్లాలో చేసిన పరీక్షల్లో ఏకంగా 187 మంది ఉపాధ్యాయులకు, 13 మంది విద్యార్థులకు వైరస్ సోకినట్లుగా తేలింది. టెస్టుల ఫలితాలు ఇంకా రావాల్సి ఉండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలో 14 మంది విద్యార్థులతోపాటు ఒక టీచర్‌కూ కరోనా పాజిటివ్ వచ్చింది. ఈస్ట్ యడవల్లిలో 10 మందికి, కూచింపూడిలో టీచరుతో పాటు నలుగురు విద్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
ఇది ఇలా ఉండగా పలు జిల్లాల్లో కరోనా కేసులు బయటపడుతుండగా గతంలోనే వారికి సోకి తెలుసుకోకపోవటం, పాఠశాలల్లో పరీక్షలు చేసినప్పుడు అవి బయటపడుతున్నాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాకి తెలిపారు. అయితే అధికార వైసిపి నేతలు మాత్రం ఈ సమయంలో స్కూళ్ళు తెరిచి అనవసరంగా కొత్త తలనొప్పులు తెచ్చుకున్నామని అభిప్రాయాలు వ్యక్తం చేస్తోన్నారు.