2026.. పొలిటికల్ హీట్ మామూలుగా ఉండదుగా?
2025కు గుడ్ బై చెప్పేసి.. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టి మూడు రోజులు అయ్యింది. గత నాలుగైదు రోజులుగా కొత్త సంవత్సర వేడుకల సన్నాహాలు, వేడుకలతో అంతా బిజీబిజీగా గడిచిపోయింది. ఇప్పుడు ఇక కొత్త సంవత్సరం ఎలా గడవబోతోంది అన్న విషయంపై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఉంది.
అది పక్కన పెడితే రాజకీయ పార్టీలకు మాత్రం కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు రాష్ట్రాలతో పాటు అసోం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు దేశవ్యాప్తంగా 72 రాజ్యసభ స్థానాలకూ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో 2026ను పరిశీలకులు ఎన్నికల నామ సంవత్సరంగా అభివర్ణిస్తున్నారు.
ముందుగా తమిళనాడు విషయానికి వస్తే.. ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉంది. ఈ రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వచ్చే ఏప్రిల్‌లో అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది. ఏప్రిల్ కు ముందే తమిళనాడులో ఎన్నికలు జరగుతాయి. ఇప్పటి వరకూ ఉనికి మాత్రంగానే రాష్ట్ర రాజకీయాలలో ఉన్న బీజేపీ ఈ సారి తమిళనాడుపై భారీ అశలే పెట్టుకుంది. అందుకే ఆ రాష్ట్రానికి చెందిన ఓబీసీ నాయకుడు సీపీ రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతిని చేసి ఆ రాష్ట్ర ప్రజల గుడ్ లుక్స్ లో నిలవడానికి ప్రయత్నించింది. తమిళనాడులో మరో ప్రాంతీయ పార్టీ అన్నాడీఎంకే జయలలిత మరణానంతరం నామావశిష్ఠంగా మిగిలిపోయింది. ప్రస్తుతం ఆ పార్టీ బీజేపీతో పొత్తులో ఉంది. ఇక కొత్తగా తమిళ రాజకీయాలలోకి తమిళ వెట్రి కజగం (టివికే) అనే పార్టీ అడుగు పెట్టింది. తమిళ నాట అశేష్ అభిమానులు ఉన్న హీరో విజయ్ నేతృత్వంలోని ఈ పార్టీ ప్రభావం ఎలా ఉంటుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.
ఆ తరువాత ఈ ఏడు ఎన్నికలు జరగనున్న మరో కీలక రాష్ట్రం పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ కాలపరిమితి ఈ ఏడాది మేతో ముగియనుంది. ఈ రాష్ట్రంలో మొత్తం మొత్తం 294 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి.ఇక్కడ గత మూడు దఫాలుగా మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది. ఈ సారి ఇక్కడ ఎలాగైనా అధికారం హస్తగతం చేసుకోవాలన్న పట్టుదలతో కమలం పార్టీ ఉంది. బంగ్లాదేశ్ నుంచి చొరబాటు దారుల కారణంగా పశ్చిమ బెంగాల్ లో స్థానికులకు ఉపాధి అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న కమలనాథులు, అదే సమయంలో చొరబాట్లకు తృణమూల్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అండగా నిలుస్తున్నారన్న విమర్శతో ఇప్పడ ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టేశారు.
ఇక ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న మరో కీలక రాష్ట్రం కేరళ. ఇక్కడ వామపక్షాలు అధికారంలో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ కూడా అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకుంది. ఇది వచ్చే అసెంబ్లీ ఎన్నికలలొ తమకు అవకాశాలున్నాయనడానికి నిదర్శనంగా బీజేపీ భావిస్తోంది.
ఇలా ఉండగా బీజేపీ ఇంత వరకూ తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళలో ఒక్కసారి కూడా అధికారంలోకి రాలేదు. ఆ ట్రెండ్ ను బ్రేక్ చేసి ఈ రాష్ట్రాలలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలన్న పట్టుదలతో కమలనాథులు వ్యూహాలు పన్నుతున్నారు. కేంద్ర పాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఆల్ ఇండియా ఎన్ ఆర్ కాంగ్రెస్ + బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది. ఇక్కడ కూడా ఈ ఏడాది ఏప్రిల్‌తో అసెంబ్లీ గడువు ముగుస్తుంది.
అలాగూ అసోం అసెంబ్లీ గడువు కూడా ఈ ఏడాది మేతో ముగియనుంది. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. వచ్చే మేతో అసెంబ్లీ గడువు ముగియనుంది. ఇక్కడ తిరిగి అధికారాన్ని దక్కించుకునేందుకు బీజేపీ ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించగా, మరోవైపు కాంగ్రెస్ కూటమి కూడా బలంగానే ప్రయత్నాలు చేస్తున్నది. ఏది ఏమైనా 2026 ఏడాది మొత్తం పొలిటికల్ హీట్ ఓ రేంజ్ లో కొనసాగేలా కనిపించడం ఖాయం. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది.