తెలుగు వారి క్షేమం కోసం ముందు కదిలేది తెలుగుదేశమే!
posted on Sep 10, 2025 @ 2:17PM
ప్రపంచంలో ఏ మూల ఏ సంక్షోభం తలెత్తినా.. అక్కడున్న తెలుగువారి క్షేమం కోసం ముందుగా కదిలేది ఒక్క తెలుగుదేశం మాత్రమే అన్న విషయం గతంలో పలుమార్లు రుజువైంది. ఛార్ ధామ్ యాత్రలో చిక్కకున్న తెలుగువారిని స్వరాష్ట్రానికి రప్పించడంలో కానీ, బర్మా, బంగ్లాదేశ్, దుబాయ్.. ఇలా ఎక్కడ తెలుగువారు ఇబ్బందుల్లో ఉన్నా వారిని ఆదుకునేందుకు తెలుగుదేశం ఆఘమేఘాలపై కదులుతుంది. అధికారంలో ఉన్నా, లేకున్నా తెలుగు పీపుల్ ఫస్ట్ అన్న విధానంతో తెలుగుదేశం స్పందన ఉంటుందన్నది తెలిసిందే.
తాజాగా నేపాల్ లో జరుగుతున్న విధ్వంసకాండ, హింసాకాండ నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా స్వరాష్ట్రానికి తీసుకు వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం కూటమి సర్కార్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. మంత్రి లోకేష్ రంగంలోకి దిగారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరిట ఆంధ్రప్రదేశ్ లోని టీమ్ ఎన్డీయే ప్రభుత్వం అనంతపురంలో భారీ ఎత్తున నిర్వహిస్తున్న సభకు హాజరుకావడం మానేసి మరీ ఆయన నేపాల్ లోని తెలుగువారిని రక్షించడం కోసం రంగంలోకి దిగారు. ఉదయమే సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రానికి చేరుకుని నేపాల్ లో చిక్కుకున్న తెలుగవారిని రక్షించేందుకు అవసరమైన ఏర్పాట్లు చర్యలలో మునిగిపోయారు. ఒక స్పెషల్ వార్ రూమ్ ను ఏర్పాటు చేసి..24 గంటలలూ పర్యవేక్షించాలని సీనియర్ అధికారులను ఆదేశించారు. నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు హెల్ప్ లైన్ నంబర్లు, వాట్సాప్ నంబర్లను ప్రకటించారు.
నేపాల్ లో దాదాపు 300 మంది చిక్కుకున్నారనీ, వారిలో అత్యధికులు ముక్తినాథ్ యాత్రికులు ఉన్నారనీ నిర్ధారణ అయ్యింది. అత్యంత వేగంగా లోకేష్ కదిలి యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించడం వల్లనే నేపాల్ లో చిక్కుకున్న వారి సంఖ్య, ఆచూకీ ఇంత త్వరగా తెలిసిందని అంటున్నారు. నేపాల్ లో చిక్కుకున్న వారిలో కొందరితో లోకేష్ స్వయంగా ఫోన్ లో మాట్లాడి అన్ని విధాలుగా సహాయ సహకారాలందిస్తామంటూ భరోసా ఇచ్చి వారిలో ధైర్యం నింపారు. నేపాల్ లో చిక్కుకున్న వారి భద్రతకు సంబంధించి ప్రతి రెండు గంటలకూ అప్ డేట్ లు సేకరించాలని అధికారులను ఆదేశించారు. నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారందరినీ భద్రంగా స్వరాష్ట్రానికి తీసుకువస్తామని లోకేష్ వారి భరోసా ఇచ్చారు.