ప్రశ్నించడమే పాపమా! అరాచకాలకు అంతే లేదా? ఆటవిక రాజ్యం!
posted on Oct 4, 2020 @ 8:54PM
అంతా నా ఇష్టం అంతా నా ఇష్టం
ఎడా పెడా ఏమి చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం
చెడ మడ చేలరేగినా చెప్పెదెవడ్రా నా ఇష్టం..
ఇది కౌరవుడి సినిమాలోని సాంగ్. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన ఈ పాట అప్పట్లో హిట్టైంది. ఈ పాటలోని అంతా నా ఇష్టంలా ఇప్పుడు ఏపీలో కొందరు వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. అధికార మదంతో అంతా తమ ఇష్టం అన్నట్లుగా అరాచకాలకు పాల్పడుతున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా, కోర్టుల నుంచి చివాట్లు తగిలినా వైసీపీ నేతలు బరి తెగింపు ఆపడం లేదు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడమే ఏపీలో పాపంగా మారిపోయింది. విపక్ష నేతలను టార్గెట్ చేస్తున్నారు. దాడులకు పాల్పడుతూ భయాందోళనలు స్పష్టిస్తున్నారు. ఎవరూ మాట్లాడినా ఇదే పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు, అరాచరాలకు అంతే లేకుండా పోతోంది.
తమకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. దుండగులతో కొట్టిస్టున్నారు. కొత్త కొత్త రూల్స్ తెస్తూ .. అక్రమ కట్టాలంటూ ఇండ్లను కూల్చేస్తున్నారు. కార్లను ధ్వంసం చేస్తున్నారు. ఇలా ఏదో ఒక రకంగా టీడీపీ ముఖ్య నేతలను వరుసగా టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నేతలు. చివరకు జడ్జీల కుటుంబ సభ్యులను వదలడం లేదు. బరి తెగించిన దుండగులు.. హై సెక్యూరిటీ ఉండే న్యాయమూర్తుల ఇండ్ల దగ్గర కూడా దాడులకు పాల్పడుతున్నారు. కులాల పేరుతో కుంపట్లు పెడుతున్నారు. మత విద్వేశాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్నారు. ప్రజల్లో భయాందోళన పుట్టిస్తూ.. ఎవరూ తమకు ప్రశ్నించవద్దనే దోరణితో ఏపీని రావణకాష్టంలా మారుస్తున్నారు.
విజయవాడలో హైకోర్టు జడ్జీ ఇంటి పక్కనే ఉండే టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ కారు అద్దాలను దుండగులు పగుల గొట్టారు. ఇంటి బయట పెట్టిన కారు ముందు, వెనుక అద్దాలను రాళ్లతో కొట్టి ధ్వంసం చేశారు. హైకోర్టు జడ్జీ ఇల్లు ఉండటంతో అక్కడ పోలీస్ పికెట్ కూడా ఉంది. అయినా దౌర్జన్యకాండకు దిగారు దుండగులు. జడ్జీ ఇంటి పక్కనే ఉన్న పట్టాబి కారును ధ్వంసం చేయడం కలకలం రేపుతోంది. ఎక్కడో ఉన్న సర్వే రాళ్లు తీసుకువచ్చి కారు పగలగొట్టారు దుండగులు. ఈ ఘటనతో ఏపీలో ఎలాంటి అరాచకాలు జరుగుతున్నాయో ఊహించవచ్చు. జడ్జీ ఇంటి దగ్గరే భద్రత లేకపోతే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయోనన్న ఆందోళన జనాల్లో వ్యక్తమవుతోంది.
పట్టాభిరామ్ కారు ధ్వంసం వెనుక అధికార పార్టీ మంత్రి, ఎమ్మెల్యే హస్తం వుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పట్టాభిపై దాడి చేయాలని చూశారని... అది కుదరక కారు అద్దాల ధ్వంసంతో సరిపెట్టుకున్నారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రజా వేదికతో మొదలైన ద్వంసాలు.. సబ్బం హరి ఇల్లు, పట్టాభి కారు అద్దాలు ధ్వంసం వరకు వచ్చాయన్నారు టీడీపీ నేతలు. దాడులు, దౌర్జన్యాలు తెలుగు వారి సంస్కారం కాదన్న టీడీపీ నేతలు.. వైసీపీ తీరుతో ఏపీ ప్రజలు తల దించుకునే పరిస్థితులు వచ్చాయన్నారు. వైసీపీ అవినీతిని బయట పెడుతున్నందుకే తన కారుని ధ్వసం చేశారని పట్టాభి ఆరోపించారు. కారు ధ్వసం చేస్తే భయపడేంత పిరికిపందను కాదన్నారు పట్టాభి.
విశాఖ సీతమ్మధారలోని టీడీపీనేత, మాజీ ఎంపీ సబ్బంహరి ఇంటి ప్రహరీ, మరుగుదొడ్డిని జీవీఎంసీ అధికారులు కూల్చి వేయడం దుమారం రేపుతోంది. జేసీబీలు, వందలాదిమంది పోలీసులతో తెల్లవారుజాము 3.30 గంటలకు అధికారులు తరలిరావడం చూస్తే అక్కడ యుద్ధరంగమే కనిపించింది. తనకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చుతారని జేసీబీకి అడ్డంగా సబ్బంహరి నిలబడినా అధికారులు వినలేదు. తన అభ్యంతరాలను, నిరసనలను సబ్బం వ్యక్తం చేస్తుండగానే.. అక్రమమంటూ కొన్ని నిర్మాణాలను కూల్చేశారు. హరి ఇంటి భాగంలోనే ఫెన్సింగ్ నాటి, జీవీఎంసీ బోర్డు ఏర్పాటుచేశారు. తెల్లవారుజామున దొంగల్లా సబ్బం హరి ఇంటిని వందలాది మంది జీవీఎంసీ అధికారులు, సిబ్బంది, పోలీసులు చుట్టుముట్టడం విశాఖ వాసులను విస్మయపరిచింది.
జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శిస్తున్న వారిలో సబ్బంహరి ఒకరు. అందుకే కక్ష సాధింపులో భాగంగానే ఆయన ఇంటిని కూల్చివేశారనే ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపునకు వైసీపీ నేతలు జీవీఎంసీని పావుగా వాడుకుంటుందని తెలుస్తోంది. విశాఖలో కుప్పలుతెప్పలుగా వున్న అక్రమనిర్మాణాలను వదిలేసి.. కేవలం టీడీపీ నేతలకు చెందిన ఆస్తులనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. నగరంలో అక్రమ నిర్మాణాలపై కొన్నేళ్ల క్రితం హైకోర్టు కూడా స్పందించింది. అన్నింటిపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయినా సబ్బం హరినే టార్గెట్ చేశారు. రెండు దశాబ్దాల కిందట నిర్మించుకున్న ఇంట్లో కొంత పార్కు స్థలం వుందనే విషయం జీవీఎంసీ అధికారులకు ఇప్పుడు గుర్తుకురావడం, ఆగమేఘాల మీద అందులోనూ అర్ధరాత్రి దాటిన తర్వాత కూల్చివేతకు దిగడంతీవ్ర చర్చనీయాం శమైంది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహారశైలిని ఎప్పటికప్పుడు ఎండగడుతున్న సబ్బం హరి గొంతు నొక్కేయాలన్న కుట్రతోనే ఇదంతా చేశారని చెబుతున్నారు.
జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు కొద్దిరోజుల కిందట అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణను టార్గెట్ చేశారు. పెందుర్తిలో ఇరవై ఏళ్ల కిందట ఆయన నిర్మించుకున్న ఇంటి ప్రహరీ ప్రభుత్వ స్థలంలో వుందంటూ తొలగించాలని చూశారు. గోవిందు ఇంచి ప్రహరీ తొలగించేందుకు రాత్రిపూట అక్కడ జేసీబీలను కూడా సిద్ధం చేశారు. పీలా కుటుంబ సభ్యుల నుంచి నిరసన వ్యక్తంకావడంతో జీవీఎంసీ అధికారులు వెనక్కి తగ్గారు. అలాగే పీలా గోవిందు సీతంపేట మెయిన్‌రోడ్డులో నిర్మిస్తున్న భవనం అక్రమం అంటూ ఏడాది కిందట అర్ధరాత్రివేళ యంత్రాలతో కూల్చివేశారు. కేవలం టీడీపీ నేతలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని జీవీఎంసీ చర్యలకు దిగడం ఆశ్చర్యకరంగా వుందనే అభిప్రాయం నగరవాసుల్లో వ్యక్తమవుతోంది.
కొన్ని రోజుల క్రితం చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు చెందిన దళిత జడ్జి రామకృష్ణ తమ్ముడు రామచంద్రపై కొందరు దుండగులు దాడిచేశారు. ఈ ఘటనలో రామచంద్ర తీవ్రంగా గాయపడ్డారు. బి.కొత్తకోట బస్టాండులో రామచంద్ర పండ్లు కొనుగోలు చేస్తుండగా కర్ణాటక రిజిస్ర్టేషన్ కలిగిన కారులో వచ్చిన వారు ఆయనపై దాడిచేశారు. రక్తం కారేలా తనపై ముష్ఠిఘాతాలు కురిపించారని రామచంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గీయులకు, తమ కుటుంబానికి మధ్య జరుగుతున్న భూవివాదాలే ఈ దాడికి కారణమని జడ్జి రామకృష్ణ ఆరోపించారు. స్థానిక వైసీపీ నాయకులు తన తమ్ముడిపై హత్యాయత్నానికి పాల్పడ్డారని చెప్పారు. అయితే మదనపల్లె డీఎస్పీ మాత్రం.. దాడి పథకం ప్రకారం జరగలేదని, రోడ్డుపై అనుకోకుండా జరిగిన ఘర్షణేనని, ఈ దాడికి, రాజకీయాలకు సంబంధం లేదని తేల్చేశారు. రామచంద్రపై జరిగిన దాడి ఘటన, పోలీసుల తీరుపైనా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. జడ్జీ సోదరుడికే న్యాయం జరగపోతే... సామాన్యుల పరిస్థితి ఏంటన్న భయాందోళనలు జనాల నుంచి వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామో.. ఆటవిక రాజ్యాంలో ఉన్నామో తెలియడం లేదని సామాన్య ప్రజలు ప్రశ్నించుకునే పరిస్థితి నెలకొంది. వైసీపీ నేతల అరాచకాలతో ఆంధ్రప్రదేశ్ పరువు పోతుందన చర్చ జరుగుతోంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందని.. అలా ప్రశ్నించిన వారిపై దాడి చేయడం దుర్మార్గమనే అభిప్రాయం అన్ని వర్గాల నుంచి వస్తోంది. ఈ అరాచకాలకు చెక్ పెట్టాలని, లేదంటే బీహార్ లా ఏపీ మారిపోయే పరిస్థితి ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.