కేసీఆర్ నై.. కేటీఆర్ సై! అందుకే పెద్దాయన వద్దంటున్నారా?
posted on Oct 4, 2020 @ 8:54PM
పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో పోటీపై అధికార టీఆర్ఎస్ లో భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు కనిపిస్తోంది. గత శాసన మండలి ఎన్నికల ఫలితాలు, ఉద్యోగుల వైఖరి, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ బరిలో ఉండకపోవడమే బెటరని కొందరు నేతలు చెబుతుండగా.. అధికార పార్టీగా ఏ ఎన్నికల్లోనైనా పోటీ చేయాల్సిందేనని మరికొందరు నేతలు చెబుతున్నారట. మండలి ఎన్నికల్లో పోటీపై సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆలోచనలు వేరువేరుగా ఉన్నాయని చెబుతున్నారు.
త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సర్వే చేయింటారట. ఎన్నికలు జరగనున్న ఆరు జిల్లాల్లో జరిగిన సర్వేలో ప్రభుత్వానికి షాకింగ్ ఫలితాలు వచ్చాయంటున్నారు. పట్టభద్రులు, ఉద్యోగులు ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారన్న విషయం తేలిందట. సర్కార్ ఇంటిలిజెన్స్ రిపోర్టు కూడా అలానే ఉందట. అధికార టీఆర్ఎస్ పై నిరుద్యోగులు. ఉద్యోగుల స్టాండ్ ఎలా ఉంటుందో కేసీఆర్ కూడా ఊహించగలరు. క్షేత్రస్థాయిలోని అన్ని పరిస్థితులు పరిశీలించి, పార్టీకి సానుకూలంగా లేవని నిర్ధారించుకోవడం వల్లే మండలి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను పెట్టడంపై ఆయన విముఖంగా ఉన్నారని కొందరు గులాబీ నేతలు చెబుతున్నారు.
దేశంలో జమిలి ఎన్నికలు రావచ్చనే అభిప్రాయంతో కేసీఆర్ ఉన్నారని చెబుతున్నారు. అధికార పార్టీగా ఉండి కూడా మండలి ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు వస్తే ఇబ్బందులు వస్తాయని కేసీఆర్ భావిస్తున్నారట. రెండేండ్లలోనే జమిలి ఎన్నికలు వస్తే.. మండలి ఎన్నికల ప్రభావం వాటిపై పడుతుందని పార్టీ నేతలతో కేసీఆర్ చెప్పినట్లు చెబుతున్నారు. గతంలో జరిగిన మండలి ఎన్నికల్లోనూ పార్టీకి వ్యతిరేక ఫలితాలు వచ్చాయని ఆయన గుర్తు చేస్తున్నారట. అందుకే పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను పెట్టకుండా.. తటస్థులు, మేథావులకు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ ఆలోచన చేసినట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే హైద్రాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ కు సపోర్ట్ చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించినట్లు ప్రచారం జరిగిందని చెబుతున్నారు. సీఎం కేసీఆర్ అభిప్రాయంతో మంత్రి కేటీఆర్ విభేదించారని, అధికార పార్టీగా తామే గెలుస్తామని ఆయన ధీమాగా ఉన్నారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కేటీఆర్ ఒత్తిడి వల్లే మండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేయాలని నిర్ణయించిందని చెబుతున్నారు.
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, మండలి ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలను విపక్షాలన్ని వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ గా తీసుకుంటున్నాయి. అందుకే విజయం కోసం అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ సమయంలో పట్టభద్రుల ఎన్నికల్లో అధికార పార్టీగా వ్యతిరేక ఫలితాలు వస్తే తమకు ఇబ్బందేనని టీఆర్ఎస్ నేతలు ఓపెన్ గానే చెబుతున్నారు. పోటీపై పెద్దాయన క్లారిటీగానే ఉన్నా.. కేటీఆర్ అందుకు అంగీకరించడం లేదని చెబుతున్నారు. పట్టభద్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని, తాము ప్రచారం కూడా చేయలేకపోతున్నామని కొందరు ఎమ్మెల్యేలు వాపోతున్నారు. పోటి పెట్టకుండా కేసీఆర్ ఆలోచన ప్రకారం తటస్థులు, మేథావులకు మద్దతు ఇవ్వడమే కరెక్ట్ అని కొందరు టీఆర్ఎస్ నేతలు అంతర్గత సమావేశాల్లో మాట్లాడుకుంటున్నట్లు తెలంగాణ భవన్ లో చర్చ జరుగుతోంది.