తెలుగుదేశం జనసేన కూటమిదే అధికారం.. తేల్చేసిన మరో సర్వే?
posted on Feb 29, 2024 @ 3:08PM
మరో పది పదిహేను రోజులలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఏ విధంగా చూసినా మరో నెలా పదిహేను రోజులలో ఏపీలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజకీయ టెంపరేచర్ ను పీక్స్ కు చేర్చేసింది. ముఖ్యంగా అధికార వైసీపీలో ఓటమి భయం రోజు రోజుకూ పెరిగిపోతున్నది. ఇప్పటికే పలు సర్వేలు రాష్ట్రంలో వైసీపీ విజయం అసాధ్యమంటూ తేల్చేశాయి. రాబోయే సర్కార్ తెలుగుదేశం, జనసేన కూటమిదేనని ఢంకా బజాయించేశాయి. తాజాగా మరో సర్వే కూడా అదే విషయాన్ని చెప్పింది. ఏబీపీ నిర్వహించిన తాజా సర్వేలే తెలుగుదేశం, జనసేన కూటమి 142 స్థానాలలో విజయం సాధించి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ఆ సర్వే పేర్కొంది. ఇక అధికార వైసీపీ కేవలం 32 స్థానాలకే పరిమితమౌతుందని తేల్చిందని సామాజిక మాధ్యమంలో విస్తృతంగా సర్క్యులేట్ అవుతోంది. అయితే ఏబీపీలైవ్. కామ్ ఏపీ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి సర్వే విడుదల చేయలేదని వివరణ ఇచ్చింది. అయినా సామాజిక మాధ్యమంలో మాత్రం ఏబీపీ సీఓటర్ సర్వే విస్తృతంగా సర్క్యలేట్ అవుతున్నది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే పలు సర్వేలు ఏపీలో జగన్ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని తేల్చేశాయి. వాటిలో అత్యం ప్రతిష్టాత్మకమైన రైజ్ సంస్థ సర్వే అయితే రాష్ట్రంలో పాతిక లోక్ సభ స్థానాలకు గానూ తెలుగుదేశం జనసేన కూటమి 15 స్థానాలలో విజయం సాధిస్తుందని ఓటింగ్ శాతం ఎలా ఉండబోతోంది తదితర గణాంకాలతో సహా పక్షం రోజుల కిందట వెల్లడించింది. ఆ మేరకు చూసుకున్నా తెలుగుదేశం, జనసేన కూటమి కనీసం 100కు పైగా అసెంబ్లీ నియోజకవర్గాలలో విజయం కేతనం ఎగురవేయడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏపీలో ఎన్నికలకు ఇంకా గట్టిగా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో సర్వే సంస్థలు కూడా ప్రజల నాడిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో సర్వే సంస్థలు ఏపీలో తన ఫలితాలను వెల్లడించేయగా.. ఒకటీ రెండు మినహా దాదాపు అన్ని సంస్థలు ఏపీలో ఈసారి టీడీపీదే అధికారం అని తేల్చేశాయి. కాగా, ఇప్పుడు మరో సంస్థ కూడా టీడీపీ-జనసేనలు ఏపీ అధికారం దక్కించుకోవడం ఖాయంగా చెప్తున్నాయి. అలాగే వైసీపీ కేవలం ఐదు లోక్ సభ స్థానాలలోనే విజయం సాధిస్తుందని రైజ్ సర్వే పేర్కొన్నది. ఆమేరకు చూసుకుంటే ఆ పార్టీ కేవలం 35 అసెంబ్లీ స్థానాలలోనే విజయం సాధిస్తుందని అంటున్నారు. స్థానాలలోనే గెలుస్తుందని పరిశీలకులు చెబుతున్నారు. ఇక రాష్ట్రంలో మిగిలిన ఐదు లోక్ సభ నియోజకవర్గాలలోనూ తెలుగుదేశం, జనసేన కూటముల మధ్య తీవ్ర పోటీ ఉంటుందనీ, మళ్లీ ఇందులో మూడు స్థానాలలో తెలుగుదేశం, జనసేన కూటమి వైపే మొగ్గు ఉందని సర్వే పేర్కొన్నది.
ఆ మేరకు చూసుకున్నా తాజాగా ఏబీపీ సర్వే అంటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫలితాలు పక్షం రోజుల కిందట రైజ్ విడుదల చేసిన ఫలితాలకు చాలా వరకూ దగ్గరగానే ఉండటం గమనార్హం.
రైజ్ సర్వే ప్రకారం తెలుగుదేశం, జనసేన కూటమి ఉభయ గోదావరి జిల్లాలలో రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, ఏలూరు, నరసాపురం, కోస్తాంధ్రలో గుంటూరు, విజయవాడ, నెల్లూరు, రాయలసీమలో చిత్తూరు, కర్నూలు, అనంతపురం, హిందూపురం, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి లోక్ సభ స్థానాలలో తెలుగుదేశం, జనసేన కూటమి విజయం సాధించడం పక్కా. ఇక తెలుగుదేశం కూటమి, వైసీపీ మధ్య తీవ్రమైన పోటీ ఉన్న నియోజకవర్గాల విషయానికి వస్తే.. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, కోస్తాంధ్రలో నరసరావుపేట, మచిలీపట్నం, బాపట్ల, రాయలసీమలో తిరుపతి పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. అయితే వీటిలో అసెంబ్లీ స్థానాల ప్రభావాన్ని బట్టి బాపట్ల, తిరుపతి, విశాఖపట్నం స్థానాలలో తెలుగుదేశం, జనసేన కూటమి అభ్యర్థులకే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయని సర్వే పేర్కొంది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్న సర్వే ఫలితం కూడా దాదాపుగా రైజ్ సర్వే ఫలితానికి దగ్గరగా ఉండటంతో పరిశీలకులు ఇప్పుడు ప్రచారంలో ఉన్నది ఫేక్ సర్వే అన్న వాదనను పక్కన పెట్టి, మూడ్ ఆఫ్ ఏపీ జగన్ కు వ్యతిరేకంగా ఉందని మాత్రం చెప్పవచ్చునని అంటున్నారు.
అంతే కాకుండా వైసీపీ జాబితాల మీద జాబితాలు విడుదల చేస్తూ కూడా ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థిని ఖరారు చేయాలో తేల్చుకోలేక సతమతమౌతుండటం కూడా ఆ పార్టీ ఓటమికి ఇప్పటికే మానసికంగా ప్రిపేర్ అయిపోయిందా అన్న అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. జగన్ తో సహా ఆ పార్టీ సీనియర్ నేతలే ఇప్పుడు నియోజకవర్గాల ఇన్ చార్జీలుగా నియమించిన వారినే అభ్యర్థులుగా రంగంలోకి దింపుతామన్నగ్యారంటీ లేదని చెబుతుండటం కూడా ఆ పార్టీ పరిస్థితిని తెలియజేస్తోందని అంటున్నారు.