సిక్కోలులో వైసీపీ సీన్ సితారే!.. తెలుగుదేశం, జనసేన కూటమి క్లీన్ స్వీప్ ఖరారే!
posted on Feb 29, 2024 @ 3:42PM
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి గట్టి షాకిచ్చేందుకు ప్రజలు రెడీ అయిపోయారు. జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో రెండు నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించింది. అయితే నాలుగున్నరేళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రజావ్యతిరేక పాలనపై ఉమ్మడి సిక్కోలు జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో రాజకీయ ఉద్దండులు ఉన్నారు. తమ్మినేని సీతారాం, ధర్మాన సోదరులతో పాటు తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వంటి బడా రాజకీయ నేతలు ఉన్నారు. వైసీపీ నుంచి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేతలు విజయం సాధించినా జిల్లాలో అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ హయాంలో పలు నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు భూకబ్జాలకు పాల్పడంతోపాటు, దౌర్జన్యాలకు దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. పలు నియోజకవర్గాల్లో కుటుంబ సభ్యుల పెత్తనం.. ఇలా అన్ని నియోజకవర్గాల్లో నూ వైసీపీపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుని పెల్లుబుకుతోంది. నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు తెలుగుదేశంకు మద్దతుగా నిలుస్తామని బాహాటంగానే చెబుతున్నారు. అంతే కాకుండా టీతెలుగుదేశం, జనసేన కూటమిగా ఎన్నికల బరిలోకి దిగుతుండటంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఈ కూటమి క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పరిస్థితి ఎలా ఉందంటే..
ఇచ్ఛాపురం:
ఇచ్ఛాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఈ నియోజకవర్గంనుంచి తెలుగుదేశం అభ్యర్థిగా 2014, 2019 ఎన్నికల్లో బెందాళం అశోక్ విజయం సాధించారు. రానున్న ఎన్నికలలో కూడా ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థిగా అశోక్ మరోసారి బరిలోకి దిగుతున్నారు. 2024 ఎన్నికల్లో అశోక్ ను ఓడించాలని వైసీపీ అధిష్టానం పట్టుదలతో ఉంది. ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పిరియా సాయిరాజ్ పోటీచేసి ఓడిపోయారు. వైసీపీ అధిష్టానం సాయిరాజ్ ను తప్పించి ఈసారి ఎన్నికల్లో ఆయన సతీమణి పిరియ విజయను బరిలోకి దింపింది. అయితే నియోజకవర్గం వైసీపీలో అంతర్గత విభేదాలకు తోడు, జగన్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై ప్రజల్లో తీవ్రవ్యతిరేకత ఆ పార్టీ విజయానికి అవరోధాలుగా మారియి. ఇచ్ఛాపురం అంటేనే తెలుగుదేశం పార్టీకి కంచుకోట. దీనికి తోడు జగన్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కలిసి బెందాళం అశోక్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమన్న భావన స్థానికంగా బలంగా వ్యక్తమౌతోంది.
పలాస:
పలాస నియోజకవర్గంలో ఈసారి తెలుగుదేశం, జనసేన కూటమి విజయం ఖాయంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా సీదిరి అప్పలరాజు బరిలో నిలిచి టీడీపీ అబ్యర్థి గౌతు శిరీషపై విజయం సాధించారు. ప్రస్తుతం అప్పలరాజుపై నియోజకవర్గం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నాలుగున్నరేళ్ల కాలంలో ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. దీనికితోడు భూకబ్జాల ఆరోపణలు ఉన్నాయి. వైసీపీలోనూ అప్పలరాజుపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గౌతు శిరీష గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. నాలుగున్నరేళ్లుగా ప్రజల్లోనే ఉంటూ, నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారంలో కీలక భూమిక పోషిస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం శ్రేణులకు అండగా ఉంటూ వస్తున్నారు. ఆమెపై నియోజకవర్గం ప్రజల్లో సానుభూతి ఉండటంతోపాటు ఆమెను గెలిపిస్తే నియోజకవర్గం అబివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో గౌతు శిరీష్ తెలుగుదేశం, జనసేన కూటమిఅభ్యర్థిగా బరిలో నిలిస్తే విజయం నల్లేరు మీద బండినడకేనంటున్నారు.
టెక్కలి:
టెక్కలి నియోజకవర్గం కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటేనని చెప్పాలి. రాష్ట్ర విభజన తరువాత జరిగిన రెండు ఎన్నికలలోనూ అంటూ 2014, 2019 ఎన్నికల్లో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. మరోసారి అచ్చెన్నాయుడు ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఇక వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ రావు బరిలో దిగుతున్నారు. వైసీపీ అధిష్టానం ఆయన్ను నియోజకవర్గ పార్టీ ఇంచార్జిగా నియమించింది. దువ్వాడకు మాస్ లీడర్‌గా పేరున్నప్పటికీ, వైసీపీలో ఒక బలమైన వర్గానికి ఆయన పొడగిట్టదు. ఆయన సతీమణి దువ్వాడ వాణి నియోజకవర్గ వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. ఆమెతోనూ దువ్వాడ శ్రీనివాస్ కు విబేధాలు ఉన్నాయని తెలుస్తోంది. దీనికితోడు జగన్ పాలనపై నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఏ విధంగా చూసినా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి విజయం తథ్యమని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదని స్థానికులే బాహాటంగా చెబుతున్నారు.
పాతపట్నం:
పాతపట్నం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా రెడ్డి శాంతి విజయం సాధించారు. అయితే ఆమెకు ప్రస్తుతం నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తోంది. వైసీపీలో వర్గ విబేధాలకు తోడు, నాన్ లోకల్ ముద్ర కారణంగా ఈసారి ఆమె ఎన్నికల బరిలో నిలిస్తే ఓటమి ఖాయమని వైసీపీ నేతలే బాహాటంగా చెబుతున్నారు. దీంతో వైసీపీ అధిష్టానం ఆమెను మార్చి కొత్త వారికి అవకాశం ఇస్తుందన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఇక తెలుగుదేశం, జనసేన కూటమి అభ్యర్థిగా కలమట వెంకటరమణ మూర్తి బరిలోకి దిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన నియోజకవర్గ తెలుగుదేశం ఇంచార్జిగా ఉన్నారు. పొత్తులో భాగంగా పాతపట్నం నియోజకవర్గం జనసేనకు కేటాయిస్తే ఏమో కానీ, లేకుంటే తెలుగుదేశం అభ్యర్థిగా కలమట వెంకటరమణ మూర్తి ఎన్నికల బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తున్నది. ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం, జనసేన కూటమి అభ్యర్థిగా ఎవరు పోటీలోకి దిగినా విజయం నల్లేరుపై బండినడకేనని అంటున్నారు.
శ్రీకాకుళం:
శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు గత ఎన్నికల్లో విజయం సాధించారు. మరోసారి వైసీపీ నుంచి ఆయనే పోటీచేయనున్నారు. అయితే, ఈసారి ధర్మాన ప్రసాదరావు ఓటమి ఖాయమన్న వాదన నియోజకవర్గ ప్రజల నుంచే బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు ధర్మాన గ్రాఫ్ కూడా రోజురోజుకు పడిపోతుండటం స్పష్టంగా తెలుస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నియోజకవర్గంలో అ భివృద్ధి అన్నదే లేకపోవడం, ధర్మాన నియోజకవర్గ సమస్యలను పట్టించుకోకపోవడంతో ప్రజాగ్రహం తీవ్రంగా ఉంది. దీనికి తోడు వైసీపీలోని వర్గ విభేదాలులు ధర్మానకు మరిన్ని తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం, జనసేన కూటమి అభ్యర్థిగా గుండ లక్ష్మీదేవి ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆమెపై నియోజకవర్గ ప్రజల్లో సానుభూతి ఉంది. పొత్తులో భాగంగా జనసేన ఓట్లు కూడా బదిలీ అయితే ఆమె విజయం సునాయాసమే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆమదాలవలస:
ఆముదాల వలస నియోజకవర్గంలో గత ఎన్నికల్లో తమ్మినేని సీతారాం వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆయన ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా కొనసాగుతున్నారు. అయితే, నియోజకవర్గంలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అభివృద్ధిని గాలికొదిలేశాన్న విమర్శలు ఉన్నాయి. దీనికితోడు నియోజకవర్గంలో ఆయన కుటుంబ సభ్యుల జోక్యం ఎక్కువైందన్న ఆరోపణలూ ఉన్నాయి. అలాగే తమ్మినేని తీరుపట్ల నియోజకవర్గంలోని వైసీపీ నేతలు సైతం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తెలుగుదేశం అభ్యర్థిగా ఇక్కడ నుంచి కూన రవికుమార్ మరోసారి బరిలోకి దిగుతున్నారు. తమ్మినేని పట్ల నియోజకవర్గంలో ప్రజల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకత కూన రవికుమార్ విజయానికి దోహదం కానుంది. వైసీపీ ప్రభుత్వంపైనా ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనికితోడు తెలుగుదేశం, జనసేన పొత్తు రవికుమార్ విజయాన్ని ఖాయం చేసేసిందని పరిశీలకులు అంటున్నారు.
ఎచ్చెర్ల:
ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గొర్లె కిరణ్ కుమార్ పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం వైసీపీపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. జగన్ ప్రజావ్యతిరేకత విధానాలకుతోడు స్థానిక ఎమ్మెల్యే తీరుపైనా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి ఆనవాలే లేకపోవడం, వైసీపీలో వర్గ విభేదాలు వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఓటమికి కారణాలుగా మారనున్నాయి. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన కూటమి పట్ల ప్రజల్లో సానుకూలత ఉంది. అయితే టీడీపీ అభ్యర్థిగా కిమిడి కళా వెంకటరావు బరిలోకి దిగుతారా లేదా పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గం ఈ సారి జనసేనకు కేయాయిస్తారా అన్న విషయంలో స్పష్టత లేదు. అయితే తెలుగుదేశం, జనసేన కూటమి అభ్యర్థిగా ఎవరు బరిలో నిలిచినా విజయం తధ్యమన్నభావన నియోజకవర్గ ప్రజలలో వ్యక్తం అవుతోంది.
నరసన్నపేట:
నరసన్నపేట నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ధర్మాన కృష్ణ దాస్ ఉన్నారు. మరోసారి ఆయనే వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. అయితే, వైసీపీ ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత ఆయన విజయానికి పెద్ద అవరోధంగా మారనుంది. అలాగే నియోజకవర్గంలో వైసీపీలోని గ్రూపు తగాదాలు కూడా ధర్మాన కృష్ణదాస్ కు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. మ్మెల్యేగా ధర్మాన కృష్ణదాస్ నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదన్న ఆగ్రహం కూడా జనంలో వ్యక్తం అవుతున్నది. నరసన్న పేట నుంచి గత ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థిగా బగ్గు రమణ మూర్తి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి ఇక్కడ నుంచి రామ్మోహన్ నాయుడు బరిలోకి దిగుతారన్న చర్చ జరుగుతున్నది. తెలుగుదేశం, జనసేనల నుంచి అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగినా విజయం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రాజాం:
రాజాం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కంబాల జోగులు విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో రెండుసార్లు వైసీపీ అభ్యర్థిగా ఆయనే విజయం సాధించారు. అయితే ప్రస్తుతం నియోజకవర్గంలో ఆయనకు ఎదురుగాలి వీస్తున్నది. ఎమ్మెల్యే పని తీరు పట్ల నియోజకవర్గ ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీంతో జగన్ కంబాల జోగులును తప్పించి డాక్టర్ తాలె రాజేష్ ను అభ్యర్థిగా బరిలోకి దింపుతోంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది. రాజం నుంచి కొండ్రు మురళి లేదా మాజీ స్పీకర్ ప్రతిభాభారతి కుమార్తె గీష్మ పోటీలో నిలిచే అవకాశం ఉంది. వీరిద్దరిలో ఎవరు అభ్యర్థిగా నిలిచినా విజయం నల్లేరు మీద బండినడకేనంటున్నారు.
పాలకొండ:
పాలకొండ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా విశ్వసరాయి కళావతి ఉన్నారు. ఈ నియోజకవర్గం ప్రజల్లో వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విశ్వసరాయి వైసీపీ అభ్యర్థిగా మరోసారి బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే ఆమె హయాంలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు వైసీపీలో ఆమె వర్గ పోరును ఎదుర్కొంటున్నారు. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ మరోసారి బరిలోకి దిగే అవకాశం ఉంది. జనసేన బలంకూడా తోడుకానుండటంతో నిమ్మక జయకృష్ణ విజయం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.