కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం.. స్పీకర్ పదవి, జలశక్తి శాఖపై దృష్టి
posted on Jun 6, 2024 @ 2:49PM
ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడం అంటే ఇదే. గత రెండు సార్లుగా తిరుగులేని మెజారిటీ సాధించిన బీజేపీ స్పీడ్ కు ఈ సారి ఓటర్లు స్పీడ్ బ్రేక్ వేశారు. ప్రభుత్వం కొనసాగించాలంటే మిత్రపక్షాల మద్దుతు తప్పని సరి పరిస్థితి కల్పించారు. మిత్రపక్షాల మద్దతు అవసరం లేకుండానే ప్రభుత్వం నడిపేందుకు అవసరమైన బలం ఉండటంతో అధికారంలో ఉన్న గత రెండు సార్లూ కూడా బీజేపీ మిత్రధర్మం పాటించలేదు. మిత్రధర్మం పాటించకపోవడమే కాకుండా.. మిత్రపక్షాల్లోనే చీలిక తీసుకువచ్చి వాటిని బలహీన పరిచింది. ఇష్టారీతిగా ఎకపక్షంగా నిర్ణయాలు తీసుకుంది.
పెద్ద నోట్ల రద్దు, రైతు చట్టాలు ఇలా ఒకటనేమిటి? ప్రతి విషయంలోనూ బీజేపీ ఇష్టారీతిగా నిర్ణయాలు తీసుకుంది. దేశంలో నిరుద్యోగం తాండవిస్తున్నా పట్టించుకోలేదు. విపక్షాలనే కాదు, మిత్రపక్షాలను కూడా నిర్వీర్యం చేసి ఏకఛద్రాధిపత్యం దిశగా అడుగులు వేసింది. దీంతో జనం ఈ సారి బీజేపీకి సొంతంగా అధికారం చేపట్టేందుకు అవసరమైన సీట్లను ఇవ్వలేదు. మిత్రుల అండ లేకుండా ప్రభుత్వం మనుగడ సాగించలేని పరిస్థితి కల్పించారు.
సరే ఎలాగైతేనేం ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మద్దతుతో కేంద్రంలో ఎన్డీయే సర్కార్ కొలువుదీరనుంది. ప్రధాని అభ్యర్థిగా మోడీని ఎన్డీయే ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ నెల 9 వతేదీ ఎన్డీఏ సర్కార్ ఏర్పాటు కానుంది. బీజేపీకి 240 సీట్లు మాత్రమే రావడంతో మ్యాజిక్ ఫిగర్ కు ఇంకా 32 సీట్ల దూరంలో ఆగిపోయింది. దీంతొ ఎన్డీయే కూటమిలో అతి పెద్ద పార్టీగా అవతరించిన తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఎనలేని ప్రాధాన్యత దక్కింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాత్రమే ఎన్డీయే పక్షాలను ఏకతాటిపైకి తీసుకురాగలరని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది.
ఎన్డీయేలో మొత్తం 21 పార్టీలు ఉన్నప్పటికీ వాటిలో తెలుగుదేశం, జేడీయూలు మినహాయిస్తే మిగిలినవన్నీ సింగిల్ డిజిట్ పార్టీలే. దీంతో చంద్రబాబుకు కేంద్ర కేబినెట్ కూర్పులో మంచి బార్గెయినింగ్ పవర్ లభించింది. దీంతో చంద్రబాబు లోక్ సభ స్పీకర్, జలశక్తి మంత్రి పదవిపై దృష్టి పెట్టారు. ఆ రెండీ తెలుగుదేశం పార్టీకి కేటాయించాలని ప్రధాని మోడీని గట్టిగా కోరినట్లు తెలిసింది. పోలవరం కోసం జనశక్తి వనరుల శాఖ ఐటీ,ఆర్ధిక శాఖలను కూడా కోరుతున్నట్లు చెబుతున్నారు.