తిరుపతిలో ఎవరి లెక్కేంటి?
posted on Mar 30, 2021 @ 1:02PM
గురుమూర్తికి ఐదులక్షల మెజారిటీ. ఇది అధికార పార్టీ చేస్తున్న హడావుడి. గతంలో ఏ ఎన్నికకూ లేనివిధంగా తిరుపతి బై పోల్‌ను వైసీపీ సవాల్‌గా తీసుకుంది. అందుకు కారణం, టీడీపీకి విజయావకాశాలు అధికంగా ఉండటమే అంటున్నారు. తెలుగుదేశానికి మిగతా చోట్ల ఓ లెక్క.. తిరుపతిలో మరోలెక్క. వెంకన్న సాక్షిగా ఈసారి తమ సత్తా ఎంతో చాటాలని ప్రతిపక్షం గట్టిగా ప్రయత్నిస్తోంది. అందుకే, ఫ్యాన్ పార్టీలో ఇంతటి కలవరం. 5లక్షల మెజార్టీ అంటూ మైండ్ గేమ్.
వైసీపీకి 5 లక్షల మెజార్టీ రావడానికి అది కడప ఉప ఎన్నిక కాదు.. తిరుపతి బై పోల్. ఇక్కడ వార్ వన్ సైడ్ కాబోదు. రేసులో మాజీ ఎంపీ పినబాక లక్ష్మి ఉన్నారు. చంద్రబాబు సొంత జిల్లా కూడా. ప్రజలతో సంబంధం లేని ఫిజియోథెరపిస్టు గురుమూర్తి అభ్యర్థిత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. మాజీ ఐఏఎస్ రత్నప్రభ.. జగన్ మనిషేనంటూ జనాలు ఫిక్స్ అయిపోయారు. ఇక కాంగ్రెస్ కేండిడేట్ చింతా మోహన్‌ను ఓటర్లు ఎప్పుడో మర్చిపోయారు. ఇలా, అభ్యర్థుల పరంగా చూసుకుంటే.. పినబాక లక్ష్మినే బలమైన పోటీదారు. ఆమె స్వస్థలం గూడూరు నియోజకవర్గం పరిధిలోని కోట మండలం. పనబాక దంపతులకు నెల్లూరు, చిత్తూరు జిల్లాల రాజకీయ నేతలు, ప్రజలతో విస్తృత పరిచయాలున్నాయి. 2019 ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థుల కన్నా, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన పనబాక లక్ష్మికే ఎక్కువ ఓట్లు రావడం ఆమె పాపులారిటీకి నిదర్శనం. అందుకే గెలుపుపై టీడీపీలో అంత ధీమ. వైసీపీలో హైరానా.
అధికారపార్టీ అరాచకాల వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలైంది. ఓటమితో పోయిన పరువును తిరిగి.. తిరుపతి ఉప ఎన్నికతో దక్కించుకోవాలని తెలుగుదేశం పార్టీ పట్టుదలగా ఉంది. ఎన్నికల పర్యవేక్షణ కోసం సమర్థులైన నాయకులను తిరుపతిలో మోహరిస్తోంది. ప్రతి నియోజకవర్గంలో పక్కజిల్లాలకు చెందిన అనుభవజ్ఞులైన నేతలను నియమిస్తున్నారు. వారికి క్షేత్రస్థాయిలో ఓటర్ల బాధ్యతలు అప్పగిస్తున్నారు. అధికార పార్టీ వైఫల్యాలను, ప్రజావ్యతిరేక విధానాలను జనాల్లోకి తీసుకెళుతున్నారు. టీడీపీ హయాంలో రాష్ట్రం ఎలా ఉండేది.. జగన్ వచ్చాక అభివృద్ధి ఎలా కుంటబడిందో ప్రజలకు వివరిస్తున్నారు.
అధికార పార్టీ బెదిరింపులకు చెక్ పెట్టేలా.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విసిరిన పాచికతో వైసీపీ ఉలిక్కిపడుతోంది. టీడీపీకి ఓటేస్తే ప్రభుత్వ ప్రయోజనాలు అందవంటూ.. వైసీపీ నేతలు కానీ, వాలంటీర్లు కానీ బెదిరిస్తే.. ఆ వీడియోలు, ఆడియో రికార్డులు, ఫోటోలు 7557557744 వాట్సాప్ నెంబర్‌కు పంపితే వారి అకౌంట్‌లో 10వేలు వేస్తామంటూ టీడీపీ ప్రకటించిన బంపర్ ఆఫర్ అధికార పార్టీలో ప్రకంపణలు సృష్టిస్తోంది. గత స్థానిక సంగ్రామంలో ఇలా పథకాల పేరుతో బెదిరించే బలవంతంగా ఓట్లు దండుకుంది అధికార పార్టీ. తాజాగా, టీడీపీ వాట్సాప్ ఆఫర్‌తో తిరుపతిలో వైసీపీ పప్పులు ఉడకని పరిస్థితి.
ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో.. ఓటర్లు కేవలం ప్రభుత్వ పథకాల ఆధారంగానే ఓట్లు వేయరు. అక్కడి వారిని తిరుమల చుట్టూ జరుగుతున్న రాజకీయాలూ ప్రభావితం చేస్తాయి. వెంకన్న సన్నిధిలో అన్యమత ప్రచారంపై ఇప్పటికే ఆగ్రహంగా ఉన్నారు తిరుపతి ప్రజలు. ఎస్వీబీసీ లాంటి పవిత్ర ఛానెల్‌ను పృథ్వీ లాంటి కమెడియన్ చేతిలో పెట్టి.. వెకిలి చేష్టలతో ఎస్వీబీసీ పరువు తీసిన పాపం ఈ ప్రభుత్వానిదే. ఏకంగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీదనే అన్యమత ఆరోపణలు రావడం మరింత దారుణం. టీటీడీ పాలక మండలిలో పారిశ్రామిక వేత్తలకు పట్టం కట్టడం.. చిత్తూరు జిల్లాలో దళితులపై దాడులు జరగడం.. శ్రీసిటీలో కొత్త కంపెనీలు రాకపోవడం.. ఇలా అనేక అంశాలు తిరుపతి ఎంపీ ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయి. ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా.. అది అధికార వైసీపీకి వ్యతిరేకమే. ప్రతిపక్ష టీడీపీకి అనుకూలమే. అందుకే వైసీపీలో కలవరం పెరుగుతోంది. 5 లక్షల మెజార్టీ అంటూ మైండ్ గేమ్ ఆడుతోంది. అధికార పార్టీ ఇంత హంగామా చేస్తున్నా.. టీడీపీ మాత్రం గెలుపుపై ధీమాతో.. కామ్‌గా, కూల్‌గా తన పని తాను చేసుకు పోతోంది.