వాణీ దేవికి ప్రమోషన్ ?
posted on Mar 30, 2021 @ 1:08PM
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కే. చంద్రశేఖర రావు, రాజకీయ వ్యూహ రచనలో మహా దిట్ట.ఇది ఆయన ప్రత్యర్ధులు కూడా అంగీకరించే నిజం. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఎవరూ ఉహించని విధంగా, చివరి క్షణంలో దివంగత ప్రధానమంత్రి పీవీ నరసింహ రావును తెరమీదకు తీసుకొచ్చారు. హైదరాబాద్,రంగారెడ్డి,మహాబూబ్’నగర్ పట్టభద్రుల నియోజక వర్గం నుంచి పీవీ కుమార్తె వాణీ దేవిని తెరాస అభ్యర్ధిగా దించి, పీవీ బొమ్మను బ్రహ్మాండగా ఉపయోగించుకున్నారు. పీవీ కుమార్తె వాణీదేవి పోటీ చేసిన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నియోజక వర్గంలో మాత్రమే కాదు, అటు ఖమ్మం, వరంగల్, నల్గొండ నియోజక వర్గంలోనూ పీవీ సెంటిమెంట్ బానే వర్కౌట్ అయింది. పీవీకులం, ప్రాంతంతో పాటుగా మేథావి వర్గంలో ఆయనకున్న పలుకుబడిని కూడా, చక్కగా సొమ్ము చేసుకున్నారు.ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఆయా వర్గాల్లో ప్రభుత్వం పట్ల గల వ్యతిరేకతను,పీవీ అస్త్రంతో పటాపంచలు చేయగలిగారు.అఫ్ కోర్స్, అదొక్కటే తెరాస గెలుపుకు కారణం కాక పోవచ్చును కానీ, అది (పీవీ అస్త్రం) ఒక రకంగా గేమ్ చేంజర్’గా పనిచేసింది అనేది మాత్రం నిజం.
ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు,కొత్తగా చిక్కిన సెంటిమెంట్ అస్త్రాన్ని మరింతగా ఉపయోగించుకోవాలనే అలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీగా ఎన్నికైన వాణీ దేవికి, మండలి చైర్మన్ పదవి ఇచ్చి, పీవీ పేరు’ ప్రతిష్టలు. ఇమేజ్’ను మరింత విస్తృత స్థాయిలో ఉపయోగించుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. వాణిదేవి హోదాను పెంచడం ద్వారా పీవీని మొత్తానికి మొత్తంగా తమ వాడిని చేసుకోవచ్చని, తద్వారా కాంగ్రెస్ పార్టీతో మిగిలున్న కొద్దిపాటి బంధాన్ని లాగీయ వచ్చని, కూడా ముఖ్యమంత్రి భావిస్తున్నారని పార్టీ వర్గాల్లో వినవస్తోంది. ఓ వంక పీవీ శతజయంతి వేడుకలు నిర్వహిస్తూ, మరో వంక వాణీ దేవికి పదోన్నతి కలిపించడం ద్వారా, పీవీ కాంగ్రెస్ మూలాలను వెనక్కి నెట్టేయవచ్చనేది, ముఖ్యమంత్రి ఆలోచనగా చెపుతున్నారు. ఓ వంక పీవీని కాంగ్రెస్ నుంచి వేరుచేయడంతో పాటుగా, మరో వంకబీజేపీ వైపు మొగ్గు చూపుతున్న బ్రాహ్మణ మేథావులను, ఓటును తమ వైపు తిప్పుకునేందుకు పీవీ అస్త్రం ‘బ్రాహ్మణ’ అస్త్రంగానూ పని చేస్తుందని కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అదలా ఉంటే ప్రస్తుత మండలి చైర్మన్, గుత్తాసుఖేందర్ రెడ్డికి కూడా ఆ పదవి మీద పెద్దగా ఆసక్తి లేదు. క్రియాశీల రాజకీయలలో ఉండేందుకే గుత్తా ఇష్ట పడతారు. రాజ్యాంగబద్ద మండలి చైర్మన్ పదవిలో ఉంటూ కూడా ఆయన రాజకీయాలను వదులు కోలేదు. సాధారణంగా స్పీకర్, ఛైర్మెన్ పదవులలో ఉన్నవారు రాజకీయాలకు దూరంగా ఉంటారు. అయితే గుత్తా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి, ఆయనకు మరో పదవి ఆఫర్ చేస్తే చైర్మన్ చైర్లోంచి ఎగిరి గంతెసేందుకు సిద్దంగా ఉన్నట్లు ఆయన చర్యలే సూచిస్తున్నాయి. సో, త్వరలోనే, వాణీదేవికి ప్రమోషన్ ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి ఆమె గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంలో స్వయంగా ఆయనే ఆమెకు మరింత ఉన్నత పదవులు ఇస్తామని కూడా అన్నారు.