తెలంగాణాలో తెదేపా-బీజేపీల స్నేహం కొనసాగుతుందా?
posted on Aug 22, 2014 9:06AM
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేప్పట్టిన అమిత్ షా నిన్న హైదరాబాదు వచ్చారు. తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసి, వచ్చే ఎన్నికల నాటికి విజయం సాధించే విధంగా పార్టీని తీర్చిదిద్దుతానని ఆయన ప్రకటించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిన్న రాత్రి ఆయనను కలిసి అరగంటసేపు మాట్లాడారు. త్వరలో జీ.హెచ్.యం.సి. ఎన్నికలు జరగనున్నాయి గనుక బహుశః ఆ విషయంపై వారిరువు చర్చించి ఉండవచ్చును. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఎన్డీయే కూటమికి మద్దతు ప్రకటించారు గనుక, బహుశః ఇప్పుడు కూడా అమిత్ షా ఆయన మద్దతు కోరి ఉండవచ్చును. జనసేన పార్టీ నిర్మాణం ఇంకా జరుగలేదు గనుక బహుశః పవన్ కళ్యాణ్ కూడా అందుకు అంగీకరించవచ్చును.
కానీ ఈసారి కూడ బీజేపీ తెదేపాతో పొత్తులు పెట్టుకొంటుందా లేదా అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఎందువలన అంటే మొదటి నుండి తెదేపాతో ఎన్నికల పొత్తులను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్న బీజేపీ తెలంగాణా శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కొన్ని రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ జీ.హెచ్.యం.సి. ఎన్నికలలో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలనుకొంటున్నట్లు తెలిపారు. తెదేపా తమకు మిత్రపక్షమని తెలిసి ఉన్నప్పటికీ ఆయన ఆ విధంగా చెప్పడం చూస్తే, బహుశః ఆయన బీజేపీ అధిష్టానం అనుమతితోనే ఆ విధంగా చెప్పి ఉండవచ్చునని భావించవలసి ఉంటుంది.
అమిత్ షా కూడా తెలంగాణాలో తమ పార్టీని బలోపేతం చేసుకొని, వచ్చే ఎన్నికలలో విజయం సాధించడం గురించి మాట్లాడారు తప్ప కిషన్ రెడ్డి చేసిన ప్రకటనను ఖండించలేదు అలాగని సమర్ధించలేదు కూడా. అంటే జీ.హెచ్.యం.సి. ఎన్నికలలో తెదేపాతో ఎన్నికల పొత్తులు పెట్టుకొంటుందా లేదా? అనేది అనుమానంగానే ఉంది. కానీ తెలంగాణాలో అధికారం చేప్పట్టినప్పటి నుండి క్రమంగా బలం పుంజుకొన్న తెరాసను, హైదరాబాదులో మంచి బలం కల మజ్లీస్ పార్టీలను ఎదుర్కోవాలంటే, కిషన్ రెడ్డికి ఇష్టమున్నా లేకపోయినా బలమయిన క్యాడర్ ఉన్న తెదేపాతో బీజేపీ పొత్తులు పెట్టుకోవలసి ఉంటుంది. కనుక తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో కూడా ఈ విషయమై చర్చించిన తరువాతనే బీజేపీ ఒక నిర్దిష్ట ప్రకటన చేయవచ్చును.
ఒకవేళ బీజేపీ ఈ ఎన్నికలలో ఒంటరిగా పోటీకి దిగదలచుకొంటే, ఆ రెండు పార్టీలను విమర్శించేందుకు ప్రతిపక్షాలకు చక్కటి అవకాశం దొరుకుతుంది. అది వాటికి చాలా ఇబ్బందికర పరిస్థితులు కల్పించవచ్చును. కనుక ఈ విషయంలో బీజేపీ చాలా ఆచితూచి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మొదటి నుండి బీజేపీకి, నరేంద్ర మోడీకి చాలా అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు గనుక ఆ రెండు పార్టీల మధ్య పొత్తులకు ఎటువంటి సమస్య, పునరాలోచన అవసరం ఉండకపోవచ్చును.