చంద్రబాబు ప్రయాణం ఎటువైపు?
posted on Sep 16, 2012 @ 8:20PM
తెలంగాణ సెంటిమెంట్ పుణ్యమా అని తెలుగుదేశం పార్టీ వట్టిపోయింది. పార్టీకి ఎంతో కాలంగా అండగా నిలబడ్డ చాలామంది దిగ్గజాలు ప్రత్యేక రాష్ట్రం స్లోగన్ తో రకరకాల దారులుపట్టిపోయారు. ఇప్పుడు మళ్లీ వాళ్లందర్నీ తిరిగి పచ్చజెండాకిందికి తీసుకురావడానికి చంద్రబాబు విశ్వప్రయత్నం చేస్తున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైతే తెలంగాణకు అనుకూలంగా లేఖ రాయాలనికూడా ఆయన నిర్ణయించుకున్నారు. అక్టోబర్ రెండు నుంచి బాబు మొదలుపెట్టబోయే పాదయాత్రను మామూలుగా ఎప్పటిలాగే తిరుపతి నుంచి ప్రారంభించాలి. ఏ పని మొదలుపెట్టినా తిరుపతినుంచే దాన్ని ప్రారంభించడం చంద్రబాబు సెంటిమెంట్. కానీ.. ఈ సారి తెలంగాణ వాదుల్ని ఆకట్టుకునేందుకు తెలంగాణలోని ఏదో ఒక ప్రాంతంనుంచి యాత్రని మొదలుపెట్టాలని చంద్రబాబుపై కార్యకర్తలు, నేతలనుంచి ఒత్తిడి పెరుగుతోంది. అలిగి అటకెక్కిన వేణుగోపాలాచారి కిందికి దిగి మళ్లీ బాబుకి జై కొడితే ఆయన నియోజకవర్గంనుంచే యాత్ర ప్రారంభం కావొచ్చని చాలామంది అనుకుంటున్నారు. కానీ.. బాబుకి ఎన్నికలముందు యాత్రను తిరుపతినుంచి మొదలుపెడితేనే కలిసొస్తుందని కొందరు నేతలు వాదిస్తున్నారు. ఇద్దరిమధ్యా నలిగిపోతున్న చంద్రబాబు ఈ విషయంలో ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఏదేమైతేనేం మా బాబు మళ్లీ తెలంగాణకి జై కొడుతున్నాడుకదా.. అని టిడిపికి చెందిన తెలంగాణ వాదులంతా సంతోషంతో ఉన్నారు.