టార్గెట్ కేసీఆర్.. ఆ నాలుగు నియోజకవర్గాల్లో నిజామాబాద్ వ్యూహం
posted on Oct 19, 2023 @ 1:28PM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల హీట్ పీక్స్ కు చేరింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్షణం నుంచీ క్షణ తీరిక లేకుండా మూడు ప్రధాన పార్టీలూ ప్రచార వ్యూహాల ఖరారులో మునిగిపోయారు. అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన విధంగానే అధికార పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రచార శంఖారావాన్నికూడ ముందే పూరించారు. ఆ తరువాత కాంగ్రెస్ కూడా ప్రచారాన్ని రాహుల్, ప్రియాంకల పర్యటనతో ఆరంభించింది. ఇక బీజేపీ నేడో రేపే పార్టీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
తెలంగాణ సెంటిమెంట్ ను నమ్ముకుని గత రెండు అసెంబ్లీ ఎన్నికలలోనూ విజయాన్ని సాధించిన బీఆర్ఎస్ కు ఇప్పుడు ఆ సెంటిమెంటే ప్రతిబంధకంగా మారినట్లు కనిపిస్తున్నది. పార్టీ పేరులోంచే తెలంగాణను తొలగించి, అభివృద్ధి, సంక్షేమం అజెండాగా ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావాలని భావిస్తున్న కేసీఆర్ కు ఇప్పుడు తెలంగాణ అమరుల కుటుంబాలు షాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి. అమరుల త్యాగాలను స్మరించకుండా, వారి కుటుంబాలకు న్యాయం చేయకుండా హ్యాట్రిక్ విజయాలపై గురిపెట్టారంటూ అమరుల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీంతో కేసీఆర్ పోటీ చేయాలని భావిస్తున్న గజ్వేల్ , కామారెడ్డి నియోజకవర్గాలతో పాటు ఆయన కుమారుడు కేటీఆర్ పోటీ చేసే సిరిసిల్ల, అలాగే ఆయన మేనల్లుడు హరీష్ రావు పోటీ చేయనున్నసిద్ధిపేట నియోజకవర్గాలలో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయించారు.
గత లోక్ సభ ఎన్నికలలో నిజామాబాద్ స్థానం నుంచి పోటీ చేసిన కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు వ్యతిరేకంగా పసుపు రైతులు ఎలాగైతే పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసి ఆమె ఓటమికి కారకులయ్యారో.. అదే విధంగా ఈ అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ కుటుంబ సభ్యులు పోటీ చేసే స్థానాలలో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయాలని అమరుల కుటుంబాలు నిర్ణయించాయి.
అమరుల త్యాగాలను నిచ్చెనగా చేసుకుని అధికారాన్ని అధిరోహించిన కేసీఆర్ ఆ తరువాత ఉద్యమ కారుల కుటుంబాలకు న్యాయం చేయలేదనీ, న్యాయం చేస్తామంటూ ఇచ్చిన హామీలను విస్మరించారని ఆరోపిస్తూ వారు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ అమరవీరుల స్తూపం ప్రారంభోత్సవానికి కూడా తాము ఆహ్వానానికి నోచుకోలేదని వారు చెబుతున్నారు. అందుకే తమ ఆగ్రహాన్ని, నిరసనను చూపేందుకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు పోటీ చేసే స్థానాల్లో అమరవీరుల కుటుంబాల నుంచి నామినేషన్లు వేయాలనే నిర్ణయం తీసుకున్నా మంటున్నారు. అమరవీరుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆ నాలుగు నియోజకవర్గాలలో ఒక్కో నియోజక వర్గంలో కనీసం 150 మందితో నామినేషన్లు వేయించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అమరుల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూం ఇల్లు హామీ ఇచ్చిన కేసీఆర్ ఆ తరువాత వాటిని పూర్తిగా విస్మరించారని, కనీస గౌరవం కూడా చూపలేదని అమరుల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏరుదాటి తెప్ప తగలేసిన చందంగా కేసీఆర్ తమ పట్ల వ్యవహరించారని, అందుకే కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలనే లక్ష్యంతో ఆయన, ఆయన కుటుంబ సభ్యులు పోటీ చేసే నియోజకవర్గాలలో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయించినట్లు వివరిస్తున్నారు. అమరుల కుటుంబాలకు కేసీఆర్ చేసిన ద్రోహాన్ని ప్రజలలో ఎండగట్టాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
గతంలో పసుపు రైతులు వందకు పైగా నామినేషన్లు వేసి కవిత గెలుపును ఎలా అడ్డుకున్నారో అదే విధంగా ఇప్పుడు గజ్వేల్, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేటలలో కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.