సీఎం స్టాలిన్ బస్ జర్నీ.. మన ముఖ్యమంత్రులు ఉన్నారే..
posted on Oct 23, 2021 @ 4:26PM
ఒకప్పుడు రాజరికం రాజ్యమేలుతున్న కాలంలో రాజులు మారు వేషాల్లో వెళ్లి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకునే వారని చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. రాజరికం పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత, ముఖ్యమంత్రులు, మంత్రులు మారు వేషాలు వేసుకుని ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవడం వంటి ‘పిచ్చి’ పనులకు స్వస్తి చెప్పారు. ఇక ఇప్పుడైతే, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎన్నికల సమయంలో తప్పించి జనంలోకి వెళ్ళడం చాలా వరకు తగ్గించారు.
ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో, చంద్రబాబు నాయుడు ప్రజల వద్దకు పాలన. జన్మభూమి, ఆకస్మిక తనిఖీలు పేరిట జనంలోకి వెళ్లి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ, ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రలలో ముఖ్యమంత్రులు ప్రజలకు కనిపించడమే ఇంచుమించుగా మానేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్,ఫార్మ్ హౌస్’కు పరిమితం అయితే,ఏపీ సీఎం జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్’ నుంచి కాలు బయట పెట్టకుండా పాలన సాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పొరుగు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, స్టైల్ మాత్రం వేరుగా ఉంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన స్టాలిన్ తొలి నుంచే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు తాజాగా ఆయన ఆర్టీసీ బస్సులో ప్రయాణించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
రాష్ట్రంలో కొవిడ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు ఆయన చెన్నైలోని కన్నాగి ప్రాంతంలో గల ఓ వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లారు. అక్కడ ఆరోగ్య సిబ్బంది, టీకా తీసుకునేవారితో మాట్లాడి తిరుగుప్రయాణం అయ్యారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సును చూసి కారు దిగి బస్సెక్కారు. ఈ అనూహ్య పరిణామంతో బస్సులోని డ్రైవరు, కండక్టర్, ప్రయాణికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ముఖ్యమంత్రిని చూసిన సంతోషంలో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు.
బస్సులో ఆకస్మిక తనిఖీ చేపట్టిన స్టాలిన్.. ఆర్టీసీ సౌకర్యాలపై ప్రజలను ఆరా తీశారు. బస్సులు సమయానికి వస్తున్నాయా? మహిళలకు ఉచిత టికెట్లు సరిగ్గానే ఇస్తున్నారా?ఉచిత టికెట్ల వల్ల ప్రయోజనం ఉందా? అని వారిని అడిగి తెలుసుకున్నారు. బస్సులో కొంతమంది మాస్క్‌లు పెట్టుకోకపోతే వారిని మాస్క్‌లు ధరించాలని సూచించారు.
స్టాలిన్ బస్సు ప్రయాణానికి సంబంధించిన వీడియోను తమిళనాడు సీఎంవో కార్యాలయం ట్విటర్‌లో షేర్ చేయగా.. ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. తమిళనాడులో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ స్టాలిన్ ప్రభుత్వం ఆ మధ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఏమైనా రాజకీయల్లో పదికాలాల పాటు నిలవాలన్నా, నాయకులను ప్రజలు పదికాలాల పాటు గుర్తుంచుకోవాలన్నా, ఇదిగో ఇలా స్టాలిన్’లా జనంలో కలవాలి, జనంలో తిరగాలి .. అంతేగానీ, ఫార్మ్ హౌసు, ప్యాలెస్ లైఫ్’కే పరిమితం అయితే, జనం ఫీజులు పీకేస్తారని జనం అనుకుంటున్నారు.