రూ.2 కోట్ల డ్రగ్స్ సీజ్.. ఏపీలో కలకలం..
posted on Oct 23, 2021 @ 4:42PM
డ్రగ్స్‌పై ఏపీలో అలజడి రేగుతోంది. డ్రగ్స్, గంజాయిపై రాజకీయ రచ్చ నడుస్తోంది. వైసీపీ నేతల కనుసన్నల్లోనే మత్తు మాఫియా దందా కొనసాగుతోందంటూ టీడీపీ ఆరోపిస్తోంది. అందులో భాగంగానే సీఎం జగన్‌ను ఉద్దేశించి టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి బోసిడీకే అనే పదం వాడటం.. ప్రతీగా టీడీపీ కార్యాలయాలపై వైసీపీ మూకలు దాడులకు తెగబడటం.. ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరంటూ చంద్రబాబు 36 గంటల దీక్ష చేయడం.. ఇలా ఏపీ పాలిటిక్స్ డ్రగ్స్, గంజాయి చుట్టూ తిరుగుతున్నాయి. కట్ చేస్తే.. తాజాగా తెలంగాణలో 2 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడటంతో మళ్లీ అందరిచూపు ఏపీ వైపు...
మేడ్చల్ జిల్లాలోని మూడు ప్రాంతాల్లో రూ.2 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. తనిఖీల్లో భాగంగా కారులో ఉన్న మెపిడ్రిన్ డ్రగ్‌ను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మూడు ప్రాంతాల్లో 4.92 కిలోల డ్రగ్స్, కారును అధికారులు సీజ్ చేశారు. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఇద్దరు ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారు. విద్యార్థులకు సరఫరా చేయడానికే ఈ డ్రగ్స్ తీసుకొచ్చినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.
అయితే, హైదరాబాద్‌లో దొరికిన డ్రగ్స్ ఎక్కడి నుంచి తెచ్చారనే దిశగా విచారణ జరుగుతోంది. స్థానికంగా తయారు చేశారా? గోవా నుంచి తెప్పించారా? లేక, అంతా అనుమానిస్తున్నట్టు ఏపీ నుంచే వచ్చిందా? అనే కోణంలో ఎంక్వైరీ నడుస్తోంది. దర్యాప్తులో ఏపీ లింకులు బయటపడితే మాత్రం డ్రగ్స్ కేసు మరింత సంచలనంగా మారడం ఖాయమంటున్నారు.
ఇక ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ డ్రగ్స్, గంజాయి కట్టడికి పోలీస్, ఎక్సైజ్ అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. దీంతో ఎక్సైజ్ శాఖ స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగి.. మూడు చోట్ల దాడులు చేసి.. 2 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేశారు. అయితే, డ్రగ్స్‌పై ఏపీలో అంత రచ్చ జరుగుతున్నా.. సీఎం జగన్‌రెడ్డి ఇంత వరకూ డ్రగ్స్, గంజాయి కట్టడికి చిన్న మీటింగ్ కూడా పెట్టకపోవడం విమర్శల పాలవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం.. సీఎం కేసీఆర్ నిర్వహించిన డ్రగ్స్ సమీక్షను గుర్తు చేస్తూ.. సీఎం జగన్‌రెడ్డి తీరును తీవ్రంగా తప్పుబట్టారు. అయినా, వైసీపీ ప్రభుత్వం మాత్రం డ్రగ్స్, గంజాయి దందాపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడం లేదని అంతా మండిపడుతున్నారు.