ఎమ్మెల్యేగా ఓడినా కేంద్రమంత్రి.. అదృష్టమంటే మురుగన్ దే!
posted on Jul 8, 2021 @ 1:31PM
వడ్డించేవాడు మనవాడు అయితే, ఏ వరసన కూర్చున్నా ఒకటే, అన్ని రుచులు నడుచుకుంటూ వచ్చి విస్తట్లో వాలతాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం చేపట్టిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో అలాంటి అదృష్టవంతులు ముగ్గురు నలుగురున్నారు. అందులో తమిళనాడు నుంచి కేంద్ర మంత్రి వర్గంలో స్థానం పొందిన మురుగన్ కథ మరీ ప్రత్యేకం. కలిసొచ్చే కాలమొస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు, అన్నట్లు మంత్రి పదవి వచ్చి ఆయన వొళ్ళో వాలింది.
తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివరంలో కాబినెట్ హోదా పొందిన కిషన రెడ్డిదే అదృష్టం అనుకంటే,ఆయన కంటే మురుగన్ అదృష్టం మరీ విశేషం. కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయి, ఎంపీగా గెలిచి కేంద్రంలో సహాయ మంత్రి అయ్యారు. మురుగన్ అలాకాదు, ఎమ్మెల్యేగా ఓడిపోయారు, ఓడిపోయిన ఎమ్మెల్యేగానే కేంద్ర మంత్రి అయ్యారు.ఇప్పుడు ఆయనఆరు నెలలలోగా ఎక్కడో అక్కడి నుంచి రాజ్య సభకు ఎన్నిక కావలసి ఉంటుంది. అంతే కాదు, కిషన్ రెడ్డి లాగా మురుగన్’కు పార్టీలో సుదీర్ఘ కాలం కొనసాగిన అనుభవం గానీ, పై వాళ్లతో పరిచయాలు గానీ లేవు. గాడ్ ఫాదర్ అసలే లేరు. నిజానికి ఆయన ఎవరో ఏమిటో రాష్ట్రంలోనే చాలా మందికి తెలియదు. అయినా, ప్రధాని దృష్టిలో పడ్డారు. ఏకంగా కేంద్ర మంత్రి అయిపోయారు.
అయితే అదేదో అప్పన్నంగా వచ్చింది కాదు. అలా అని అనుకుంటే అదిపొరపాటే అవుతుంది.నిజమే కావచ్చును, సంవత్సరం క్రితం వరకు ఆయన ఎవరో ... ఎవరికీ తెలియక పోవచ్చును. అగ్రకుఅల పార్టీగా ముద్ర పడిన బీజేపీలో అన్గారిన్ వర్గానికి చెందిన ఆయనకు ఇంట గుర్తింపు వస్తుందని ఎవరూ ఉహించి ఉండరు. కానీ, సంవత్సరం క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, తానెవరో రాష్ట్ర ప్రజలకు తెలియచేయడమే కాదు, బీజేపీకి, ఆమాట కొస్తే జాతీయ పార్టీలకు పెద్దగా ఫుటింగ్ లేని తమిళనాడులో, కాషాయ భావజాలాన్ని జనంలోకి తీసుకెళ్ళారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నెలరోజులకు పైగా రాష్ట్రంలో ఆయన నిర్వహించిన రథయాత్ర పార్టీకి గుర్తింపు తెచ్చింది. ఆయన నిర్వహించిన పాదయాత్ర ఆయన వ్యక్తిగత ఇమేజ్’తో పాటుగా, పార్టీ ఇమేజినీ పెంచింది. అప్పటి అధికార పార్టీ, అన్నా డిఎంకేతో పొత్తులో భాగంగా బేరసారాలు సాగించడంలో ఆయన రధయాత్ర తెచ్చిన ఇమేజి పనిచేసింది. అనుకున్న సీట్లు తెచ్చుకున్నారు. ఆయన తిరుపుర్ జిల్లా తారాపూర్ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోయినా,పార్టీ అభ్యర్ధులు నలుగురు విజయం సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇంచుమించుగా 20 ఏళ్ల తర్వాత బీజేపీ శాసన సభలో ఆడుగు పెట్టింది. ఈ న్ని అంశాలను పరిగణలోకి తీసుకునే, ప్రధాని మోడీ మురుగన్’ పిలిచి పీటేశారు. మంత్రి వర్గంలోకి తీసుకున్నారు.
అయితే అదే చేత్తో పొరుగున ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కూడా కనీసం ఒక సహాయ మంత్రి పదవి ఇచ్చి ఉంటే, దక్షణాది రాష్ట్రాలలో కేంద్ర మంత్రివర్గంలో స్థానం లేని ఒక ఒక్క దౌర్భాగ్య రాష్ట్రం ఏపీ అన్న బాధ పార్టీ ప్రజలకు లేకుండా ఉండేది. నిజమే, ఏపీ బీజేపీకి తాదూ బొంగరం లేని మాట నిజమే.అంతే కాదు, ప్రాంతీయ పార్టీలు వైసీపీ, టీడీపీల రెండూ బలంగా ఉన్న నేపధ్యంలో బీజేపీ కేంద్ర నాయకత్వంప్రధాని మోడీ ఏపీ మీద ఇన్వెస్ట్ చేయడం వేస్ట్ అనుకున్నారేమో కూడా... అదెలా ఉన్నా ... ప్రధాని మోడీ కొత్త మంత్రివర్గంలో అందరికంటే అదృష్టవంతుడు ... మురుగన్.