రావణకాష్టంలా రగులుతున్న శ్రీలంక సమస్య
posted on Jul 30, 2014 8:01AM
శ్రీలంక వ్యవహారాలు భారత రాజకీయాలను చిరకాలంగా ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడులో రాజకీయపార్టీలు శ్రీలంకతో ముడిపడున్న ఏ సమస్యపైనైనా తక్షణమే స్పందించకపోతే ప్రత్యర్ధ పార్టీ నుండి రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవలసివస్తుందనే భయంతో, ప్రతీ సమస్యపై తీవ్రంగా స్పందిస్తుంటాయి. గతంలో తమిళ పార్టీలు మద్దతు తీసుకొన్న యూపీయే, ఎన్డీయే ప్రభుత్వాలకు శ్రీలంక వ్యవహారంలో తలబొప్పి కట్టింది. శ్రీలంకలో తమిళ ఉగ్రవాద సంస్థ- యల్.టీ.టీ.ఈ.ని పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నంలో వేలాది తమిళుల మరణానికి కారకుడయిన ఆ దేశ అధ్యక్షుడు రాజపక్సేను కూడా నరేంద్ర మోడీ పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి అతిధిగా ఆహ్వానించడాన్ని నిరసిస్తూ, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ప్రతిపక్ష నేత కరుణానిధి ఇరువురు హాజరుకాకుండా శ్రీలంకపై తమ వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదని స్పష్టం చేసారు.
తమిళనాడుకు చెందిన భారతీయ జాలారులను శ్రీలంక నావికాదళం తరచు అరెస్ట్ చేయడం ఆనక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి మేరకు మళ్ళీ వారిని విడిచి పెట్టడం చాలా కాలంగానే జరుగుతోంది. మళ్ళీ మొన్న మంగళవారంనాడు కూడా శ్రీలంక నావికాదళం 50మంది జాలారులు తమ జలాలలోకి ప్రవేశించారంటూ అరెస్ట్ చేసింది. నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి పిలుపు అందుకొన్నపుడు, శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే సుహృద్భావ సూచనగా అంతవరకు అరెస్ట్ చేయబడిన తమిళ జాలారులందరినీ విడుదల చేసారు. కానీ, ఆ తరువాత ఈ నెలన్నర సమయంలో శ్రీలంక నావికాదళం 93 జాలారులను అరెస్ట్ చేసింది. ప్రభుత్వ ఒత్తిదిమేరకు వారిలో 43మందిని విడుదల చేసినప్పటికీ వారి పడవలు, వలలు వగైరా మాత్రం తిరిగి ఇవ్వలేదు.
ప్రస్తుతం ఈ వ్యవహారం తమిళనాడులో రాజకీయ దుమారం లేపుతోంది. అందుకే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈ విషయంలో కేంద్రప్రభుత్వం తక్షణమే కలుగజేసుకొని, జాలారులను, వారి పడవలను విడిపించవలసిందిగా కోరుతూ ప్రధాని మోడీకి లేఖ వ్రాసారు. బహుశః ప్రధాని మోడీ కూడా సానుకూలంగా స్పందించి మళ్ళీ జాలరులను, వారి పడవలను విడిపించి ఇవ్వవచ్చును. కానీ రావణకాష్టంలా చిరకాలంగా రగులుతున్న ఈ సమస్యను ఆయన శ్రీలంక ప్రభుత్వంతో మాట్లాడి శాశ్వితపరిష్కారం చేయగలిగినట్లయితే, ఆయనకు తమిళప్రజల దృష్టిలో మరింత గౌరవం పెరుగుతుంది.