తమిళనాడులో ఎన్నికల ప్రచార హోరు
posted on Mar 31, 2011 @ 3:26PM
చెన్నై: తమిళనాడులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ముఖ్యమంత్రి కరుణానిధి కథ ముగిసిందని ఏఐఏడిఎంకె అధినేత్రి, పురుచ్చి తలైవి జయలలిత అంటున్నారు. డిఎంకె ప్రభుత్వం అవినీతి, అక్రమాలతో విసిగిపోయిన తమిళ ప్రజలు ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఇటీవల ఓ సర్వేలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే వార్తలను ఆమె కొట్టి పారేశారు. ప్రజలు సంకీర్ణ ప్రభుత్వాన్ని కోరుకోవడం లేదన్నారు. తమ పార్టీ సొంతగా గెలవడం ఖాయమని ఆమె చెబుతున్నారు. కాగా ముఖ్యమంత్రి కరుణానిధి మాత్రం సంకీర్ణ ప్రభుత్వం వస్తే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలో కాంగ్రెసు ఆధ్వర్యంలో సంకీర్ణం ఉన్నట్టే తమిళనాడులో తమ ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. అయితే కుంభకోణాల నేపథ్యంలో గెలుపపై నమ్మకం కోల్పోయిన కరుణానిది సంకీర్ణంపై మాట్లాడుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
కాగా ఇప్పటికే దక్షిణాధిన కర్ణాటకలో మొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ ఇక తమిళనాడుపై ఇప్పుడు దృష్టి సారించింది. ఇప్పటికిప్పుడు అధికారంలోకి రాకున్నా మెజారిటీ సీట్లు గెలుచుకోవాలనే తాపత్రయంలో ఉంది. ఇందులో భాగంగా 40 మంది జాతీయ స్థాయిలో ఉన్న ప్రధాన నేతలను రంగంలోకి దింపనుంది. ఇప్పటికే ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ రంగంలోకి దిగారు. ఈ ఎన్నికల్లో తమ సత్తా చూపుతామని ఆమె అంటున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోఢీ, అలనాటి నటి హేమమానిలి, టీవీ నటి స్మృతి ఇరానీలతో పాటు పలువురిని ప్రచారానికి ఉపయోగించుకోవాలని యోచిస్తోంది.