నూపుర్.. దేశాన్ని క్షమాభిక్ష కోరుకోః సుప్రీం కోర్టు
posted on Jul 1, 2022 @ 3:33PM
ఒకే ఒక్క మాట దేశాన్నే కాదు, విదేశాల్లోనూ విపరీతమైన వ్యతిరేకత కొని తెచ్చుకుంది. బహుశా ఇంతటి వ్యతిరేకత ఎవరి తిట్లకీ లభించలేదేమో! బిజెపీ మాజీ నాయకురాలు నూపుర్ శర్మ మహమ్మద్ ప్రవక్త గురించి చేసిన ఒక కామెంట్‌తో దేశంలో ముస్లింసోదరులతో పాటు అన్ని మతాలవారూ, అన్ని వర్గాల వారూ తిట్టిపోశారు. దేశంలో చెలరేగిన అల్లర్లకు ఆమె ఒక్కతే బాధ్యత వహించాలని, తనకు క్షమాభిక్ష పెట్టమని ఆమె యావత్ దేశాన్ని కోరాలని శుక్రవారం సుప్రీం కోర్టు ఆదేశించింది.
రాజకీయ నాయకులు తిట్టుకోవడం వేరు, భారీ విమర్శలు చేసుకోవడం వేరు, కానీ నూపుర్ చేసిన ఒకే ఒక్క కామెంట్ దేశమంతటినీ ఆశ్చర్యపరిచింది, అంతే స్థాయిలో భయాందోళనలకూ గురిచేసింది. నూపుర్ వూహించని విధంగా మహమ్మద్ ప్రవక్త గురించి చేసిన కామెంట్ల వల్ల బిజెపీ ఇరకాటంలోనే పడింది. ఫలితంగా ఆమెను ఏకంగా పార్టీ నుంచి తొలగించకా తప్పలేదు. అంతకు మించి పెద్ద శిక్ష పడా లని యావత్ భారతావనీ కోరుతోంది. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నూపుర్ ఒక టీవీ చర్చలో మత ప్రవక్త పై చేసిన కామెంట్ వల్ల దేశంలో మతపరమైన అల్లర్లు చెలరేగాయని అభిప్రాయ పడ్డారు. మంగళవారం ఉదైపూర్‌లో కన్హయలాల్ అనే టైలర్ ఘోర హత్యకు గురికావడానికి కారకురాలు నూపుర్ గా న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఆ టైలర్ నూపుర్ చేసిన కామెంట్‌కు మద్దతు ప్రకటించడంతో ఇద్దరు వ్యక్తులు అది ఇస్లాంకు అవమానమేనని భావించా ఆ దారుణానికి ఓడిగట్టారని న్యాయమూర్తులు అన్నారు.
నూపుర్ టీవీ చర్చలో పాల్గనడం గమనించామని, లాయర్ అయి వుండి కూడా అటువంటి కామెంట్ చేయడం దురదృష్టకరం, అవమానకరంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి సూర్యకాంత్ పేర్కొన్నారు. తన పై దేశంలో పలుచోట్ల దాఖలయిన ఎఫ్ ఐ ఆర్‌లను ఢిల్లీకి ట్రాన్స్‌ఫర్ చేయాలని నూపుర్ కోర్టును కోరింది. అయితే ఆమెకు ప్రాణహాని వున్న కారణంగా పిటిషన్‌పై తన పేరును ప్రస్తావించలేదు.
సమానత్వం, పక్షపాత లేకుండా నూపుర్ శర్మ వాదనను కోర్టు కొట్టివేసింది.
కానీ మీరు ఇతరులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినప్పుడు, వారు వెంటనే అరెస్టు చేయబడతారు, కానీ అది మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎవరూ మిమ్మల్ని తాకడానికి ధైర్యం చేయరు అని న్యాయమూర్తులు అన్నారు.ఆమె వ్యాఖ్యలు ఆమె మొండి అహంకార స్వభావాన్ని చూపించాయని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఆమె ఒక పార్టీకి అధికార ప్రతినిధి అయితే.. తనకు అధికారం ఉందని భావించి, దేశంలోని చట్టాన్ని గౌర వించకుండా ఏదైనా ప్రకటన చేయగలరా? అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రశ్నించారు. అసలు ఆమె న్యాయవాది అయి వుండి కూడా దేశమంతా చూసే చర్చావేదికలో తాను మాట్లాడేది తీవ్ర ప్రభావం చూపు తుందని, దేశమంతటా దాని తాలూకు పరిణామం తీవ్రస్థాయిలో వుంటుందన్న ఆలోచనలేకుండా కామెంట్ చేయడం అస్సలు సమర్ధనీయం కాదని సుప్రీంకోర్టు నమ్మింది.