రూ.2 వేలు ఇచ్చా.. నేనెందుకు పని చేయాలి?.. ఓటర్లకు జేసీ షాక్
posted on Apr 5, 2021 @ 7:19PM
తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మెన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఈసారి ఆయన ఏకంగా ఓటర్లకే ఝలక్ ఇచ్చారు. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్‌గా కొత్తగా బాధ్యతలను స్వీకరించిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. తాడిపత్రిలోని 35 వ వార్డులో పర్యటించారు.ఈ సందర్భంగా ఓటర్లకు రివర్స్ పంచ్ ఇచ్చారు. ఓటుకు రూ.2 వేలు ఇచ్చా.. నేనెందుకు పనిచేయాలి అంటూ.. ఓటర్లపై జేసీ ప్రభాకర్ రెడ్డి చెలరేగిపోయారు.
వార్డు ప్రజలు స్థానిక సమస్యలను జేసీ దృష్టికి తీసుకొచ్చారు. రోడ్లు సరిగ్గా లేవని, మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోందని చెప్పారు. కొత్త రోడ్లను వేయాలని విజ్ఞప్తి చేశారు. మురుగునీటి దుర్వాసనను భరించలేకపోతున్నామని, డ్రైనేజీ వ్యవస్థను సరి చేయాలని కోరారు. ఎండాకాలం సమీపించడంతో మంచినీరు దొరకట్లేదని వాపోయారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని కోరారు. దోమల మందు చల్లించాలని స్థానిక మహిళలు జేసీ ప్రభాకర్ రెడ్డిని కోరారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి భిన్నంగా స్పందించారు. ప్రజలకు రివర్స్ పంచ్‌లు ఇచ్చారు. ఒక్కో ఓటుకు రెండు వేల రూపాయలను తాను ఖర్చు చేశానని గుర్తు చేశారు. ఓటుకు రెండు వేల రూపాయలు తీసుకుని ఇప్పుడు పనులు చేయండి అని అడుగుతారా ? అంటూ ఓటర్లను జేసీ నిలదీశారు.
పనులు చేయాలని తనను అడిగే హక్కు లేదని నిర్మొహమాటంగా చెప్పారు జేసీ ప్రభాకర్ రెడ్డి. డబ్బు తీసుకోకుండా ఓట్లేసి ఉంటే, తాను పనులు చేసేవాడినని అన్నారు. డబ్బులు తీసుకోకుండా తనకు ఓటు వేసి ఉంటే.. అప్పుడు కాలర్ పట్టుకుని ప్రశ్నించే హక్కు ఓటర్లకు ఉండేదని అన్నారు. తనను రోడ్ల గురించి, మంచినీళ్ల గురించి అడగొద్దని ఓటర్ల ముఖం మీదే చెప్పేశారు. డబ్బులు తీసుకుని ఓటు వేస్తారు కాబట్టే.. తాము పనులు చేయకపోయినా ధైర్యంగా తిరగగలుగుతున్నామని జేసీ ప్రభాకర్ రెడ్డి తేటతెల్లం చేశారు. ప్రజల్లో ఏ మాత్రం మార్పు రాబోదని, డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయలేరనీ జేసీ ప్రభాకర్ రెడ్డి తేల్చి చెప్పారు.