షిర్డీ ఆలయం మూసివేత.. లాక్ డౌన్ దిశగా భారత్
posted on Apr 5, 2021 @ 9:55PM
మహారాష్ట్రలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం షిర్డీ ఆలయం మూతపడింది. మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం చేస్తుండటంతో షిర్డీలోని సాయిబాబా ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయాలని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ నిర్ణయించింది. సోమవారం రాత్రి 8గంటలకు ఆలయాన్ని క్లోజ్ చేసింది. ఈ నెల 30 వరకు ఆలయాన్ని మూసి ఉంచనున్నట్టు షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ ప్రకటించింది. సాయి బాబా ఆలయంతో పాటు ప్రసాదాలయ, భక్త నివాస్ కూడా మూసివేశారు. ఆలయంలో రోజువారీ పూజా కార్యక్రమాలు మాత్రం కొనసాగుతాయి. ఆలయం మూసివేసినప్పటికీ ఎస్‌ఎస్‌ఎస్‌టీ ఆధ్వర్యంలో ప్రారంభించిన కొవిడ్ ఆస్పత్రి, ఇతర ఆస్పత్రులు మాత్రం పనిచేస్తాయని ట్రస్టు స్పష్టంచేసింది.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ఏప్రిల్ 8న గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంలతో భేటీ కానున్న ప్రధాని.. కొవిడ్ తాజా పరిస్థితులు, వ్యాక్సినేషన్ సంబంధిత అంశాలపై చర్చించనున్నట్లు పీఎంవో వర్గాలు వెల్లడించాయి. సీఎంలతో ప్రధాని మోడీ సమావేశం తర్వాత దేశంలో లాక్ డౌన్ పై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కరోనా పరిస్థితులపై ప్రధాని మోడీ.. ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహిస్తుండటం ఈ ఏడాదిలో ఇది మూడోసారి. గతేడాది కరోనా ఉద్ధృతి సమయంలోనూ పలుమార్లు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని.. ఈ ఏడాది జనవరిలో టీకా పంపిణీ ప్రారంభానికి ముందు కూడా సీఎంలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మార్చి 17న కూడా ముఖ్యమంత్రులతో సమీక్ష నిర్వహించిన మోడీ... వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. మాడు వారాల్లోనే మరోసారి సీఎంలతో చర్చించబోతున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా ఉధృతి దృష్ట్యా గురువారం సమావేశం అత్యంత కీలకంగా మారింది.
కరోనా కోరలు చాస్తుండటంతో దేశం మరోసారి ఆంక్షల వలయంలోకి జారుకుంటోంది. తాజాగా ఆదివారం ఒక్కరోజే లక్షకు పైగా కొత్త కేసులు రావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీంతోరాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అప్రమత్తమవుతున్నాయి. కఠిన ఆంక్షలను అమలు చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. జనం రద్దీ నియంత్రణపై దృష్టిపెట్టాయి. మహారాష్ట్రలో కొవిడ్ ఉగ్రరూపంతో రాత్రిపూట కర్ఫ్యూతో పాటు వీకెండ్ లాక్‌డౌన్ విధించారు. ముంబయిలో లోకల్ రైళ్లు నిలిపివేస్తారేమోనన్న ఆందోళన అక్కడి జనంలో వ్యక్తమవుతోంది. ముంబయి లోకల్ రైళ్లు సర్వీసులు పునరుద్ధరించడం వల్లే కరోనా కేసులు అకస్మాత్తుగా పెరగడానికి కారణమయ్యాయని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.
కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్ ప్రభుత్వం వైద్య సిబ్బందికి సెలవులు రద్దుచేసింది. కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా అక్కడి ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది సెలవులను రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే జారీచేసిన సెలవులను సైతం రద్దు చేసుకోవాలని సూచించింది. బయటి రాష్ట్రాల నుంచి తమ రాష్ట్రానికి వచ్చే వారిపై రాజస్థాన్ ప్రభుత్వం నిబంధనలు విధించింది. 72గంటల వ్యవధిలో చేయించిన ఆర్టీపీసీఆర్ నివేదిక తప్పనిసరి చేసింది. లేకపోతే వారు 14 రోజుల హోం ఐసోలేషన్‌లో ఉండాల్సి వస్తుందని తెలిపింది. హోం ఐసోలేషన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తే మాత్రం సంస్థాగత క్వారంటైన్‌కు తరలిస్తామని స్పష్టంచేసింది.
కరోనా విజృంభణ నేపథ్యంలో యూపీలోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కీలక ఆదేశాలు జారీచేసింది. వివాహాలు, ఇతర శుభకార్యాలకు హాజరయ్యే జనంపై పరిమితి విధించింది. 100 మందికి పాల్గొనరాదని స్పష్టంచేసింది. ఈ మేరకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీచేశారు. అతిథులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించి, భౌతికదూరం పాటించాలని సూచించారు. పంచాయతీ ఎన్నికలు జరగనున్న వేళ అభ్యర్థులు ఐదుగురితో మాత్రమే ప్రచారం నిర్వహించాలని సూచించారు. అందరూ మాస్క్‌లు ధరించాలని సీఎం ఆదేశించారు.