టీ టీడీపీ పీఠం.. రేసులోకి దిగిన మోత్కుపల్లి
posted on Sep 21, 2015 @ 6:13PM
తెలంగాణ టీడీపీ ఆధిపత్యపోరుపై రోజుకో సమస్య తెలత్తుతోంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఈ విషయంలో ఏంచేయాలో తేల్చుకోలేకపోతున్నారు. ఇది ఆయనకు అగ్నిపరీక్షలా తయారైంది. పార్టీ అధికార పగ్గాలు ఎవరిచేతికి ఇవ్వాలా అన్న దానిపై ఇప్పటికే పలు రకాల చర్చలు జరుగుతున్నా వాటివల్ల ఉపయోగం లేకుండా పోతుంది. అసలు ఇప్పటివరకూ పార్టీ పరిపాలనా కలాపాలు చూసిన ఎల్. రమణకే చంద్రబాబు మళ్లీ ఆబాధ్యతలు అప్పగించాలని చూశారు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఆ నిర్ణయాన్నివిరమించుకోవాల్సి వచ్చింది. తరువాత టీ టీడీపీలో యాక్టివ్ గా ఉండే రేవంత్ రెడ్డికి అధికార పగ్గాలు ఇవ్వాలని నిర్ణయించుకోవడంతో అసలు చిక్కు వచ్చి పడింది. ఈ విషయంలో పార్టీలో ఉన్న సీనియర్ నేతలు ఏమాత్రం తమ మద్దతు ఇవ్వలేదు. అందునా ఒకే పార్టీలో ఉన్నా కూడా ఎర్రబెల్లికి.. రేవంత్ రెడ్డికి అంతర్గతంగా మాత్రం వారి మధ్య వివాదాలు ఉన్నాయి.. ఈ సంగతి అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు పార్టీ అధ్యక్ష పదవిపై ఇరు నేతల మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని వార్తలు కూడా వచ్చాయి.
ఈనేపథ్యంలో చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేసి అందరి నాయకులను ఏకగ్రీవంగా ఒప్పింటి రేవంత్ రెడ్డిని పార్టీ పగ్గాలు అప్పజెప్పాలనుకున్నారు. కానీ అది కాస్త బెడిసికొట్టింది. అదిగాక ఐవీఆర్ఎస్ పద్దతి ద్వారా కార్యకర్తల నుండి సేకరించిన అభిప్రాయాల గురించి తెలిపారు. అయితే కేవలం 200 మంది నుండే అభిప్రాయాన్ని సేకరించడంతో తెలంగాణలో 2 లక్షల మంది క్రియాశీల సభ్యులున్నారని.. కేవలం 200 మంది అభిప్రాయాలనే ఎలా సేకరిస్తారని అభ్యంతరం వ్యక్త పరిచారు. దీంతో సమస్య కాస్త ఇంకా జఠిలమైంది.
అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డి.. ఎర్రబెల్లి రేసులో ఉండగా ఇద్దరిలో ఎవరికి పార్టీ పగ్గాలు ఇవ్వాలో తెలియక చస్తుంటే ఇప్పుడు మోత్కుపల్లి రూపంలో చంద్రబాబుకు మరో సమస్య వచ్చిపడింది. ఇప్పుడు ఈ రేసులో నేను కూడా ఉన్నాను అంటూ ముందుకొచ్చారు మోత్కుపల్లి. దళితకార్డును ముందుపెట్టి పార్టీ పగ్గాలు చేపట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో ఇప్పుడు టీ టీడీపీలో వేడి వాతావరణం నెలకొంది. రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి తోనే సమస్య వచ్చిపడితే ఇప్పుడు మోత్కపల్లి కూడా యాడ్ అయ్యాడు. ఒకవేళ రేవంత్ రెడ్డికే అధ్యక్ష పదవి కట్టబెడదామా అనుకుంటే పార్టీలో నేతలు వేరే పార్టీలోకి వెళ్లేందుకు కూడా వెనుకాడేట్లు కనిపించడంలేదు ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే. మరి చంద్రబాబు ఈసమస్య ఎలా పరిష్కరిస్తారో.. పార్టీ పగ్గాలు ఎవరి చేతిలో పెడతారో చూడాలి.