రేవంత్‌రెడ్డికి స్వీట్ వార్నింగ్? షర్మిలకు ఆ రెడ్డి సపోర్టా?
posted on Jul 8, 2021 @ 11:58AM
రేవంత్‌రెడ్డి. ఇదిప్పుడు పేరు కాదు ఓ పవర్. ఓ సునామీ. ఓ డైనమైట్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడాయన ఓ ప్రభంజనం. లీడర్ స్టేజ్ ఎప్పుడో దాటిపోయారు.. రేవంత్‌రెడ్డి సూపర్ లీడర్ ఇప్పుడు. కాంగ్రెస్‌లో తిరుగులేదు. కేడర్‌లో బెదురులేదు. భయమంతా ప్రగతిభవన్‌కే. షాక్ అంతా మరో ప్రతిపక్షానికే. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చిచ్చర పిడుగులా రెచ్చిపోతుండటంతో.. తెలంగాణ పాలిటిక్స్ కీలక టర్న్ తీసుకుంటున్నాయి.
కాంగ్రెస్‌లో కేడర్ అంతా ఎప్పుడూ రేవంత్ వైపే. సీనియర్లే ఇగోకు పోయినా.. ఇప్పుడు దాదాపు అంతా దారికొచ్చారు. ఒక్కరు మినహా. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. పవర్ కంటే పేరే ఎక్కువ అంటారు. బావిలో కప్పలా నల్గొండకే పరిమితమైన నాయకుడంటారు. అయినా.. కాంగ్రెస్‌లో అందరికంటే తానే గొప్పోడినని.. తన తర్వాతే ఎవరైనా అని.. తనకే పీసీసీ చీఫ్ దక్కాలని.. ఢిల్లీలో మకాం వేసి చివరిదాకా తెగ ట్రై చేశారు. అధిష్టానం కుదరదు పొమ్మనటంతో.. ఫ్లైట్ దిగగానే రేవంత్‌పై నోరు పారేసుకున్నారు. తెల్లారేసరికల్లా హైకమాండ్ నుంచి షంటింగ్ పడటంతో.. సారీ.. తప్పంది.. అన్నట్టు లేఖ రిలీజ్ చేశారు.
అక్కడితో ఆయనలో అసంతృప్తి పోలేదు. కొత్త పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని కలిసేందుకు ఆయనకు అస్సలు మనసొప్పలేదు. సీనియర్లంతా రేవంత్‌ను కలిసినా.. ఒక్క కోమటిరెడ్డి మాత్రమే చెట్టెక్కి కూర్చున్నాడు. ఇప్పుడిక కిరికిరి పెట్టేందుకు ట్రై చేస్తున్నారని అంటున్నారు. తాజాగా, ఆయన చేసిన ఓ స్టేట్‌మెంట్ కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన మర్నాడే.. ఇలా పుల్లలు పెట్టే పనులేందంటూ పార్టీ వర్గాలు ఫైర్ అవుతున్నాయి. ఇంతకీ కోమటిరెడ్డి ఏమన్నాడంటే...
తెలంగాణలో పురుడుపోసుకుంటున్న.. వైఎస్ షర్మిల పార్టీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అటుగా వెళ్తున్న కోమటిరెడ్డి.. పార్టీ సభ జరిగే జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ దగ్గర ఆగి మరీ వైఎస్సార్ అభిమానులతో ముచ్చట పెట్టారు. పార్టీ ఆవిర్భావ వేడుకకు రావాలని తనకు ఆహ్వానం వచ్చిందన్నారు. వైఎస్సార్ గొప్ప నేత అని.. వైఎస్ జయంతి సందర్భంగా భువనగిరిలో ఆయనకు నివాళులు అర్పించేందుకు వెళ్తున్నట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
పైపైన చూస్తే ఈ న్యూస్ మామూలుగానే అనిపించినా.. ఇందులో రేవంత్‌కు ముందస్తు వార్నింగ్ దాగుందంటున్నారు. కోమటిరెడ్డి వైఎస్సార్‌కు హార్డ్‌కోర్ అభిమాని. అందులో నో డౌట్. ఇప్పుడు వైఎస్సార్ కూతురే కొత్త పార్టీ పెడుతుంటే ఆల్ ది బెస్ట్ చెప్పకుండా ఎలా ఉంటారు? అనే ప్రశ్న రావొచ్చు. అయితే, షర్మిల పార్టీ మెయిన్ టార్గెట్.. షర్మిల పార్టీ మెయిన్ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుందంటే.. నిస్సందేహంగా రేవంత్‌రెడ్డికే మైనస్. మొదటి నుంచీ అవే విశ్లేషణలు వస్తున్నాయి. కేసీఆర్‌ను తిడుతూ.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును.. రెడ్ల ఓట్లను.. వైఎస్సార్ అభిమానుల ఓట్లను.. మైనార్టీ ఓట్లను.. తనవైపు తిప్పుకునేందుకే.. కొందరి డైరెక్షన్‌లో షర్మిల పార్టీ పెడుతున్నారని టాక్. ఈ లెక్కన ఆమె వైపు అట్రాక్ట్ అయ్యే ఓటర్లంతా రేవంత్‌రెడ్డి ఓటు బ్యాంకే. ఎన్నికల బరిలో షర్మిలకు పడే ప్రతీ ఓటూ రేవంత్‌రెడ్డికి పడాల్సిన ఓటే. అంటే.. షర్మిలతో డ్యామేజ్ జరిగేది కాంగ్రెస్ పార్టీకే కదా? హస్తం పార్టీకి తేడా కొడితే.. ఆ నష్టం రేవంత్‌రెడ్డికే కదా? మరి, అలాంటప్పుడు షర్మిల పార్టీకి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎలా ఆల్ ది బెస్ట్ చెబుతారు? రేవంత్‌రెడ్డిని ఇబ్బందుల పాలు చేసేందుకేగా? అంటున్నారు.
ఇక, ఎంతకాదన్నా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మామూలు లీడర్ మాత్రం కాదు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆయన విశేష ప్రభావం చూపగలరు. ఆ జిల్లాల్లోని అన్ని వర్గాలు కోమటిరెడ్డి ఫాలోయర్స్‌గానే ఉన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి కోమటిరెడ్డి సపోర్ట్ అవసరమే. తనకు పీసీసీ చీఫ్ రాలేదనే అక్కస్సుతో కోమటిరెడ్డి ప్రస్తుతానికి రేవంత్‌తో టచ్ మీ నాట్ అన్నట్టు ఉంటున్నారని చెబుతున్నారు. కావాలనే వైఎస్సార్ పేరును, షర్మిలను హైలైట్ చేస్తున్నారని.. తనతో మంచిగా ఉండకపోతే.. ఝలక్ ఇస్తాననేలా స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారని అంటున్నారు. అయితే, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిఖార్సైన కాంగ్రెస్ వాది. అందులో ఎవరికీ సందేహం అవసరం లేదు. తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి దూకేందుకు తహతహలాడుతున్నా.. తమ్ముడు పోతేపోనీ.. తాను మాత్రం ఎప్పటికీ కాంగ్రెస్‌వాదినేనంటూ.. కమిట్‌మెంట్‌తో ఉన్నారు కోమటిరెడ్డి. అలకలు, లుకలుకలు కాంగ్రెస్‌లో కామనేనని.. ముందుముందు అంతా సర్దుకుంటుందని.. రేవంత్‌రెడ్డి ముందు ఇలాంటి పప్పులేవీ ఉడకవని అంటున్నారు. షర్మిలకు కోమటిరెడ్డి ఆల్ ది బెస్ట్ చెప్పడాన్ని.. వెన్నుపోటులా చూడలేమని.. జస్ట్ రేవంత్‌రెడ్డికి స్వీట్ వార్నింగ్ అనుకోవాలని విశ్లేషిస్తున్నారు.