Read more!

ఉత్తర ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన ఖాయమా?

 

 

 

ఉత్తర ప్రదేశ్‌లో ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితులను చూస్తుంటే ఈ రాష్ట్రం రాష్ట్రపతి పాలన వైపు వెళ్తోందా అనే సందేహాలు అందరిలోనూ వస్తున్నాయి. ఈమధ్య కాలంలో ఉత్తర ప్రదేశ్‌లో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించింది. మహిళల మీద అత్యాచారాలు, హత్యలు మామూలైపోయాయి. అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అత్యాచారాలను ఆపకపోగా ఈ అంశం మీద కడుపు మండే కామెంట్లు చేస్తోంది. అత్యాచారాల పరిస్థితి ఇలా వుంటే, ఉత్తర ప్రదేశ్ అంతటా పెరిగిపోయిన దొంగతనాలు, అల్లర్లు అసలు యు.పి.లో ప్రభుత్వం అనేది వుందా అనే సందేహాన్ని కలిగిస్తున్నాయి. ఇలా పరిస్థితులన్నీ చేయి దాటిపోతూ వుండటంతో యుపిలో రాష్ట్రపతి పాలన ఖాయమన్న అభిప్రాయానికి అందరూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో యు.పి.ఎ. ప్రభుత్వ హయాంలో నియమితులైన గవర్నర్లు రాజీనామాలు చేస్తే మంచిదన్న అనధికార ఆదేశాలు అందడంతో చాలామంది గవర్నర్లు రాజీనామాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. అందరికంటే ముందుగా ఉత్తర ప్రదేశ్ గవర్నర్ రాజీనామా చేయడం త్వరలో ఉత్తర ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించబోతున్నారనేదానికి సంకేతమా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కొత్త గవర్నర్ వచ్చిన తర్వాత యుపిలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి సిఫారసు చేసే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.