పోలవరం ముంపుపై తక్షణం సర్వే.. ఏపీకి కేంద్ర జల సంఘం ఆదేశం
posted on Apr 4, 2023 @ 11:20AM
పోలవరం ప్రాజెక్టు ముంపుపై తక్షణమే సర్వే చేపట్టాలని కేంద్ర జల సంఘం ఏపీ సర్కార్ ను ఆదేశించింది. ఎలాంటి కాలయాపన చేయకుండా నిర్ణీత కాలవ్యవధిలోగా ఈ సర్వేను పూర్తిచేయాలంటూ ఢిల్లీలో సోమవారం (ఏప్రిల్ 3) జరిగిన సమావేశంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు కేంద్ర జలసంఘం అల్టిమేటం జారీ చేసింది.పోలవరం ప్రాజెక్టు ఎత్తు, తద్వారా తలెత్తే ముంపు సమస్య సహా అనేక ఇతర సాంకేతికాంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ప్రాజెక్టుతో సంబంధం ఉన్న అన్ని రాష్ట్రాలతో చర్చలు జరిపి ఏకాభిప్రాయం సాధించాలంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ ఆదేశాల మేరకు ఇందులో కేంద్ర జల సంఘం ఏపీ, తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో రెండు సమావేశాలు నిర్వహించింది.
కాగా గత కొంత కాలంగా పోలవరం ముంపు సర్వేను వేగరమే చేపట్టాలని తెలంగాణ సర్కార్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పోలవరం ముంపుతో పాటు అనేక సాంకేతిక అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ తెలంగాణ, ఏపీ, ఒడిషా, చత్తీష్‌గఢ్ రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అన్ని రాష్ట్రాలతో ఏకాభిప్రాయం సాధించాలని అత్యున్నత న్యాయ స్థానం సూచించడంతో సీడబ్యూసీ రెండు సార్లు అన్ని రాష్ట్రాలతో సమావేశం అయ్యింది.
రెండు సమావేశాల్లో కూడా పోలవరం ముంపుపై జాయింట్ సర్వేకు తెలంగాణ పట్టుబట్టింది. తాజాగా మూడో సారి కేంద్ర జల సంఘం చైర్మన్ కుష్విందర్ వోరా అధ్యక్షతన సోమవారం (ఏప్రిల్ 3) జరగిన సమావేశంలో ఇందులో ప్రాజెక్టు ముంపు సమస్యలు, ఇతర సాంకేతిక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పోలవరం ముంపు సర్వే నిర్వహణను ఏపీ ప్రభుత్వం తాత్సరం చేస్తుండటాన్ని తెలంగాణ తప్పుపట్టింది. గతంలోనే సీడబ్ల్యూసీ ఆదేశాలు జారీ చేసినా ఏపీ సర్వే ప్రారంభించకపోవడాన్ని ఎత్తి చూపింది.