కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ

 

ఢిల్లీలో  సీఎం చంద్రబాబు  పర్యటన కొనసాగుతుంది.  కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతరామన్‌తో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. పూర్వోదయం ద్వారా ఏపీని గ్రోత్ ఇంజన్‌గా మర్చేందుకు, రాయలసీమను హర్టీకల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కేంద్రమంత్రిని చంద్రబాబు కోరారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రానున్న మూడేళ్లలో రూ.41 వేల కోట్ల ఆర్థిక సహాయం అవసరమని, దీని కోసం వచ్చే బడ్జెట్‌లో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని చంద్రబాబు కోరారు. 

అలాగే కరవు పీడిత ప్రాంతాలైన రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు గోదావరి వరద జలాలను తరలించే పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు ఆర్థిక చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. సాస్కీ పథకం కింద పెండింగ్‌లో ఉన్న యూనిటీ మాల్, గండికోట పర్యాటక ప్రాజెక్టులతో పాటు, కొత్త మౌలిక సదుపాయాల కల్పన కోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.10,054 కోట్లు మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించారు. 

కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలరవాణా మంత్రి సర్బానంద సోనోవాల్‌తో రా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. దుగరాజపట్నం షిప్‌బిల్డింగ్ క్లస్టర్, ఫిషింగ్ హార్బర్లకు కేంద్ర సాయంపై చర్చించారు. దేశంలో నౌకాశ్రయాలు, నౌకా నిర్మాణ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలకు కృతజ్ఞతలు తెలిపారు. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుదల కోసం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టామని, ఫేజ్–1లో చేపట్టిన నాలుగు ఫిషింగ్ హార్బర్లకు అదనపు నిధులు కేటాయించాలని కోరారు. ప్రకాశం జిల్లా ఓడరేవు ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సాగరమాల పథకం కింద రూ.150 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు
 

ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం- 15 మంది దుర్మరణం

ఇక్కడా అక్కడా అన్న తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రమాదాలు బెంబేలెత్తిస్తు న్నాయి.  రోడ్డు, రైలు విమాన అన్న తేడా లేకుండా ఈ ప్రమాదాలు పెద్ద సంఖ్యలో ప్రయాణీకుల ఉసురు తీస్తున్నాయి. సాంకేతిక సమస్య, మానవ తప్పిదం కారణమేమైతేనేం ప్రయాణం అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఇండోనేసియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృత్యువాత పడ్డారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతోంది.  ఇండోనేషియాలోని సెంట్రల్ జావా ప్రాంతంలో ని సెమరాంగ్ నగరం  టోల్ గేట్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఘోర ప్రమాదానికి గురైంది.  సోమవారం (డిసెంబర్ 22) తెల్లవారుజామున  ఈ ప్రమాదం జరిగింది. బస్సు అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది.    క్రాప్యాక్ టోల్ ఎగ్జిట్ కూడలి వద్దకు రాగానే బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి డివైడర్‌ని బలంగా ఢీకొని పల్టీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు బస్సు అద్దాలు పగిలి, డోర్లు మూసుకుపోయాయి. దీంతో బస్సులోకి వెళ్లి క్షతగాత్రులను బయటకు తీసుకురావడం సమస్యగా మారింది. స్థానికుల సహకారంలో ఎలాగో బస్సు డోర్లను తెరిచి లోపలకు వెళ్లిన పోలీసులు ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో పలువురి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

అండర్ -19 ఆసియా కప్ ఫైనల్.. పాక్ చేతిలో భారత్ చిత్తు

అండర్ 19 ఆసియాకప్ టోర్నీలో ఓటమి అనేదే లేకుండా ఫైనల్ కు చేరిన టీమ్ ఇండియా జట్టు ఫైనల్ లో చతికిల పడింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఘోర ఓటమిని మూటగట్టుకుంది.  ఆదివారం (డిసెంబర్ 22)  ఏకపక్షంగా జరిగిన అండర్ -19 ఆసియా కప్ ఫైనల్ లో భారత జట్టు ఏకంగా 191 పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్థి, దాయాది జట్టు అయిన పాకిస్థాన్ చేతిలో  ఓడిపోయింది.   అండర్‌-19 ఆసియా కప్‌ టైటిల్‌ ఫైట్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన  పాకిస్థాన్ నిర్ణీత  50 ఓవర్లలో 8 వికెట్ల నష్టపోయి   347 పరుగుల భారీ స్కోరు చేసింది. పాకిస్థాన్ ఓపెనర్‌ సమీర్‌ మిన్హాస్‌  113 బంతుల్లో 172 పరుగులు చేశాడు.  అలాగే పాక్ బ్యాటర్ అహ్మద్‌ హుస్సేన్‌  56  పరుగులు సాధించాడు. భారత బౌలర్లలో  దీపేష్‌ దేవేంద్రన్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. హనిల్‌, ఖిలన్‌ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.  భారీ చేదన కోసం బ్యాటింక్ చేపట్టిన భారత్ 26. 2 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని చవి చూసింది.  భారత బ్యాటర్లలో 36 పరుగులు చేసిన దీపేష్ టాప్ స్కోరర్.  కెప్టెన్‌ ఆయుష్‌ మాత్రే (2), వైభవ్‌ సూర్యవంశీ (26) ఇలా మిగిలిన బ్యాటర్లంతా విఫలమయ్యారు.   పాక్‌ పేసర్ల షార్ట్‌ పిచ్‌ బంతులకు  భారత యువ బ్యాటర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది.  పాకిస్థాన్ బౌలర్లలో అలీ రెజా నాలుగు వికెట్ల సాధించి రాణంచాడు.  సుభాన్‌, ఎహ్‌సాన్‌, సయ్యమ్‌ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. పాక్‌ ఆటగాళ్లతో  నో హ్యాండ్‌ షేక్‌  విధానాన్ని ఈ మ్యాచ్ లో కూడా ఇండియన్ క్రికెటర్లు పాటించారు.   కాగా ఈ మ్యాచ్ లో పాక్ బౌలర్ అలీ రెజా అద్భుతంగా బౌలింగ్ చేసి రాణించినప్పటికీ, అతడి ప్రవర్తన మాత్రం అతిగా ఉంది. ధాటిగా ఆడే క్రమంలో ఔటై పెవిలియన్ కు వెడుతున్న వైభవ్ సూర్యవంశీని రెచ్చగొట్టేలా అలి రోజా సంబరాలు చేసుకున్నాడు. ఈ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ కూడా తన నోటికి పని చెప్పాడు. అలాగే అంతకు ముందు  భారత జట్టు కెప్టెన్  ఆయుష్‌ అవునప్పుడు కూడా  అలీ రెజా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించాడు. దీంతో డగౌట్‌కు వెళ్తున్న ఆయుష్‌ ఆగ్రహంతో వెనక్కి వచ్చి నోటికి పని చెప్పాడు.  ఆసియా క్రికెట్‌ మండలి  ఏసీసీ  చీఫ్‌, పాకిస్థాన్‌ మంత్రి అయిన మొహిసిన్‌ నఖ్వీ విజేతలకు పతకాలు, ట్రోఫీ ప్రదానం చేశారు. అయితే, భారత్‌కు చెందిన ప్రతినిధులు ఎవరూ ఈ కార్యక్రమంలో కనిపించలేదు. రన్నరప్‌ చెక్‌ను అఫ్ఘానిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు చైర్మన్‌ మిర్వాసి అష్రఫ్‌ చేతుల మీదుగా భారత కెప్టెన్‌ ఆయుష్‌ అందుకొన్నాడు. కాగా, పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో.. నఖ్వీ నుంచి భారత సీనియర్‌ జట్టు ఆసియా కప్‌ను అందుకొనేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే.

ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల భారీ ఆయుధ డంప్.. గుర్తించి ధ్వంసం చేసిన భద్రతా దళాలు

ఛత్తీస్‌గఢ్ ని మావోయిస్టుల భారీ ఆయుధ డంప్ ను పోలీసులు ధ్వంసం చేశారు. రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావం అధికంగా ఉన్న సుక్మా జిల్లాలో వారికి చెందిన భారీ ఆయుధాల కర్మాగారాన్ని గుర్తించిన పోలీసులు, భద్రతా బలగాలు దానికి ధ్వంసం చేశారు. సుక్మీ జిల్లా మీనా గట్టా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు రహస్యంగా నిర్వహిస్తున్న అక్రమ ఆయుధ తయారీ కేంద్రాన్ని గురించి అందిన సమాచారం మేరకు సీఆర్పీఎఫ్, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్ లో ఈ ఆయుధ డంప్ బయటపడింది. ఈ ఆయుధ డంప్ ను మావోయిస్టులు భద్రత దళాలపై దాడికి ఉపయోగిస్తారని భద్రతా దళాలు తెలిపాయి. ఈ డంప్ ధ్వంసంతో మావోయిస్టు కార్యకలాపాలకు భారీ ఆటంకం తప్పదని తెలిపారు.   ఈ ఆయుధ డంప్ లో  ఆయుధాల తయారీ సామగ్రి, సింగిల్ షాట్ రైఫిల్స్, డిటోనేటర్లు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి.  భద్రతా దళా లను లక్ష్యంగా చేసుకుని ఐఈడీలు, బాంబులు తయారు చేసేందుకు అవసరమైన మందుగుండు సామాగ్రిని మావోయిస్టులు అక్కడ నిల్వ ఉంచారన్నారు. ఆ ప్రాంతంలో ఇంకా నక్సల్స్ దాక్కుని ఉండే అవకాశం ఉందన్న అనుమానంతో ఆ ప్రాంతంలో అడవులను అణువణువూ క్షుణ్ణంగా గాలిస్తున్నట్లు తెలిపిన భద్రతా బలగాలు  నిర్దిష్టగడువులోగా మావోయిస్టు రహిత దేశంగా భారత్ ఉండాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. 

బాహుబలి రాకెట్ ప్రయోగం సక్సెస్ కావాలి.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ  ఇస్రో మరో చారిత్రక ప్రయోగానికి రెడీ అయిపోయింది. ఎల్వీఎం 3 బాహుబలి రాకెట్ ద్వారా బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని ఈ నెల 24 ప్రయోగించనుంది. ఇది  సెల్యులార్ కవరేజ్ లేని ప్రాంతాలకు సేవలు అందించడమే లక్ష్యంగా చేపట్టిన భారీ మిషన్.  4జీ, 5జీ సిగ్నల్‌ను నేరుగా సాధారణ స్మార్ట్‌ఫోన్‌లకు అందించడానికి ఉద్దేశించిన ప్రయోం.  ఈ నెల 24  ఉదయం 8:54 నిమిషాలకు ఎల్వీఎం 3  శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి అంతరిక్షానికి దూసుకెళ్లనుంది. ఎల్వీఎం 3 సిరీస్ లో ఇది తొమ్మిదది. ఈ ఏడాది ఇస్రో  చేపట్టిన అయిదో ప్రయోగం ఇది. అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్ అభివృద్ధి చేసిన బ్లూబర్డ్ బ్లాక్ 2, ఉపగ్రహ టెలికమ్యూనికేషన్స్‌లో ఓ వ్యూహాత్మక ప్రయోగంగా భావిస్తున్నారు.   బ్లూబర్డ్ బ్లాక్ శాటిలైట్ బరువు 6,100 కిలోలు. ఈ బాహుబలి రాకెట్ ఎత్తు 43.5 మీటర్లు. 640 టన్నుల బరువు. ఈ ప్రయోగం విజయవంతమైతే   కమ్యూనికేషన్ల ముఖచిత్రం మారిపోతుందంటున్నారు. ఇలా ఉండగా ఈ  బాహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని కోరుతూ ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్  తిరుమల శ్రీవారి ఆలయంలో బ్లూబర్డ్  2 ఉపగ్రహానికి పూజలు చేశారు. 

జగన్ జన్మదినం సందర్భంగా పశుబలి

అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా వైసీపీయులు చేసేది అరాచకమే అన్నది మరో సారి రుజువైంది.  రప్పా.. రప్పా.. గంగమ్మ జాతర అంటూ రచ్చ చేస్తున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు వైసీపీ అధినేత జగన్ జన్మదినం సందర్భంగానూ హంగామా చేశారు. మూగజీవాలను బలి ఇచ్చి వాటి రక్తంతో జగన్ ఫ్లెక్సీలకు అభిషేకం చేసి తమ అరాచకానికి హద్దులు అంటూ లేవని మరోసారి నిరూపించుకున్నారు.  వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా వైసీపీ కార్యకర్తలు అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లిలో  ఆదివారం (డిసెంబర్ 21) వీరంగం సృష్టించారు. సర్పంచ్‌ ఆదినారాయణరెడ్డి  ఆధ్వర్యంలో  ఐదు గొర్రెలను  నరికి, వాటి రక్తంతో జగన్‌ ఫ్లెక్సీకి అభిషేకం చేశారు.  మండల కేంద్రమైన విడపనకల్లు లోనూ అదే తంతు కొనసాగింది. అలాగే శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం భానుకోట గ్రామంలో వైసీపీ మద్దతు సర్పంచ్‌ బాలరాజు, నాయకులు కలసి మూగజీవాల తలలు నరికి, ఆ రక్తంతో జగన్‌ ఫ్లెక్సీకి అభిషేకం చేశారు.   మరోవైపు జగన్‌ పుట్టినరోజు సందర్భంగా ప్రకాశం జిల్లా పందువ నాగులారం పంచాయతీ పరిధిలోని గుమ్మలకర్ర జంక్షన్‌లో వైసీపీ అభిమాని ఒకరు   2029లో రప్పరప్ప.. 88 మ్యాజిక్‌ ఫిగర్‌ దాటినప్పటి నుంచి గంగమ్మ జాతరే అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. గుమ్మలకర్ర గ్రామానికి చెందిన మన్నెపల్లి దినేష్‌ ఈ వివాదాస్పద ఫ్లెక్సీని ఏర్పాటు చేశారంటూ తెలుగుదేశం  శ్రేణులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ ఫ్లెక్సీని తొలగించి దినేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

కూలిపోతున్న మస్క్ ఉపగ్రహం

ఎలాన్ మస్క్ కు చెందిన  స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్ ఉపగ్రహం కక్ష్య నుంచి అదుపుతప్పి భూమి వైపు దూసుకొస్తోంది. సాంకేతిక లోపం  కారణంగా ఇది భూమి వాతావరణంలోకి ప్రవేశించి కూలిపోతుందని స్పెస్ ఎక్స్ ధృవీకరించింది. అయితే ఈ శాటిలైట్ భూమిపై కూలి పోవడం వల్ల స్పేస్ ఎక్స్ కు కానీ, భూమికి కానీ ఎటువంటి ప్రమాదం, ముప్పు వాటిల్లదని క్లారిటీ ఇచ్చింది. టెస్లా అధినేత  ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్‌ ప్రాజెక్టులోని ఉప్రగ్రహాల్లో ఒకటి డిసెంబరు 17న సాంకేతిక లోపం కారణంగా అదుపు తప్పి కూలిపోవడం ప్రారంభించింది. వారం రోజుల్లోగా ఇది భూవాతావరణంలోకి ప్రవేశించి కూలిపోతుంది.  ఈ కూలిపోతున్న  స్టార్ లింక్ శాటిలైట్ శకలాలను వరల్డ్ వ్యూ-3 అనే ఉపగ్రహం 241 కిలోమీటర్ల దూరం నుంచి ఫొటోలు తీసింది. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

రోహిత్, కోహ్లీ సరసన స్మృతి మంధాన

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన టి20లలో నాలుగు వేల పరుగులు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్ గా చరిత్ర సృష్టించింది. శ్రీలంకతో ఆదివారం (డిసెంబర్ 21) జరిగిన టి20 మ్యాచ్ లో పాతిక పరుగులు చేసిన స్మృతి మంధాన ఈ రికార్డు సృష్టించింది. మొత్తంగా టి20 ఫార్మట్ లో నాలుగువేల పరుగుల క్లబ్ లో చేరిన రెండో మహిళా క్రికెటర్ గా నిలిచింది.  న్యూజిలాండ్ ప్లేయ‌ర్ సుజీ బేట్స్ 4,716 ప‌రుగుల‌తో తొలి స్థానంలో ఉంది.   స్మృతి మంధానా  154 మ్యాచుల్లో 4007 ర‌న్స్ చేసింది. ఇందులో ఒక సెంచ‌రీతో పాటు 31 అర్ధ సెంచ‌రీలు ఉన్నాయి.  మొత్తం మీద టీ20 క్రికెట్‌లో పురుషులు, మహిళలను పరిగణనలోనికి తీసుకుంటే ఇంత వరకూ స్మృతి మంధానాతో కలిసి  ఐదుగురు మాత్రమే ఈ ఫార్మట్లో నాలుగువేల పరుగుల మైలు రాయిని దాటారు. ఇండియా నుంచి అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు మాత్రమే ఈ ఘనత సాధించారు. ఇప్పుడు వారి సరసన స్మృతి మంధానా చేరింది.  ఈ ముగ్గురూ కాకుండా బేట్స్, పాకిస్థాన్‌కు చెందిన బాబర్ ఆజం మాత్రమే ఈ ఫార్మట్ లో నాలుగువేలు అంతకు మించి పరుగులు చేశారు. ఇలా ఉండగా ఈ జాబితాలో అందరి కంటే పిన్న వియస్కురాలు స్మృతి మంధానా మాత్రమే కావడం గమనార్హం.  

గిల్‌ను తప్పిస్తున్నట్లు ముందే చెప్పారా?

  టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించి భారత జట్టును శనివారం ప్రకటించారు. ఇందులో స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కలేదు. ప్రస్తుత టీమిండియా టెస్ట్, వన్డే ఫార్మాట్‌ల కెప్టెన్, టీ20 వైస్ కెప్టెన్.. గిల్‌ను స్టాండ్ బైగా కూడా సెలక్టర్లు ఎంపిక చేయకపోవడం క్రికెట్ పండితులు కూడా ఊహించలేదు. గిల్ కూడా న్యూజిలాండ్ సిరీస్, ప్రపంచ కప్‌లో ఆడేందకు సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్న వేళ బీసీసీఐ ఈ నిర్ణయాన్ని వెల్లడించింది.  అయితే తనపై వేటు పడుతుందని గిల్‌కు ముందే తెలుసు అన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కుడి పాదానికి గాయం అవ్వడంతో సౌతాఫ్రికాతో జరిగిన చివరి రెండు టీ20లకు గిల్ జట్టులో లేడు. శనివారం అహ్మదాబాద్‌ను వీడి చండీగఢ్‌కు బయల్దేరిన సమయంలో సెలక్షన్ కమిటీ భేటీ జరిగింది. జట్టును ప్రకటించడానికి కొద్దిసేపటికి ముందే బీసీసీఐ నుంచి గిల్‌కి ఫోన్ వచ్చింది. తనను జట్టులోంచి తప్పించిన విషయాన్ని చెప్పారు.  ఈ విషయాన్ని క్రిక్ బజ్ తన కథనంలో పేర్కొంది. అయితే గిల్‌కు ఎవరు ఈ విషయం గురించి చెప్పారనే అంశం మాత్రం బయటకు రాలేదు. గిల్‌ తొలుత గాయంతోనే దక్షిణాఫ్రికాతో టీ20 ఆడేందుకు సిద్ధపడ్డాడు. కానీ మైదానంలోకి దిగితే అది మరింత తీవ్రమై కీలక టోర్నమెంట్లకు దూరం కావాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరించడంతో వెనక్కి తగ్గాడు. ఆ తర్వాతే బీసీసీఐ కూడా అతడికి గాయమైన విషయాన్ని ధ్రువీకరించింది. లఖ్‌నవూలో డిసెంబర్‌ 16న నెట్‌ప్రాక్టీస్‌ సమయంలో గిల్ గాయపడ్డాడు. దీంతో జట్టులో ఆడేందుకు సంజుకు అవకాశం లభించింది.  

సర్పంచ్ తండ్రి కోసం కొడుకు బిక్షాటన

  తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు, వారి కుటుంబాల్లో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో తమ తండ్రి గెలిస్తే భిక్షాటన చేస్తానని 'బిచ్చగాడు సినిమా తరహాలో ప్రతిన బూనాడో కుమారుడు.  రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో ఎం.రామకృష్ణయ్య అనే వ్యక్తి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాడు.  ఇదే ఎన్నికల్లో ఆయన పెద్ద కుమారుడు కూడా బరిలో దిగాడు. ఈ నేపథ్యంలో ఆయన చిన్న కుమారుడు భాస్కర్.. తండ్రి గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాడు. ఈ ఎన్నికల్లో తన తండ్రి గెలిస్తే.. భిక్షాటన చేస్తానని మొక్కుకున్నాడు. అనుకున్నట్టుగానే.. తన తండ్రి సర్పంచ్ అయ్యారు. మొక్కుబడి చెల్లించడంలో భాగంగా భాస్కర్ ఇంటింటికీ తిరిగి భిక్షాటన చేసి.. కర్ణాటక రాష్ట్రంలోని గానుగాపూర్ దత్త క్షేత్రానికి వెళ్లాడు. ఈ ఘటనపై జే.లింగాపూర్ గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తండ్రిపై గల కుమారుడికి ఉన్న అంకితభావాన్ని కొనియాడుతూ అభినందనలు తెలిపారు.