కేటీఆర్ ఆశలపై నీళ్లు.. పట్టాభిషేకం ఇప్పట్లో లేనట్లే!!
posted on Aug 25, 2020 @ 1:43PM
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా వున్న కల్వకుంట్ల తారక రామారావు(కేటిఆర్) పట్టాభిషేకం ఇప్పట్లో లేనట్లే నని స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఇక నుంచి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్నారని, దాంతో తన కుమారుడు, ప్రస్తుతం తన మంత్రివర్గంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న కేటీఆర్ ను ముఖ్యమంత్రి సీట్ లో కూర్చోబెట్టి తాను ఢిల్లీ కి మకాం మారుస్తారని ఎప్పటినుంచో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
దీనికి ఊతమిస్తున్నట్లు, కొద్దిరోజులక్రితం, అంటే ఆగష్టు 12 వ తారీఖున, కేటీఆర్, ముఖ్యమంత్రి అధికార నివాసమైన ప్రగతి భవన్ లో దాదాపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించినంత పనిచేసారు. దీనికి మంత్రులందరూ, అధికారులు, వివిధ శాఖలకు చెందిన శాఖాధిపతులు హాజరుకావడం జరిగింది. ఇది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనమే సృష్టించిందని చెప్పవచ్చు.
వివిధ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ ని నేరుగా ప్రశ్నించారు. కుమారుడు కేటీఆర్ మంత్రివర్గ సమావేశాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని వివిధ పార్టీల నాయకులు ప్రశ్నించారు. దీనికి అటు ముఖ్యమంత్రి నుండి కానీ, ఇటు కేటీఆర్ నుండి కానీ, కనీసం అధికార పార్టీ నేతలెవ్వరూ కూడా స్పందించలేదు సరికదా కనీసం కేటీఆర్ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయడంపై ఎలాంటి స్పస్టతనుకూడా ఇవ్వలేదు.
దీనికి తోడు కొంతమంది అధికార పార్టీ ఎమ్యెల్యేలు కేటీఆర్ ను ముఖ్యమంత్రి గా చూడాలని కోరుకుంటున్నట్లు బహిరంగంగానే వెల్లడించారు. దీంతో అందరూ ఇక కేటిఆరే తప్పక ముఖ్యమంత్రి కాబోతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో ప్రారంభమైంది. దీనికి తగ్గట్లు, కేసీఆర్ అతి త్వరలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారని, అయన ఢిల్లీ కి మకాం మార్చి వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రులతో, కొందరు పార్టీల నాయకులతో చర్చలు జరుపుతారనే ప్రచారానికి తెర లేపుతూ కొన్ని ప్రసార మాద్యమాల్లో వార్తలు కూడా రావడం కూడా జరిగింది.
అయితే, దీనిపై ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా నివేదికలు తెప్పించిగుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతానికి దీనికి ఫుల్ స్టాప్ పెట్టినట్లేనని తెలుస్తోంది. దీనికి కారణం, కేంద్రంలో అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీ ఇదే అవకాశంగా తీసుకొని, పార్టీని తెలంగాణాలో బలం పెంచుకోవడానికి ప్రయత్నించే అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఒకసారి కేటీఆర్ ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడితే, తమకు ఈ విషయాన్నీ ప్రజల్లోకి తీసుకు వెళ్లడం సులభమవుతుందని బీజెపీ నమ్ముతున్నదని ఇంటలిజెన్స్ వర్గాలు నివేశికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
దీంతో కేసీఆర్ ప్రస్తుతానికి ఈ విషయంపై వెనక్కు తగ్గినట్లేనని, ప్రస్తుతానికి కేటీఆర్ ఆశలపై కేసీఆర్ నీళ్లుచల్లారని తెలుస్తోంది.