హాల్ టికెట్ పై సన్నీలియోన్ ఫోటో.. విచారణకు కర్నాటక విద్యాశాఖ ఆదేశం
posted on Nov 9, 2022 @ 1:44PM
హాల్ టికెట్ పై అభ్యర్థి పేరుకు బదులుగా శృంగార తార సన్నీలియోన్ ఫొటో ఉండటం తీవ్ర వివాదాస్పదమైంది. దీంతో కర్నాటక విద్యాశాఖపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఉదంతంపై రాజకీయ విమర్శలు సైతం జోరందుకున్నాయి.
కర్నాటకలో అధికార బీజేపీ సర్కార్ పై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. కర్నాటక టీచర్స్ రిక్రూట్ మెంట్ పరీక్షకు హాజరౌతున్న అభ్యర్థి హాల్ టికెట్ పై అభ్యర్థి ఫొటో బదులుగా శృంగార తార ఫొటో ఉండటంపై కర్నాటక కాంగ్రెస్ సామాజిక మాధ్యమ చైర్ పర్సన్ బీఆర్ నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీలో బ్లూఫిల్మ్స్ చూసే పార్టీ నుంచి ఇటువంటి చర్యలు తప్ప మరే ఆశించగలమని దుయ్యబట్టారు.
అయితే కాంగ్రెస్ విమర్శలపై విద్యాశాఖ స్పందించింది. అప్లికేషన్ సందర్భంలో అభ్యర్థి ఏ ఫొటోను అప్ లోడ్ చేస్తే సిస్టం ఆ ఫొటోనే తీసుకుంటుందని పేర్కొంది. అసలు హాల్ టికెట్ పై అభ్యర్థి ఫొటోకు బదులుగా సన్నీలియోన్ ఫొటో ఎలా వచ్చిందన్న దానిపై విచారణకు ఆదేశించినట్లు పేర్కొంది. అభ్యర్థిని విచారించగా తన వివరాలన్నీ తన భర్త స్నేహితుడు అప్ లోడ్ చేశాడని చెప్పిందనీ, విచారణలో అసలు విషయం తేలుతుందని విద్యాశాఖ పేర్కొంది.
ఇలా ఉండగా హాల్ టికెట్ లో అభ్యర్థి ఫొటో బదులుగా శృంగార తార సన్నీలియోన్ ఫోటో అంశం సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యింది. కాగా ఇందుకు నైతిక బాధ్యత వహించి కర్నాటక విద్యాశాఖ మంత్రి నగేష్ రాజీనామా చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇలా ఉండగా ఫొటో మారిపోవడంపై సమగ్ర విచారణకు ఆదేశించామనీ, త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేస్తామని విద్యాశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.