కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఇహనో ఇప్పుడో కాంగ్రెస్ వేటు!
posted on Nov 9, 2022 @ 2:19PM
మునుగోడు ఉప ఎన్నిక పూర్తయ్యింది. ఫలితాలు వచ్చేశాయి. పోటీ ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్యే జరిగిందన్నది తేటతెల్లమైపోయింది. అన్ని పార్టీలూ ఫలితాలపై సమీక్షల్లో మునిగిపోయాయి. ఘోరంగా పరాజయం పాలైన కాంగ్రెస్ కూడా ప్రస్తుతం అదే పనిలో ఉంది. అయితే గెలుపోటములపై సమీక్ష చేయడానికి ఆ పార్టీకి ఏమీ లేదు.
ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నిక పరాజయం వెనుక బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సోదరుడు, కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారని కాంగ్రెస్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసింది. పార్టీ స్టార్ క్యాంపెయినర్ అయి ఉండి కూడా ప్రచారంలో పాల్గొనక పోవడం, రాష్ట్రంలో జరిగిన రాహుల్ గాంధీ జోడో యాత్రకు సైతం డుమ్మా కొట్టడంతో ఆయన తన సోదరుడు, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి విజయం కోసం తెరవెనుక యత్నాలు చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఆరోపించడమేమిటి? బలంగా నమ్ముతోంది కూడా.
పార్టీతో సంబంధం లేకుండా తన సోదరుడినే గెలిపించాలంటూ భాస్కరరెడ్డి ఫోన్ సంభాషణలు లీకై సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. అలాగే ఎన్నికలకు ముందు విదేశీ పర్యటనక వెళ్లిన కోమటిరె్డి వెంకటరెడ్డి అక్కడ తన సన్నిహితులతో కాంగ్రెస్ ఓటమి తధ్యమంటూ చెబుతున్న సంభాషణ వీడియోక్లిప్పింగ్ లు వైరల్ అయిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ లో ఉంటూనే ప్రత్యర్థి గెలుపునకు పరోక్షంగా సహకరించారంటూ వెంకటరె్డికి కాంగ్రెస్ ఇప్పటికే షోకాజ్ నోటీసు జరీ చేసింది. అయితే ఆ షోకాజ్ నోటీసుకు వెంకటరెడ్డి స్పందించలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇక ఆయన పై వేటువేయడమే తరువాయి అని ఆ వర్గాలు చెబుతున్నాయి.అన్నిటికీ మించి తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరుగుతుంటే.. మునుగోడు ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉండి కూడా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులందరూ ఆ యాత్రలో పాల్గొని ఆయనతో అడుగు కలిపారు.
ఒక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం రాహుల్ కాంగ్రెస్ జోడో యాత్ర వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఈ రెండు అంశాలనూ కలిపి చూస్తే సాంకేతికంగా వెంకటరెడ్డి కాంగ్రెస్ లోనే ఉన్నా మానసికంగా పార్టీతో తెగతెంపులు చేసుకున్నారని కాంగ్రెస్ ఒక అభిప్రాయానికి వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే షోకాజ్ నోటీసుకు కనీసం స్పందించను కూడా స్పందించని వెంకటరెడ్డిపై వేటు వేయడమే మేలని విస్తోంది. అలాగే రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కూడా వెంటకరెడ్డిపై చర్యలు తీసుకోవాలని అధిష్ఠానాన్నికోరుతున్నారు.