జగన్ కు, వైసీపీకి ఓటు వేయవద్దు.. డాక్టర్ సునీత
posted on Mar 1, 2024 @ 12:01PM
తన అన్న జగన్ రెడ్డికి, ఆయన పార్టీ వైసీపీకి ఓటు వేయవద్దని వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత అన్నారు. తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో జరుగుతున్న జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన డాక్టర్ సునీత ఈ రోజు హస్తినలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి శిక్ష పడాల్సిందేనన్నారు. వివేకా హత్య కేసులో తీవ్ర జాప్యం వెనుక తన సొదరుడు జగన్ రెడ్డి ఉన్నారని ఆమె ఆరోపించారు.
తన తండ్రి హత్య అనంతరం తాను జగన్ రెడ్డిని కలిశాననీ, అయితే అప్పట్లో ఆయన మోటివ్ పై ఎటువంటి అనుమానం రాలేదన్నారు. సొంత వాళ్లను అంత తేలిగ్గా అనుమానించలేమని సునీత చెప్పారు. అయితే క్రమంగా తనకు విషయాలు బోధపడుతూ, అర్ధమౌతూ వచ్చాయని సునీత వివరించారు. ఈ కేసులో తన తండ్రి గుండెపోటుతో మరణించారని తొలుత మీడియాకు చెప్పిన వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిని సీబీఐ ఇప్పటి వరకూ ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. ఆయనను కూడా విచారించాలని అన్నారు. అంతే కాదు తన తండ్రి హత్య కేసులో జగన్ పాత్రపై కూడా విచారణ జరగాలని సునీత అన్నారు.
ఇంత దారుణంగా తన తండ్రి వివేకాను హత్య చేసిన వారిని వదిలేయడం అంటే ప్రజలలో ఎలాంటి సందేశం పంపుతున్నట్లు అని ప్రశ్నించారు. ఇటువంటి నేరాలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితులకు శిక్ష పడాల్సిందేనని అన్నారు.
తన తండ్రి వివేకా జగన్ కు సొంత చిన్నాన్న అనీ, అలాంటిది సొంత చిన్నాన్న హత్య కేసు విషయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు దారుణమన్నారు. దీనిపై జగన్ ను గట్టిగా నిలదీస్తే.. ఆయన తన మీద ఇప్పటికే 11 కేసులు ఉన్నాయని... ఆ కేసుల మాదిరే ఇది పన్నెండో కేసు అవుతుందనీ అన్నారనీ, వివేకా హత్య కేసు అలా కాకూడదనే న్యాయం కోసం పోరాడుతున్నానని సునీత అన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే... తన తండ్రికి న్యాయం జరగదని సునీత విస్పష్టంగా చెప్పారు. జగన్ మళ్లీ సీఎం అయితే కష్టాలు మరింత ఎక్కువవుతాయన్నారు. వివేకా హత్య కేసులో తనకు న్యాయం జరగాలని అన్నారు. నాన్న హత్యలో అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉందని... అవినాశ్ కు శిక్ష పడాల్సిందేనని చెప్పారు.
ఈ కేసులో జగన్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని అన్నప్పుడు తాను అభ్యంతరం చెప్పానని అన్న సునీత, అప్పుడు జగన్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తుకు వెళ్తే అవినాశ్ బీజేపీలోకి వెళ్తాడనితనతో అన్నారనీ, దీంతో జగన్ తో లాభం లేదన్న నిర్ణయానికి వచ్చి తానే వెళ్లి సీబీఐకి ఫిర్యాదు చేశానని చెప్పారు. సీబీఐని కలిసిన తర్వాత తనకు, తన భర్తకు వేధింపులు ఎక్కువయ్యాయని అన్నారు. అనుమానితులందరినీ సీబీఐ విచారించాల్సిందేనని చెప్పారు. తనను, తన భర్తను కూడా అనుమానితులుగానే సీబీఐ విచారించిందని తెలిపారు. తనను విచారించినట్టే ప్రతి ఒక్కరినీ విచారించాలని అన్నారు. ఏది ఏమైనా తన తండ్రి హత్య కేసులో సూత్రధారులు, పాత్రధారులకు శిక్ష పడే వరకూ, తనకు న్యాయం జరిగే వరకూ విశ్రమించనని స్పష్టం చేశారు. తాను రాజకీయాలలోకి రావడం, ఎన్నికలలో పోటీ చేయడంపై ఇప్పటి వరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సునీత అన్నారు.