బీబీసీ అసలు ఉద్దేశమేంటి?
posted on Dec 17, 2025 @ 1:46PM
బీబీసీ అంటే బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్. ఇది వందల కోట్ల రూపాయల నిధులతో నడిచే ఒకానొక సంస్థ. ఈ సంస్థలో ఎవరైనా జర్నలిస్ట్ కి జాబ్ అంటే అది లైఫ్ టైం సెటిల్మెంట్. ఇక్కడ చేరి రిటైర్ అయిన ఎంప్లాయి కోట్లాది రూపాయలను ఇంటికి తీసుకెళ్తారు. ఐదు రోజులు మాత్రమే పని దినాలు. వీలైనంత ఎక్కువ రిలాక్సేషన్ వంటి ఎన్నో సదుపాయాలను అందిస్తుంది బీబీసీ. ఒక రోజులో ఒక స్టోరీ రాసినా, చేసినా ఆ ఉద్యోగికి మంచి గుర్తింపు వస్తుంది. సదరు ఉద్యోగిని నెత్తిన పెట్టుకుని మరీ చూసుకుంటుంది ఈ ప్రపంచ వార్తా సంస్థ బీబీసీ. ప్రస్తుతం వరల్డ్ లేబర్ లా ఫాలో అయ్యే కంపెనీ ఏదైనా ఉందంటే అది బీబీసీయే.
అయితే బీబీసీ ఇటీవల వరుస వివాదాలను ఎదుర్కొంటోంది. గతంలో మోడీ గోద్రా అల్లర్ల వ్యవహారంపై ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేసిన బీబీసీ. ఆ తర్వాత ఇక్కడ ఈడీ రైడ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అంతే కాదు తన అడ్రెస్ తో సహా అన్నీ మార్చుకోవల్సి వచ్చింది. అంతేనా ప్రస్తుతం బీబీసీ నుంచి కలెక్టివ్ న్యూస్ రూమ్ అనే పేరు మార్చుకోవల్సి వచ్చింది. ప్రభుత్వ తాకిడిని ఎదుర్కునేందుకు మరో దారి వెతుక్కోవడంలో భాగంగా ఇలా చేయాల్సి వచ్చింది.
ఇప్పుడు బీబీసీ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటోంది. ట్రంప్ ప్రసంగాన్ని వక్రీకరిస్తూ బీబీసీ డాక్యుమెంటరీ తయారు చేసిందన్నది ప్రధాన అభియోగం. దీంతో తీవ్రంగా స్పందించిన ట్రంప్ బీబీసీ పై పరువు నష్టం దావా వేస్తామని సందేశాలు పంపారు. తన లీగల్ టీమ్ ద్వారా ఆ సంస్థకు పెద్ద ఎత్తున తాఖీదులు పంపారు. దీంతో బీబీసీ ఇద్దరు ఉద్యోగులకు ఉద్యోగం నుంచి ఉద్వాసన పలికింది. కట్ చేస్తే 5 బిలియన్ డాలర్ల పరువు నష్టం పరిహారం చెల్లించమని డిమాండ్ చేశారు ట్రంప్.
అది వీలు కాదని.. కావాలంటే ఎన్ని క్షమాపణలైనా చెబుతామని రిప్లై ఇచ్చింది. బీబీసీ. అయితే ఈ విష యం మీ ప్రధానితో మాట్లాడతానని బెదిరించారు ట్రంప్. వారి నుంచి ఇద్దరు టాప్ ఎంప్లాయిస్ తొలగింపు అన్న చర్య తప్ప మరెలాంటి రియాక్షన్ లేదు. దీంతో ట్రంప్ బీబీసీపై భారీ పరువు నష్టం దావా వేశారు. ఈ దావా విలువ ఇండియన్ కరెన్సీలో అక్షరాలా 90 వేల కోట్లు. భారీ మొత్తంలో బీబీసీకి చారిటీ నిధులున్న మాట వాస్తవమే కానీ ఇంత మొత్తంలో నష్టపరిహారం కట్టడం మాత్రం కష్టమే. ఎందుకంటే ఉద్యోగులు తెలిసీ తెలియక చేసిన తప్పులకు ఇంత మొత్తం చెల్లించడం అంటే అది బీబీసీకి అయ్యే పని కాదని అంటున్నారు చాలా మంది..
ఇంతకీ బ్రిటన్ కి చెందిన ఈ వార్తా వ్యవస్థ భారత్, యూఎస్ వంటి దేశాలను ఎందుకు టార్గెట్ చేసింది? ఈ సంస్థ అసలు ఉద్దేశమేంటి? ఇందులో ఏదైనా మర్మం దాగి ఉందా? అన్నది ఒక డిబేట్ కాగా, బీబీసీ ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో ఇలాగే ఉంది. కాకుంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత బీబీసీ కంటెంట్ మరింత వైల్డ్ గా డిస్ట్రిబ్యూట్ అవుతోంది. దీంతో బీబీసీని టార్గెట్ చేస్తున్నారు ట్రంప్, మోడీ వంటి వారు. గతంలో బీబీసీ చేసిన డాక్యుమెంటరీలెన్నో ఇలాంటి ఎన్నో వక్రీకరణలతోనే ఉంటా యి కావాలంటే చూసుకోవచ్చంటారు కొందరు. కారణం బీబీసీకి వక్రీకరణ అన్నది దాని డీఎన్ఏలోనే ఉందంటారు.