‘రేప్’ ఆందోళనల్లో గాయపడిన కానిస్టేబుల్ మృతి
posted on Dec 25, 2012 @ 11:36AM
పారా మెడికల్ స్టూడెంట్ ఫై రేప్ తదనంతర ఆందోళనల్లో గాయపడిన ఢిల్లీ పోలీస్ కు చెందిన కానిస్టేబుల్ సుభాష్ తోమార్ (45) ఈ ఉదయం మరణించారు. ఇండియా గేట్ వద్ద జరిగిన ఆందోళనలను నియంత్రించే క్రమంలో గాయపడిన సుభాష్ ఢిల్లీ లోని రాం మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మరణించారు.
మీరట్ కు చెందిన ఈ కానిస్టేబుల్ మరణించిన విషయంలో పోలీసులు కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ ను గాయపరచిన సంఘటనకు సంభందించి తమ వద్ద వీడియో క్లిప్ ఉందని, దీనిని హత్య కేసుగా నమోదు చేస్తామని పోలీస్ అధికారులు ప్రకటించారు. కానిస్టేబుల్ గాయపడిన సంఘటనలో ఇంత వరకూ ఎనిమిది మందిని అరెస్టు చేసామని పోలీసులు చెప్పారు.
ఆం ఆద్మీ పార్టీ మనీష్ సిసోడియా వీరి తరపున బెయిల్ బాండ్ సమర్పించడంతో పోలీసులు వారిని ఆ తర్వాత విడుదల చేశారు. వీరిలో ఒకరు ఈ పార్టీకి చెందిన వారు కావడంతో ఆ పార్టీ ఫై పోలీస్ నిఘా ఉన్నట్లు తెలుస్తోంది. వీరి బెయిల్ ను రద్దు చేయించడానికి అవసరమైతే కోర్టుకు వెళ్తామని ఢిల్లీ సంయుక్త పోలీస్ కమీషనర్ తాజ్ హాసన్ విలేఖరులతో అన్నారు.
సుభాష్ మరణానికి ఆందోళనకారులే కారణమని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు.