విమర్శ ఎలా ఉండాలంటే!
posted on Jan 28, 2017 @ 9:31AM
అది అమెరికాలోని విల్కిన్సన్ విశ్వవిద్యాలయం. అక్కడ కొన్నేళ్ల క్రితం కొందరు విద్యార్థులు ఉండేవారు. వారిలో కొంతమందికి సాహిత్యం అంటే విపరీతమైన అభిలాష. ఆ అభిలాషతోనే వారుంతా కలిసి ఒక బృందంగా ఏర్పడ్డారు. నిరంతం ఆ బృందంలోని సభ్యులంతా కలుసుకుని సాహిత్యం మీద చర్చలు జరిపేవారు. ఆ చర్చలు వాడివేడిగా సాగేవి. మీద పడి కొట్టుకునేదాకా వెళ్లేవి. ఇక ఆ బృందంలో ఎవరన్నా ఓ రచన చేస్తే దాని మీద కూడా చర్చలు జరిగేవి. సునిశితమైన విమర్శతో ఆ రచనలు చీల్చ చెండాడేవారు. అక్షరం అక్షరాన్నీ విశ్లేషించి వాదించేవారు. దాంతో ఆ బృందానికి Stranglers (కొట్టుకు చచ్చేవాళ్లు) అన్న పేరు వచ్చింది.
Stranglers గురించి విన్న మరికొందరు విద్యార్థులు సాహిత్యం మీద అభిలాష ఉన్న సభ్యులతో మరో బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాని పేరు Wranglers (పోరాడేవారు) అని పెట్టుకున్నారు. వాళ్లు కూడా సాహిత్యానికి సంబంధించిన చర్చల కోసం నిరంతరం కలుసుకునేవారు. కానీ ఆ చర్చలలో అరుపులు, కేకలు ఉండేవి కావు. తమ అభిప్రాయాన్నీ, విశ్లేషణనీ వీలైనంత సున్నితంగా తెలియచేసే వాతావరణం అక్కడ ఉండేది. ఇక ఆ బృందంలో ఎవరన్నా రచన చేస్తే దాని మీద సానుకూల చర్చలు జరిగేవి. రచన ఎలా ఉంది? దానిలో మంచి విషయాలేంటి? ఎలాంటి మార్పులు చేస్తే అది ఇంకా మంచి రచన అవుతుంది? లాంటి సలహాలు, సూచనలతో సమావేశాలు సాగేవి.
ఇదంతా గడిచి ఓ ఇరవైఏళ్లు అయిపోయింది. ఆ విశ్వవిద్యాలయానికి చెందిన పూర్వవిద్యార్థులెవ్వరో ఆనాటి సంఘాలలోని సభ్యులు ఇప్పుడు ఏం చేస్తున్నారో అని పరిశోధించే ప్రయత్నం చేశారు. ఆశ్చర్యంగా... అద్భుత ప్రతిభావంతులుగా భావించబడిన Stranglersలో ఒక్కరంటే ఒక్కరు కూడా సాహిత్యరంగంలో పైకి రాలేకపోయారట. అందుకు విరుద్ధంగా Wranglers నుంచి దాదాపు ఆరుగురు రచయితలు జాతీయస్థాయిలో పేరు సంపాదించారు. కారణం! Stranglers ఎప్పుడూ ఒకరి మీద మరొకరు పైచేయి సాధించేందుకే ప్రాముఖ్యతని ఇచ్చారు. అపనమ్మకం, ఆత్మన్యూనత పోగయ్యేలా వారి బృందం పనిచేసింది. కానీ Wranglers అలా కాదు. ఒకరికొకరు చేయూతని ఇచ్చుకునేందుకే వారు ప్రయత్నించారు. తోటివారి రచనల్లో మంచి విషయాలను వెలికి తెచ్చేందుకు, లోటుపాట్లను సరిదిద్దుకునేందుకు తోడ్పడ్డారు.
పైచేయి సాధించాలనే అహంకారంతో చేసే విమర్శ ఎప్పటికీ ఎవ్వరికీ ఉపయోగం కాదు. కానీ ఇతరులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇచ్చే సలహాసూచనలు తప్పకుండా ఫలితాన్ని సాధిస్తాయి. ఆ విషయాన్నే మరోసారి WRANGLERS AND STRANGLERS ఉదంతం నిరూపించింది.
(ప్రచారంలో ఉన్న గాథ ఆధారంగా)
- నిర్జర.