రసాయనపరిశ్రమలపై పర్యవేక్షణ ఏదీ?
posted on Oct 19, 2012 9:04AM
రాష్ట్రంలోని రసాయనపరిశ్రమలపై ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడుతోంది. పరిశ్రమల యాజమాన్యాలు కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. కనీస భద్రతాచర్యలు తీసుకోవటం లేదు. దీంతో కార్మికులు భయాందోళనలకు గురవుతున్నారు. యాజమాన్యం కూలీ ఇస్తోంది కదా! అని తాము పనిలో చేరితే తిరిగి వెళ్లేంత వరకూ తమ కుటుంబాలవారు ఎదురుచూస్తున్నారని వారు వాపోతున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సమీపంలోని పలుప్రాంతాల్లో ఈ రసాయనపరిశ్రమలున్నాయి. అలానే వరంగల్జిల్లాలోనూ, కరీంనగర్ జిల్లాలోనూ ఈ పరిశ్రమలున్నాయి. అలానే నల్గండ జిల్లాలోని భువనగిరి పారిశ్రామికవాడలోనూ ఒక పరిశ్రమ ఉంది. త్రిశూల రసాయనిక పరిశ్రమలో కార్మికులు డబ్బాలో రసాయనాలు నింపుతుండగా అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో పరిశ్రమలో భారీగా మంటలు వ్యాపించాయి. అగ్నిమాపకసబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. కార్మికులు అప్రమత్తంగా ఉండటం వల్ల ఈ తాజా ప్రమాదం వల్ల ఎటువంటి చేదుఘటనలు నమోదు కాలేదు. తగిన రక్షణ చర్యలు యాజమాన్యాలు పాటించకపోతే ఎటువంటి దారుణస్థితి ఎదుర్కొవలసి వస్తుందో ఈ రసాయనికపరిశ్రమలో ప్రమాదం హెచ్చరిస్తోంది. ఈ పరిశ్రమ యాజమాన్యం, కార్మికులు అప్రమత్తంగా మెలగాలని సమీపవాసులు కోరుతున్నారు.