స్టార్ బ్యాట్స్ మ్యాన్ నాట్ అవుట్: థర్డ్ ఎంపైర్
posted on Nov 8, 2013 @ 1:16PM
స్టార్ బ్యాట్స్ మ్యాన్ కిరణ్ కుమార్ బ్యాటింగ్ సామర్ధ్యం, బ్యాటింగ్ తీరుపై టీ-కాంగ్రెస్ ప్లేయర్స్ లో చాలా అపోహలున్నాయి. ఆయన అయిపోయిన మ్యాచ్ లో లాస్ట్ బాల్ కోసం ఎదురు చూస్తున్నఆటగాడని కొందరు వెక్కిరిస్తే, అన్నిబాల్స్ అయిపోయాక కూడా ఇంకా నో బాల్స్, వైడ్ బాల్స్ కోసం ఎదురుచూస్తున్నాడని మరికొందరు అభిప్రాయ పడ్డారు. అసలు ఆయన ఆట ఎప్పుడో ముగిసిపోయినా ఇంకా మైదానంలో బ్యాట్ పట్టుకొని ఎందుకు తిరుగుతున్నాడో? అని కొందరు ప్రశ్నిస్తే, త్వరలోనే డిల్లీ ఎంపైర్లు ఆయన బ్యాట్ లాకొని ఇంటికి పంపేయడం ఖాయమని ప్రకటించేశారు.
ఈ మ్యాచ్ లో ఎక్స్ ట్రా ప్లేయర్ గా బయట కూర్చొన్నకేసీఆర్ కూడా అక్టోబర్ మొదటి వారంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్లగ్గు పీకేయబడుతుందని డేట్ ఇచ్చేసారు. అయితే నేటికీ స్టార్ బ్యాట్స్ మ్యాన్ బ్యాటింగ్ చేస్తూనే ఉన్నాడు. కానీ మొదట బ్యాటింగ్ కి దిగినప్పుడు ‘సమైక్య బంతి’ డిల్లీలో పడేలా గట్టి షాట్లు చాలా కొట్టినప్పటికీ, ప్రతీ షాట్ రాష్ట్ర బౌండరీలు దాటించి చప్పట్లు కొట్టించుకోవడం కష్టం గనుక, ఇప్పుడు వారం పదిరోజుల కొకసారి ఫోర్స్, సింగిల్స్ తీస్తూ నిలకడగా ఆడుతున్నారు. మ్యాచ్ పూర్తయిపోయిందని, అసలు బాల్సే మిగిలి లేవని డిక్లేర్ చేసిన టీ-కాంగ్రెస్ ప్లేయర్స్ కూడా ముక్కున వేలేసుకొని స్టార్ బ్యాట్స్ మ్యాన్ బ్యాటింగ్ చూస్తుండిపోక తప్పలేదు.
వారు ఆ బ్యాట్స్ మ్యాన్ ‘ఫౌల్ గేమ్’ ఆడుతున్నాడని అక్రోసిస్తూ థర్డ్ ఎంపైర్ దిగ్విజయ్ సింగ్ వైపు చూస్తే, ఆయన కూడా "కిరణ్ మంచి కాంగ్రెస్ బ్యాట్స్ మ్యాన్" అని ఈ రోజే మరోసారి డిక్లేర్ చేయడంతో హతాశులయ్యారు.
"కిరణ్ కుమార్ రెడ్డే కాదు ఆయన కుటుంబంలో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం బాగా ఆడిన ప్లేయర్సే. అటువంటి వారికి బౌలింగ్ పై ఏవయినా అనుమానాలు ఉంటే తప్పకుండా అడగవచ్చును. అంత మాత్రాన్న ఆయన పార్టీకోసం ఆడడని భావించడం తప్పు. ఆయన మైదానాన్ని రెండు ముక్కలు చేసినా ఆడేందుకు అంగీకరించారు. గనుకనే ఇంకా ఆడగలుగుతున్నారు. ఆయన అంత బాగా ఆడుతున్నపుడు ఆయన చేతిలోంచి బ్యాట్ లాక్కోవలసిన అవసరం ఏమొచ్చింది? ఆయన పార్టీ తరపునే ఆడతాడు. ఈవిషయంలో ఎవరూ అనుమానం పడనవసరం లేదు," అని ఈ రోజే మళ్ళీ మరో మారు థర్డ్ ఎంపైర్ దిగ్విజయ్ అనౌన్స్ చేసేసారు.
అయితే మరి ఆయనను డిల్లీకి ఎందుకు పిలిపించారు? బ్యాట్ లాక్కోవడానికి కాదా? అని వారు అమాయకంగా ప్రశ్నిస్తే థర్డ్ ఎంపైర్ పక్కున నవ్వుతూ “ఆయనను పిలిపించింది బ్యాటింగ్ చేసేటప్పుడు ఫీల్డింగ్లో ఉన్నమన పార్టీ వాళ్లకి దెబ్బలు తగలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి చెప్పడానికి, తెలంగాణా, ఆంధ్రా టీములు కూడా ఆడుకోవడానికి వీలుగా మైదానం ఏవిధంగా విభజించాలి? అనే విషయాలను చెప్పడానికే తప్ప, ఆయన బ్యాట్ లాక్కోవడానికి మాత్రం కాదు," అని స్పష్టం చేసారు.
ఇక తెలంగాణా టీం కోసం తయారు చేసిన టీ-బిల్లుని ఈనెలాఖరులోగా రాష్ట్రానికి పంపిస్తామని ప్రకటించారు.