ముఖ్యమంత్రి మళ్ళీ డిల్లీ వెళ్తూన్నారహో
posted on Nov 7, 2013 @ 12:11PM
కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తరచు డిల్లీ వెళ్లి అమ్మఆశీర్వాదం తీసుకోవడం షరా మామూలు వ్యవహారమే అయినప్పటికీ, కిరణ్ కుమార్ రెడ్డి డిల్లీ పర్యటన అనగానే సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ కి వచ్చాడన్నంతగా ఊహాగానాలు మొదలయిపోతుంటాయి. ఆయనను శుక్రవారం డిల్లీ రమ్మని అధిష్టానం నుండి పిలుపులు రావడంతో రేపు ఉదయం బయలుదేరుతున్నారు. షరా మామూలుగానే మీడియాలో ఆయన డిల్లీ యాత్రపై విశ్లేషణలు మొదలయిపోయాయి కూడా.
నలుగురితో బాటు నారాయణ అనుకొంటే తప్పేమీ లేదు గనుక, ఈ సందర్భంగా మనమూ ఆయన గురించి ఓ నాలుగు ముక్కలు చెప్పుకోవచ్చును.
ఆయన ఈ రెండు నెలలో ఎన్ని సమైక్య బాంబులు పేల్చినప్పటికీ, ‘కిరణ్ క్రమశిక్షణ గల నాయకుడు’గానే దిగ్విజయ్ వంటి పార్టీ పెద్దలు సర్టిఫై చేస్తున్నారు. వారి మాటలను వమ్ముచేయకుండా రెండు నెలలుపైగా ఏకధాటిగా సాగిన ఏపీఎన్జీవోల సమ్మెను రెండే రెండు మీటింగులతో ముగించేసి అధిష్టానానికి తన విధేయతను మరో మారు నిరూపించుకొన్నారు. వీ.హనుమంత రావు వంటి సీనియర్లు "మ్యాచ్ అయిపోయాక కూడా కిరణ్ ఇంకేమి ఆడుతాడు?" అని అడగడం కేవలం అమాయక ప్రశ్నలేనని ఇంకా నేటికీ బ్యాటింగ్ చేస్తు పరుగులు తీస్తున్న కెప్టెన్ కిరణ్, ద స్టార్ బ్యాట్ మ్యాన్ రుజువు చేస్తూనే ఉన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యమని ఎంత గొంతు చించుకొంటునపటికీ ఆయన మొదటి నుండి కూడా కాంగ్రెస్ అధిష్టానం వ్రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే నటిస్తున్నారనే విషయాన్నీఅందరి కంటే ముందు పసిగట్టింది వైకాపా. ఎందుకంటే అది కూడా కాంగ్రెస్ డీ.యాన్.ఏ.ను కలిగి ఉండటమే. కాంగ్రెస్ ఆపన్నహస్తం ఆదుకోకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి జైలు నుండి బయటకి రావడం ఎంత కష్టమో అర్ధం చేసుకొన్న వైకాపా, సోనియా ప్రోత్సాహం, ఆశీర్వాదం లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగగలిగేవాడా? అని ఒక మంచి ప్రశ్న వేసింది.
ఆయన ఇంత ధిక్కార స్వరం వినిపిస్తూ, పార్టీని ముప్పు తిప్పలు పెడుతున్నపటికీ, కాంగ్రెస్ పెద్దలు ఆయన మంచి బాలుడని అనడం కేవలం ఆయన అమ్మ హస్తం పట్టుకొని ముందు సాగుతున్నందునేనని ఆ పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించేసింది కూడా. ఎంతయినా ఇటువంటి విషయాలలో వైకాపా మంచి అనుభవమున్నధి పార్టీ గనుక దాని మాటలను కొట్టిపారేయలేము. అదే ప్రాతిపాదికన ఆలోచిస్తే ‘అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే’నని అర్ధం అవుతుంది. లేకుంటే ఆయన కుర్చీలో ఈ పాటికి ఏ బోత్సో, ఆనమో, చిరంజీవో, దామోదరుడో, కోట్ల రెడ్డో, మరోకరో రాజ్యమేలుతూ కనిపించేవారు.
అందువల్ల ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి డిల్లీ పర్యటన గురించి కూడా బుర్రలు బ్రద్దలు కొట్టుకోవలసిన అవసరం లేదు. అంతా కాంగ్రెస్ స్క్రిప్ట్ ప్రకారమే సాగుతోంది అనుకొంటే కిరణ్ డిల్లీ వెళ్లి తిరిగివచ్చిన వారం పది రోజుల్లోనే రాష్ట్ర శాసనసభకు తెలంగాణా బిల్లో మరొకటో కాగితం వచ్చిపడుతుంది. అప్పుడు ముందే వాగ్దానం చేసినట్లు కిరణ్ కుమార్ రెడ్డి ఆయన సహచర సీమాంధ్ర మంత్రులు శాసనసభలో వీరంగం వేసి రాజీనామాలు చేసి బయటపడతారు.
అదేసమయంలో మళ్ళీ ఏపీఎన్జీజీవోలు సమ్మె కూడా మొదలయి ఉంటుంది. గనుక సమైక్య వేడి మళ్ళీ రాజుకొంటుంది. సమైక్యం కోసం తమ పదవులకే రాజీనామాలు చేసి బయటకొచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి తదితరులకు వీరతిలకమద్ది జనాలు స్వాగతం పలుకవచ్చును. ఈ పరిస్థితుల్లో కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో కొనసాగడం కష్టం గనుక వేరు కుంపటి పెట్టుకోవచ్చును. లేదా ఇప్పటికే రాజేసి సిద్దంగా ఉన్నవేరే ఏ కుంపటి మీదయిన సమైక్యంగా వండుకోవచ్చును.
అయితే ఆ బిల్లేదో శాసనసభ గడప దాటగానే, ఇక రాష్ట్రంతో పనేమీ లేదు గనుక, కేంద్రం వెంటనే రాష్ట్రపతి పాలన ప్రకటించేసి మరింత వేగంగా రాష్ట్ర విభజన ప్రక్రియను కొనసాగిస్తుంది. ఎందుకంటే డిశంబర్ 10న నాటికి ఈ తంతు అంతా ముగించి తెలుగు ప్రజలకి సోనియమ్మ పుట్టిన రోజు కానుకగా ప్రకటించవలసి ఉంది.
కాంగ్రెస్ పార్టీ ఇంత చురుకుగా, ఎంతో పద్దతిగా పనిచేయడం చూసి చాలా కాలమే అయినప్పటికీ, సీమాంధ్ర ప్రజలు మాత్రం ఆ పార్టీని అపార్ధం చేసుకొంటున్నారు. పాపం కాంగ్రెస్ పార్టీ!