చేసిన తప్పులు దండంతో సరి అంటే ఎలా శ్రీరెడ్డీ!
posted on Nov 14, 2024 @ 10:27AM
గత కొన్నేళ్ళుగా నోటికొచ్చిన చెత్తవాగుడు వాగుతూ అసహ్యానికి, అసభ్యతకి ప్రతినిధిగా వ్యవహరిస్తున్న వైసీపీ నాయకురాలు శ్రీరెడ్డికి ఇప్పుడు జ్ణానోదయం అయ్యింది. వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. అయితే ఆమె వైసీపీకి గుడ్ బై చెబుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్, ఆయన సతీమణికి ఓ లేఖ రాశారు. ఆ లేఖలో అందరికీ క్షమాపణలు చెప్పేశారు. జగన్ తో మొదలు పెట్టి ఆయన సతీమణి భారతి నుంచి మంత్రులు లోకేష్, అనితలకు కూడా క్షమాపణలు చెప్పారు. షర్మిలనూ, వైఎస్ సునీతనూ కూడా క్షమించమని వేడుకున్నారు.
ఇకపై ఎలాంటి అసభ్య పోస్టులూ పెట్టనని దేవుడి మీద ప్రమాణం చేసి మరీ చెప్పారు. అయితే అసభ్యం, అశ్లీలం, అసహ్యం ఈ మూడు అంశాల మేలు కలయిక అన్నట్లుగా గత కొన్నేళ్లుగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తగా ఆమె చేసిన దూషణలు కేవలం క్షమాపణ సరిపెట్టేయడం అసాధ్యం. కేవలంమహిళ అన్న కారణంగా ఎవర్నయినా ఎంత మాటయినా అనేయచ్చు అన్నట్లుగా వ్యవహరిం చిన శ్రీరెడ్డి గత కొన్నేళ్లుగా చేసింది తన బూతు పురాణంతో జగన్ వ్యతిరేకులను దూషించడమే. శ్రీరెడ్డి సామాజిక మాధ్యమం వేదికగా ఎంత వల్గర్ గా మాట్లాడారో తెలియంది కాదు. గత ఐదేళ్ళుగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ నాయకులను చెప్పడానికి కూడా వీల్లేని భాషలో తిట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి , ఉప ముఖ్యమంత్రి , హోంమంత్రిపై దూషణల పర్వం కొనసాగించారు. ఇన్నాళ్ళకు పాపం పండింది. అరెస్టు తప్పదని అర్థం కావడంతో శ్రీరెడ్డి ఆడపిల్లని కనికరించండంటూ క్షమాపణలు చెబుతున్నారు.
అయితే తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం ఆ క్షమాపణలను అంగీకరించేందుకు సిద్ధంగా లేరు. ఆ లేఖ ఆధారంగా తెలుగుదేశం మహిళా కార్యకర్తలు ఆమెపై మరో ఫిర్యాదు చేశారు. శ్రీరెడ్డి ఎవరెవరికి వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బూతులు తిట్టారో ఆ పేర్లన్నీ ఆమె రాసిన లేఖలోనే ఉన్నాయి. దానినే పేర్కొంటూ తాజాగా మరో ఫిర్యాదు దాఖలైంది.