మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వంతు ఎప్పుడో?
posted on Nov 14, 2024 @ 9:49AM
వైసీపీ అధికారంలో ఉన్నంత వరకూ తమకంటే తోపెవడూ లేడన్నట్లుగా చెలరేగిపోయిన చాలా మంది వైసీపీ నేతలు, మాజీ మంత్రులు ఇప్పుడు మౌనం దాల్చారు. అంతే కాకుండా కలికానిక్కూడా దొరక్కుండా అజ్ణాతంలోకి పారిపోయి కలుగుల్లో దూరిపోయారు. అలాంటి నేతల్లో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒకరు. నోటికొచ్చినట్లు మాట్లాడటంలో ఈయన కొడాలి నాని తరువాతి స్థానంలో ఉంటారని కచ్చితంగా చెప్పొచ్చు. ఇటీవలి ఎన్నికలలో పార్టీతో పాటు తాను కూడా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. పోలింగ్ జరుగుతుండగానే ఓటమిని అంగీకరించేశారు. పోలింగ్ తరువాత మీడియా ముందు ఎన్నికలలో పోలీసులు, అధికారులు ఏకపక్షంగా తెలుగుదేశం కూటమికి అనుకూలంగా వ్యవహరించారంటూ ఆరోపణలు గుప్పించారు. అంతే ఆ తరువాత సైలెంటైపోయారు. ఓటమికి సాకులు చెప్పడం కూడా మానేశారు. చేతులెత్తేశారు. ముఖం చాటేశారు.
ఏపీ అసెంబ్లీలో 175 స్థానాలుంటే వాటిలో 164 స్థానాలు తెలుగుదేశం కూటమి చేజిక్కించుకుంది. 151 స్థానాలతో గత ఎన్నికలలో విజయం సాధించిన వైసీపీ ఇప్పుడు కేవలం 11 స్ధానాలకు గెలుచుకుని కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకండా మిగిలిపోయింది. దీంతో వైసీపీ అధికారంలో ఉండగా అక్రమాలకు పాల్పడిన నేతలు, విపక్ష నేతలపై ఇష్టారీతిన నోరు పారేసుకున్న నాయకులు ఇప్పుడు అజ్ణాతంలోకి జారుకున్నారు. అనిల్ కుమార్ యాదవ్ కూడా అదే చేశారు.
కానీ వైసీపీ అధికారంలో ఉండగా, తాను మంత్రి పదవి వెలగబెడుతున్న సమయంలో అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లాలో ఖనిజాల దోపిడీ సహా అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ఆనం రామనాయారణరెడ్డి, కొటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వంటి వారు వైసీపీ తీరుతో, జగన్ విధానాలతో విభేదించి బయటకు వచ్చి తెలుగుదేశం గూటికి చేరారు. వారిని అనీల్ కుమార్ యాదవ్ అనుచితంగా దూషించి వారి రాజకీయ జీవితం ముగిసిపోయందని ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేశారు. ఒక వేళ వారు రాజకీయాలలో రాణిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ సవాళ్లు విసిరారు. అలాంటి అనిల్ కుమార్ ఇప్పుడు ముఖం చాటేశారు. అనిల్ కుమార్ దోపిడీ, అక్రమాలపై తెలుగుదేశం పార్టీ అప్పట్లోనే జ్యుడీషియల్ ఎంక్వైరీకి డిమాండ్ చేసింది.
పైగా ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సోషల్ మీడియాలో, మీడియాలో ఇష్టానుసారంగా అనుచిత వ్యాఖ్యలు చేసి, ప్రత్యర్థి పార్టీల నాయకుల వ్యక్తిత్వ హననానికి పాల్పడిన ఒక్కొక్కరినీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చట్టం ముందు నిలబెడుతోంది. వైసీపీ మార్క్ అరాచకానికి, చిల్లర పనులకు బ్రాండ్ అంబాసిడర్ గా గుర్తింపు పొంది, అసెంబ్లీలో తొడలు కొట్టడం, జిప్పులు తీయడం వంటి నీచ నికృష్ఠ పనులకు పాల్పడిన అనిల్ కుమార్ ను ఎలా వదులుతాం అంటూ తెలుగుదేశం శ్రేణులు అంటున్నాయి. అయితే అధికారంలో ఉన్న సమయంలో రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తూ హద్దులు లేకండా రెచ్చిపోయిన అనిల్ కుమార్ యాదవ్., వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత అడ్రస్ కూడా తెలియకుండా మాయమైపోయారు. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించడం లేదు. మీడియా ముందుకు అసలే రావడం లేదు. అసలు వైసీపీయే అనిల్ కుమార్ యాదవ్ ఒకడు ఉన్నాడని మరిచిపోయిన పరిస్థితి. అయితే అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయన చేసిన దుర్మార్గాలు, చేసిన అసభ్య, అసహ్యకర వ్యాఖ్యలు, దూషణలను తెలుగుదేశం శ్రేణులు మరిచిపోలేదు. ఆయనపై కేసు నమోదు చేసి చట్టం ముందు నిలబెట్టాలని కోరుతున్నారు. ఆ రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు.