శ్రీలంక నుంచి కాకినాడ మత్స్యకారుల విడుదల

 

శ్రీలంక జాఫ్నా జైల్లో నిర్బంధంలో ఉన్న నలుగురు కాకినాడ జాలర్లు స్వదేశానికి తిరుగు పయనం అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపీ భవన్ నుంచి జాలర్ల విడుదలకు తక్షణ చర్యలు చేపట్టడంతో ఈనెల 26న నలుగురు జాలర్లను శ్రీలంక కోస్ట్ గార్డ్ సిబ్బంది భారత్ కు అప్పగించారు. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ సమీపంలోని మండపం వద్ద శ్రీలంక కోస్ట్ గార్డు సిబ్బంది ఈ నలుగురిని  భారత్ కోస్ట్ గార్డ్ కు అప్పగించారు. తమిళనాడు లోని మండపం నుంచి  నౌకలో బయలుదేరిన నలుగురు మత్స్యకారులు ఈనెల 30న కాకినాడకు చేరుకోనున్నారు.  

2025 ఆగస్టు 3 తేదీన కాకినాడకు చెందిన నలుగురు మత్స్యకారులు — కె. శ్రీను వెంకటేశ్వర్, కర్రినోకరాజ్ బొర్రియా, చందా నాగేశ్వరరావు, బ్రహ్మనందంలు పడవ కొనుగోలు చేయడానికి నాగపట్నంకు బయలుదేరారు. తిరిగి ప్రయాణించే సమయంలో నావిగేషన్ లోపం కారణంగా శ్రీలంక జలాల్లోకి కొట్టుకుపోయి, జాఫ్నా తీరం సమీపంలోకి చేరుకున్నారు. వారిని శ్రీలంక నౌకాకాదళం అదుపులోకి తీసుకొని, జాఫ్నా పోలీసులకు అప్పగించింది. 

2025 ఆగస్టు 4వ తేదీ నుంచి ఈ నలుగురు మత్స్యకారులు ఏడు వారాలకు పైగా జాఫ్నా జైలులో ఉన్నారు. 52 రోజులుగా జాఫ్నా జైల్లో నిర్బంధంలో ఉన్న నలుగురిని స్వదేశానికి తిరిగి రప్పించే అంశంపై ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు జాఫ్నాలోని భారత రాయబార కార్యాలయం ద్వారా నిరంతర సంప్రదింపులు చేశారు. 

ఢిల్లీ లోని కోస్ట్ గార్డ్ కార్యాలయం ద్వారా నలుగురు  మత్స్యకారులను స్వదేశానికి రప్పించేలా ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ మంతనాలు జరిపారు. ఈ మేరకు ఈ నెల 26 తేదీన శ్రీలంక అధికారులు నలుగురు మత్స్యకారులను భారత్‌కు అప్పగించారు. ఏపీ ప్రభుత్వం తక్షణం స్పందించి సంప్రదింపులు చేయకపోతే ఈ నలుగురు మరో ఆరు నెలల పాటు జాఫ్నా జైల్లో గడపాల్సి వచ్చేదని అధికారులు చెప్తున్నారు.

జోహో వ్యవస్థాపకుడి అత్యంత ఖరీదైన విడాకులు

  టెక్ దిగ్గజం జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వేంబు తన విడాకుల వ్యవహారంతో ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. తన భార్య ప్రమీలా నాయర్‌తో విడిపోతున్న సందర్భంగా సెటిల్‌మెంట్ కింద ఆయన దాదాపు రూ. 15,000 కోట్ల విలువైన ఆస్తులను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది భారతదేశంలోనే అత్యంత ఖరీదైన విడాకులుగా నిలవడమే కాకుండా.. ప్రపంచంలోనే నాలుగో అత్యంత భారీ సెటిల్‌మెంట్‌గా రికార్డులకెక్కింది.  బిల్ గేట్స్, జెఫ్ బెజోస్ వంటి దిగ్గజాల జాబితాలోకి ఇప్పుడు శ్రీధర్ వేంబు పేరు చేరింది. శ్రీధర్ వేంబు, ఆయన భార్య ప్రమీలా శ్రీనివాసన్ మధ్య గత కొన్నేళ్లుగా సాగుతున్న విడాకుల పోరాటం కీలక మలుపు తిరిగింది. విడాకుల ప్రక్రియ కొనసాగుతుండగానే.. ప్రమీల ఆర్థిక ప్రయోజనాలను కాపాడేందుకు శ్రీధర్ వేంబును 1.7 బిలియన్ డాలర్లు, అంటే సుమారు రూ. 15,000 కోట్లుల విలువైన బాండ్‌ను కోర్టులో డిపాజిట్ చేయాలని కాలిఫోర్నియా కోర్టు ఆదేశించింది.  ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. బిల్ గేట్స్, జెఫ్ బెజోస్ వంటి దిగ్గజాల తర్వాత నాలుగో అత్యంత ఖరీదైన విడాకుల కేసుగా ఈ కేసు రికార్డు సృష్టించింది.ప్రస్తుతం శ్రీధర్ వేంబు నికర ఆస్తి విలువ సుమారు 5.85 బిలియన్ డాలర్లుగా అంచనా. కాలిఫోర్నియా కోర్టు ఈ బాండ్ ఆర్డర్‌తో పాటు జోహోకు చెందిన కొన్ని అమెరికా విభాగాలపై పర్యవేక్షకుడిని కూడా నియమించింది. శ్రీధర్ వేంబు తరపు లాయర్లు ఈ ఆదేశాలను సవాలు చేస్తూ అప్పీల్‌కు వెళ్లారు. మరి ఈ బిలియన్ డాలర్ల వివాదం చివరకు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.  

డెలివరీ బాయ్ అవతారమెత్తిన ఎంపీ

  గిగ్ వర్కర్ల (డెలివరీ బాయిస్)  సమస్యలను పార్లమెంటులో ఇటీవల లేవనెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ  రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా  తాజాగా బ్లింకిట్ డెలివరీ బాయ్‌ అవతారం ఎత్తారు. డెలివరీ ఏజెంట్ దుస్తులు ధరించి కస్టమర్లకు వస్తువులు డెలివరీ చేశారు. 'బోర్డు రూములకు దూరంగా అట్టడుగు స్థాయిలో.. ఐ లివ్డ్ దైర్ డే..' అంటూ ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.  ఈ వీడియోలో బ్లింకిట్ యూనిఫారం వేసుకున్న చద్దా డెలివరీ బ్యాగ్‌ తగిలించుకుని రైడర్‌తో కలిసి ప్రయాణం సాగించారు. స్టోర్‌లో వస్తువులు కలెక్ట్ చేసుకుని డెలివరీ లొకేషన్‌కు బయలుదేరారు. అక్కడకు చేరుకోగానే లిఫ్ట్‌ ఎక్కి రైడర్‌ను చద్దా అనుసరించారు. 'స్టే ట్యూన్డ్' అంటూ ఆ వీడియో ముగుస్తుంది. చద్దా ఇటీవల గిగ్ వర్కర్లు దేశవ్యాప్త సమ్మె జరిపిన న్యూఇయర్ ఈవ్‌లో పాల్గొన్నారు.  పని గంటలతో సహా తాము ఎదుర్కొంటున్న సమస్యలపై గిగ్ వర్కర్లు ఈ ఆందోళన జరిపారు. కస్టమర్లకు పది నిమిషాల్లో డెలివరీ ఇస్తామంటూ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫాంలు ఇస్తున్న హామీలతో చద్దా విభేదిస్తున్నారు. ఇలాంటి డెడ్‌లైన్‌ల వల్ల రైడర్లపై ఒత్తిడి పెరుగుతుందని, భద్రతతో రాజీ పడాల్సి వస్తుందని అంటున్నారు. ఇదే విషయాన్ని గత ఏడాది రాజ్యసభ జీరో అవర్‌లో చద్దా ప్రస్తావించారు.  జనం రోబోలు కాదని, వాళ్లలోనూ తండ్రులు, భర్తలు, సోదరులు, కుమారులు ఉన్నారని అన్నారు. వారి గురించి సభ ఆలోచించాలని కోరారు. 10 నిమిషాల్లో డెలివరీ అనే క్రూర నిబంధనకు తెరపడాలని అన్నారు. తాజాగా, వారి కష్టనష్టాలను స్వయంగా తెలుకునేందుకు డెలివరీ బాయ్‌గా ఆయన అవతారం ఎత్తడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఏపీలో పోటా పోటీ విగ్ర‌హాలు..?

  ఏపీలో కొండ‌ల‌పై పోటా పోటీ విగ్ర‌హాల గురించి ప్ర‌ముఖంగా చ‌ర్చ న‌డుస్తోంది. కూట‌మి స‌ర్కార్ క‌మ్మ వారు అధికంగా ఉండే నీరుకొండ గ్రామం కొండ‌పై రూ. 1750 కోట్ల‌తో ఎన్టీఆర్  విగ్ర‌హం పెడతామ‌న్న ప్ర‌క‌ట‌న  చేసింది. దీంతో వైయ‌స్, రంగా  విగ్ర‌హాల  ప్ర‌స్తావ‌న సైతం విన‌ వ‌స్తోంది. క‌మ్మ‌ల‌ను చూసిన రెడ్లు.. తాము ఎక్కువ‌గా ఉండే పెనుమాక గ్రామం కొండ‌పై వైయ‌స్ విగ్ర‌హం అంత‌కన్నా మించిన ఎత్తుతో,, సుమారు మూడు వేల కోట్ల వ్య‌యం చేస్తూ.. విగ్ర‌హం పెట్ట‌డం ఖాయంగా తెలుస్తోంది.ఇక క‌మ్మ, రెడ్ల‌ను చూసి కాపులు తామేమీ త‌క్కువ కాదంటున్నార‌ట‌. కాపులు ఎక్కువ‌గా ఉండే ఉండ‌వ‌ల్లి గ్రామం కొండ‌ లేదా ఎర్రుపాలెం కొండ‌పై వంగ‌వీటి మోహ‌న రంగా విగ్ర‌హం పెడ‌తార‌ట‌. దీంతో ఏపీలో ప్ర‌స్తుతం పోటా పోటీ విగ్ర‌హాల వ్య‌వ‌హారం ఒకింత జోరుగానే  సాగుతోంది. కొంద‌రు క‌మ్మ వారైతే ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని వ‌ద్ద‌నే అంటున్నార‌ట‌. కారణం ఇదిగో ఇదేనంటున్నారు. ఇప్పుడు మీరు రెచ్చిపోయి ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని పెడితే.. వ‌చ్చే రోజుల్లో అవి వైయ‌స్, రంగా విగ్ర‌హాలుగా ఒక‌టికి మూడ‌వుతాయని వీరు తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. ఉన్న స‌మ‌స్య‌లు చాల‌వ‌న్న‌ట్టు వైసీపీ ఇదే విగ్ర‌హ వ్య‌వ‌హారంపై కొత్త రాగం అందుకుంది. మెడిక‌ల్ కాలేజీల‌కు ఏడాదికి వెయ్యి కోట్లు ఖ‌ర్చు చేయ‌లేని కూట‌మి స‌ర్కార్.. సుమారు రెండు వేల కోట్ల‌తో ఈ ఎన్టీఆర్ విగ్ర‌హం పెట్ట‌డ‌మేంట‌ని రివ‌ర్స్ లో వ‌స్తోంది. దీంతో పాటు ద‌ళితుల‌ను కూడా ఎగ‌దోసి.. మా సొమ్ముతో క‌మ్మ వారి కుల ప్ర‌తీక అయిన ఎన్టీఆర్ విగ్ర‌హం పెట్ట‌డ‌మేంట‌ని ఒక ర‌క‌మైన ప్ర‌చారం చేయిస్తోంది. కొంద‌రైతే క‌మ్మ‌వారికి ఎన్టీఆర్ విగ్ర‌హాలు పెట్టుకునేంత సొమ్ములు కూడా లేవా? అన్న చ‌ర్చ‌కు తెర‌లేపారు. ఇదంతా ఇలా ఉంటే గ‌తంలో గుంటూరు ఎంపీ  గా ప‌ని చేసిన జ‌య‌దేవ్ గ‌ల్లా పార్ల‌మెంటులో బీజేపీ స‌ర్కార్ వేల కోట్ల‌తో నిర్మించిన స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్, శివాజీ విగ్ర‌హాల వీడియోని వైర‌ల్ చేస్తున్నారు.  వీట‌న్నిటి  న‌డుమ ఈ విగ్ర‌హాల వ్య‌వ‌హారం ఎక్క‌డి వ‌ర‌కూ వెళ్తుందో తేలాల్సి ఉంది.

వివేకా హత్య కేసు.. మరోసారి సుప్రీం కు డాక్టర్ సునీత

మాజీ మంత్రి వివేకానందరెడ్డి  హత్య కేసు లో ఆయన కుమార్తె సునీత మళ్లీ సుప్రీం మెట్లెక్కారు.  తన తండ్రి వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగింపునకు ట్రయల్ కోర్టు పాక్షిక అనుమతి మాత్రమే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆమె సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  సీబీఐ విచారణ అంశంపై నిర్ణయం తీసుకోవాలని హైదరాబాద్ నాంపల్లిలోని  సీబీఐ ప్రత్యేక కోర్టు ను గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది.   దీనిపై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు కేవలం ఇద్దరి పాత్రపై మాత్రమే విచారణ జరపాలని  ఆదేశాలు ఇచ్చింది. తాము లేవనెత్తిన అంశాలకు విరుద్ధంగా పాక్షిక విచారణకు ట్రయల్ కోర్టు ఆదేశాలిచ్చిందనీ, సుప్రీం ధర్మాసనం ఇచ్చిన మార్గదర్శకాలను ట్రయల్ కోర్టు పట్టించుకోలేదని సునీత సుప్రీం ను ఆశ్రయించారు.   దీంతో ప్రస్తుత అప్లికేషన్తో పాటు పెండింగ్ లో  ఉన్న అన్ని పిటిషన్లపై విచారణను సుప్రీం కోర్టు వచ్చే మంగళవారానికి  వాయిదా వేసింది.

కెనడాలో భారీ చోరీ కేసు...భారత్ నిందితుల కీలక పాత్ర

  400 కిలోల స్వచ్ఛమైన బంగారాన్ని విమానాశ్రయం నుంచే మాయం చేసిన హైటెక్ దోపిడీ కేసులో కెనడా పోలీసులు పురోగతి సాధించారు. ముఖ్యంగా కెనడా చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన రూ. 160 కోట్లకు పైగా విలువైన గోల్డ్ హీస్ట్‌ కేసులో పోలీసులు మరో కీలక నిందితుడిని వేటాడి పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వెళ్తూ టొరంటో ఎయిర్‌పోర్టులో దిగగానే అరెసలాన్ చౌదరిని బేడీలు వేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అసలు సూత్రధారి, ఎయిర్ కెనడా మాజీ ఉద్యోగి సిమ్రాన్ ప్రీత్ పనేసర్ ప్రస్తుతం భారత్‌లో తలదాచుకున్నట్లు వెల్లడవ్వడం అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది.  కెనడా నేర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జరిగిన సుమారు 20 మిలియన్ డాలర్ల విలువైన బంగారు దోపిడీ కేసులో కెనడా పోలీసులు మరో కీలక విజయాన్ని అందుకున్నారు. 'ప్రాజెక్ట్ 24K' పేరుతో జరుగుతున్న ఈ భారీ దర్యాప్తులో భాగంగా.. తాజాగా 43 ఏళ్ల వయసు కల్గిన అరెసలాన్ చౌదరి అనే వ్యక్తిని పీల్ రీజినల్ పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి వస్తున్న ఇతడు.. టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగు పెట్టగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  2023 ఏప్రిల్ 17వ తేదీన స్విట్జర్లాండ్‌లోని జూరిచ్ నుంచి ఒక కార్గో విమానం టొరంటో విమానాశ్రయానికి చేరుకుంది. అందులో సుమారు 400 కిలోల స్వచ్ఛమైన బంగారం,  2.5 మిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీ ఉన్నాయి. అయితే విమానాశ్రయ ప్రాంగణంలోని ఒక సురక్షిత ప్రాంతానికి ఈ రవాణాను తరలించిన కొద్ది సేపటికే అది అదృశ్యం అయింది. ఎయిర్ కెనడా వ్యవస్థలను మోసం చేసి, నకిలీ పత్రాల ద్వారా పలువురు దుండగులు ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.  ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన సిమ్రాన్ ప్రీత్ పనేసర్ (33) ప్రస్తుతం భారత్‌లో తలదాచుకున్నట్లు పోలీసులు బలంగా నమ్ముతున్నారు. ఎయిర్ కెనడా మాజీ ఉద్యోగి అయిన పనేసర్.. ఎయిర్‌లైన్ సిస్టమ్స్‌ను మార్చడం ద్వారా ఈ కార్గో షిప్‌మెంట్‌ను పక్కదారి పట్టించాడని ఆరోపణలు ఉన్నాయి. గతేడాది ఇతడిని చండీగఢ్ శివార్లలోని ఒక అద్దె ఫ్లాట్‌లో గుర్తించినప్పటికీ.. అతడు తప్పించుకుని పారిపోయాడు. ప్రస్తుతం భారత్‌లో ఉన్న పనేసర్ కోసం కెనడా వ్యాప్తంగా అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో పాటు అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల సహకారంతో గాలింపు ముమ్మరం చేశారు.  ఈ భారీ దోపిడీకి సంబంధించి ఇప్పటి వరకు పది మందిపై ఆరోపణలు వచ్చాయి. వారిలో ఎక్కువ మంది భారత సంతతి వ్యక్తులే కావడం గమనార్హం. ముఖ్యంగా తాజాగా అరెస్టయిన అరెసలాన్ చౌదరిపై దొంగతనం, నేరపూరిత కుట్ర వంటి కేసులు నమోదు చేశారు. 2024 మేలో భారత్ నుంచి కెనడాకు వస్తుండగా అర్చిత్ గ్రోవర్ అనే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఎయిర్ కెనడా మాజీ ఉద్యోగి పరంపాల్ సిద్ధూ, అమిత్ జలోటా, ప్రసాత్ పరమలింగం, అలీ రజా తదితరులు ఇప్పటికే అరెస్టు అయ్యారు. మరో నిందితుడు దురాంటే కింగ్-మెక్లీన్ ప్రస్తుతం ఆయుధాల అక్రమ రవాణా కేసులో అమెరికా కస్టడీలో ఉన్నాడు.

వేగవంతంగా అమరావతి రెండో విడత ల్యాండ్ పూలింగ్

  అమరావతిలో పలు ప్రాజెక్టులకు ల్యాండ్ పూలింగ్ జరుగుతోంది.  పెదకూరపాటు సెగ్మెంట్ అమరావతి మండలంలోని 3 గ్రామాల్లో మొదటి రోజే 1000 ఎకరాలు పూలింగ్‌కు ఇచ్చారని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. మూడు గ్రామాల్లో 25 శాతం ల్యాండ్ పూలింగ్ పూర్తైందని చెప్పుకొచ్చారు. అమరావతి మండలం కర్లపూడిలో మంగళవారం (13-1-26) రోడ్డు పనులకు మంత్రి నారాయణ, పెదకూరపాడు ఎమ్మెల్యే బాష్యం ప్రవీణ్ శంకుస్థాపన చేశారు.   ల్యాండ్ పూలింగ్ ప్రారంభానికి వెళ్లిన మంత్రిని రోడ్డు వేయాలని రైతులు కోరారు. రైతులు అడిగిన వెంటనే రోడ్డు నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయించి.. కాంట్రాక్ట్ సంస్థకు పనులు అప్పగించారు. కర్లపూడి నుంచి అనంతవరం వరకు.. 2.9 కిలోమీటర్ల రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. వారం రోజుల్లో రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. భూములిచ్చిన రైతులను తాను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని అన్నారు.  ఎమ్మెల్యే ప్రవీణ్ దగ్గరుండి రైతులను ఒప్పిస్తున్నారని తెలిపారు. అమరావతి అభివృద్ధి జరగాలంటే ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ అవసరమని చెప్పుకొచ్చారు. నెల రోజుల్లోగా 80 శాతం భూమి ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటానని ఎమ్మెల్యే ప్రవీణ్ చెప్పారని అన్నారు. 80 శాతం పూలింగ్ పూర్తి కాగానే మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసి, టెండర్లు పిలుస్తామని వెల్లడించారు.

10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ బంద్

  దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లకు ఊరట లభించింది.  డెలివరీ బాయ్స్ డిమాండ్ మేరకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని ఎత్తివేస్తూ కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆదేశాలు జారీ చేశారు. 10 నిమిషాల్లోనే డెలివరీ అంటూ ప్రకటనలు ఇవ్వొద్దని బ్లింకిట్ సహా అన్ని క్విక్ కామర్స్ సంస్ధలకు కేంద్రం సూచించింది.  కాగా  10 నిమిషాల నిబంధనను ఎత్తివేయాలంటూ కొత్త ఏడాదికి ముందు గిగ్ వర్కర్లు నిరసన చేపట్టారు.డెలివరీ బాయ్స్ తమ ప్రాణాలను పణంగా  ఆన్లైన్ డెలివరీ చేస్తున్నామని కానీ దానికి తగిన ప్రతిఫలం దక్కడం లేదని యూనియన్లు గతంలో ఆందోళన నిర్వహించాయి. 10 నిమిషాల్లో డెలివరీ చేయమని కోరడం అన్యాయం. ఇది రోడ్డు ప్రమాదాలకు దారితీస్తోంది" అని ఐఎఫ్ఏటి ప్రతినిధులు పేర్కొన్నారు. రైడ్-హెయిలింగ్ డ్రైవర్లకు కిలోమీటరుకు కనీసం రూ. 20 చెల్లించాలని రోజుకు 8 గంటల పనివేళలు ఉండాలి. అదనపు సమయం పనిచేస్తే 'ఓవర్‌టైమ్' కింద అదనపు వేతనం ఇవ్వాలని గిగ్ వర్కర్ల డిమాండ్ చేశాయి. ప్రమాదాలు, అనారోగ్యం సంభవించినప్పుడు ఆదుకునేలా ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు కల్పించాలి.తమ కష్టానికి తగిన విలువ ఇవ్వాలని, రోడ్లపై ప్రాణాలకు భరోసా కల్పించాలని గిగ్ వర్కర్లు గట్టిగా కోరుతున్నారు.   

ఉత్తర భారతాన్ని గజగజలాడిస్తున్న చలి పులి... మైనస్ డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు

ఉత్తర భారతాన్ని చలి పులి గజగజలాడిస్తోంది. పలు ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. దేశ రాజధాని నగరం ఢిల్లీలో సాధారణం కంటే 4.4 డిగ్రీలు తక్కువగా  ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. ఢిల్లీలో మంగళవారం (జనవరి 13) అత్యల్పంగా 2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.  ఈ శీతాకాలంలో ఇప్పటి వరకూ ఇదే అత్యధిక కనిష్ట ఉష్ణోగ్రత.  ఇక గాలిలో తేమ శాతం వంద శాతానికి చేరింది. ఇక పంజాబ్, హర్యానాలు కూడా తీవ్రమైన చలిగాలులు, దట్టమైన పొగ మంచుతో అల్లల్లాడుతున్నాయి. ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.  ఉత్తరాదిలోని పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి.  పంజాబ్‌లోని భటిండాలో 0.6 డిగ్రీలు, అమృత్‌సర్, ఫరీద్‌కోట్‌లలో ఒక డిగ్రీ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  హర్యానాలోని గురుగ్రామ్‌లో ఉష్ణోగ్రత జీరో డిగ్రీలకు పడిపోయింది. అయితే గురుగ్రామ్ శివారు ప్రాంతాలలో ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలకు పడిపోయిందని వాతావరణ శాఖ పేర్కొంది.  కాగా  రాజస్థాన్‌లోని  ఫతేపూర్ శేఖావతిలో  మైనస్ 1.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. 

నారావారిపల్లెలో ఘనంగా సంక్రాంతి సంబరాలు.. పాల్గొన్న చంద్రబాబు కుటుంబం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి స్వగ్రామం  నారావారిపల్లెలో  మంగళవారం (జనవరి 13) సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సంబరాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. నారా భువనేశ్వరి, నారా లోకేష్, నారా బ్రహ్మణి, ఇంకా నందమూరి కుటుంబ సభ్యులు గ్రామం అంతా కలియదిరుగుతూ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు.   నారావారి పల్లెలోని టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ముగ్గుల పోటీలను తిలకించారు. అనంతరం స్థానికంగా వివిధ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులకు నిర్వహించిన క్రీడా పోటీలను వీక్షించారు.  ముగ్గులు పోటీలు, క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, భువనేశ్వరి బహుమతులు అందజేశారు. అలాగే  ఈ వేడుకల్లో భాగస్వాములైన ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని  సన్మానించారు. అనంతరం విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో కలిసి గ్రూప్ ఫోటోలు దిగారు.    ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి  భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు సంక్రాంతి కానుకగా రూ. 10,116 చొప్పున ఇస్తున్నట్టు చెప్పారు. అందరికీ సుఖ సంతోషాలు కలగాలని ఆమె ఆకాంక్షించారు. 

గాదె ఇన్నయ్య నివాసం, ఆశ్రమంలో ఎన్ఐఏ సోదాలు

మావోయిస్టులతో సంబంధాలు, వారికి సహకారం అందిస్తున్నారన్న ఆరోపణలతో ఇటీవల అరెస్టు చేసిన సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్య నివాసం, ఆయన నిర్వహిస్తున్న మా ఇల్లు ఆశ్రమంలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు మంగళవారం (జనవరి 13) సోదాలు నిర్వహించారు.  కుషాయిగూడ పరిధిలోని చక్రిపురంలోని  సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్య నివాసం, జనగామలో ఆయన నిర్వహి స్తున్న అనాథాశ్రమంలో నిర్వహించిన తనిఖీలలో కీలక పత్రాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.  మావోయిస్టులకు నిధుల సేకరణ, మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్ మెంట్లు చేయడంతో పాటుగా ,  సానుభూతిపరులుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో గాదె ఇన్నయ్యను కొంత కాలం కిందట ఎన్ఐఏ అరెస్టు చేసింది.  ఇప్పుడు తాజాగా ఆయన నివాసాలలో సోదాలు నిర్వహించింది.  మంగళవారం (జనవరి 13) తెల్లవారు జామునే గాదె ఇన్నయ్య ఇంటిని చుట్టుముట్టి ఆయన  డైరీలు, ఫోన్ కాల్ డేటా, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను పరిశీలించారు. ఇన్నయ్య నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో కూడా సోదాలు నిర్వహించారు. అక్కడ ఎవరెవరు ఉంటున్నారు? ఆశ్రమానికి వస్తున్న నిధుల మూలాలు ఏమిటి? అనే కోణంలో అధికారులు ఆరా తీశారు.  సోదాల అనంతరం కొన్ని కీలక పత్రాలు, పెన్ డ్రైవ్‌లు మరియు ఎలక్ట్రానిక్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.    ఇలా ఉండగా గాదె ఇన్నయ్యను ఐదు రోజుల పాటు కస్టడీ కోరుతూ ఎన్ఐఏ దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన నాంపల్లి కోర్టు తీర్పును ఈ నెల 16కు వాయిదా వేసింది.  కోర్టు తీర్పు వెలువడక ముందే అధికారులు  సోదాలు నిర్వహించడం స్థానికంగా కలకలం రేపింది.